ది కశ్మీర్ ఫైల్స్.. ఉరి తీయండంటున్న ఫరూఖ్ అబ్దుల్లా

0
927

దేశ వ్యాప్తంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఎంత ప్రభావం చూపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు ప్రముఖులు ఈ సినిమా గురించి స్పందిస్తూ ఉన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో తన పాత్ర గురించి జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ, “కశ్మీరీ పండిట్‌ల విషయంలో నా హృదయం ఇంకా రక్తమోడుతోంది. నేను దోషిగా తేలితే నన్ను ఉరితీయండి” అని అన్నారు. ఆ సినిమా ఒక నిర్దిష్ట సమాజంపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. అది కేవలం ప్రచార ఆర్భాటం కోసం తీసిందని ఆయన కొట్టిపారేశారు. హిందువులు, ముస్లింలకు జరిగిన ఆనాటి విషాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి సొమ్ము చేసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

1990 నాటి ఘటనలకు తాను బాధ్యుడని తేలితే దేశంలో ఎక్కడైనా ఉరితీయించుకోడానికి సిద్ధంగా ఉన్నానని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ‘‘నిజాయితీగల న్యాయమూర్తిని లేదా కమిటీని ఏర్పాటు చేస్తేనే నిజం బయటపడుతుంది. ఎవరు బాధ్యులనే విషయం మీకే తెలుస్తుంది. ఫరూక్ అబ్దుల్లా బాధ్యుడైతే దేశంలో ఎక్కడైనా ఉరి తీయడానికి ఫరూక్ అబ్దుల్లా సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట మీద నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విచారణ అవ్వకుండా.. ఇతర వ్యక్తులను నిందించవద్దు” అని ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫారూఖ్ అబ్దుల్లా తెలిపారు. విచారణకు తాను సిద్ధమని, కానీ, ఏమీ తెలియని అమాయకులను ఇందులో ఇరికించి బలి చేయవద్దని కోరారు. కశ్మీరీ పండిట్ల వలసలకు తాను ఎలాంటి కారణమూ కాదన్నారు. నిజానిజాలేంటో తెలియాలంటే ఆనాటి ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతి లేదా ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను అడగాలని చెప్పారు.

నిజాయతీపరులైన న్యాయమూర్తి లేదా కమిటీతో దర్యాప్తు చేయిస్తే అసలు విషయాలు బయటపడతాయని, ఎవరు బాధ్యులన్నది తెలుస్తందని చెప్పారు. కశ్మీరీ పండిట్లపై అఘాయిత్యాలకు ఫరూఖ్ అబ్దుల్లా కారణమని తేలితే.. ఆ ఫరూఖ్ అబ్దుల్లా ఉరికి సిద్ధమన్నారు.
ఒక్క కశ్మీరీ పండిట్లకే జరిగిన అన్యాయాన్నే కాకుండా సిక్కులు, ముస్లింలకూ జరిగిన అన్యాయాలనూ నిజనిర్ధారణ కమిటీ వెల్లడించాలన్నారు.

సినిమాపై విమర్శలు:

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విమర్శిస్తూ ఇది కొందరికి లాభం కలిగించే ఒక ప్రచార చిత్రం. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే సినిమా ఇది. కొన్ని రాజకీయ పార్టీలకు లాభం కలిగించే చిత్రం ఇది. సిక్కులు, ముస్లింల వంటి ఇతర వర్గాల త్యాగాలను ఈ చిత్రం విస్మరించి, ఒక వర్గానికి మాత్రమే సంబంధించిన సినిమా ఇది. “ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటే, అప్పట్లో ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముసర్ రజా లేదా ఆ సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఆరిఫ్ ముహమ్మద్ ఖాన్ వంటి వారితో మాట్లాడగలరు” అని ఆయన అన్నారు.

జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ద్వారా 1989లో ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా కిడ్నాప్ గురించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ, “మేము పట్టుకున్న ఐదుగురిని విడుదల చేయాలని వారు [కేంద్రం] కోరినప్పుడు, నేను నిరాకరించాను. అప్పట్లో భారత ప్రభుత్వానికి బీజేపీ మద్దతుతో వీపీ సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి గురించి ఈ విధంగా మాట్లాడటం తప్పుగా అనిపిస్తుంది, కానీ కాశ్మీరీ పండిట్‌లను బస్సుల్లో ఎక్కించింది ఆ నాటి గవర్నర్ అని మనం గుర్తుంచుకోవాలి” అని అన్నారు.

“ప్రజలు మీకు భిన్నమైన కథలు చెబుతారు, కానీ నిజాయితీ గల న్యాయమూర్తి లేదా సత్యాన్ని కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు నిజం బయటకు వస్తుంది. ఫరూక్ అబ్దుల్లా బాధ్యుడు అయితే, అతను దేశంలో ఎక్కడైనా ఉరితీయడానికి సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు. ముస్లింలు, హిందువులు అనే తేడా లేకుండా ప్రజల హృదయాలను గెలుచుకోవడమే ఇప్పుడు ముందుకు వెళ్లేందుకు ఏకైక మార్గమని అన్నారు. సినిమా గాయాలను తెలియజేసిందని, ఆ గాయాలను మాన్పేందుకు ప్రధాని, ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నించాలని ఆయన అన్నారు.