Special Stories

ఇక దేశీ అమేజాన్..!
ఈ-కామర్స్ గుత్తాధిపత్యానికి కేంద్రం చెక్..!!

అమెజాన్, గూగుల్, ఫేస్‎బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్మించుకున్న.. గుత్తాధిపత్య డిజిటల్ చైన్‎ను మోదీ ప్రభుత్వం కుప్పకూల్చబోతోంది. చిన్నవ్యాపారులను చిదిమేస్తున్న మల్టీనేషనల్ సంస్థలకు చెక్ పెట్టబోతోంది. ఇందులో భాగంగా.. ఆధార్ సృష్టికర్త, ఇన్ఫోసిస్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నందన్ నీలేకనికి మోదీ సర్కార్‌ కీలక బాధ‍్యతలను అప్పగించింది. డిజిటల్ మోనోపలీకి చెక్‌పెట్టే మార్గాలపై సలహా ఇచ్చే ప్రభుత్వ ప్యానెల్‌లో నీలేకనిని సభ్యుడిగా చేర్చింది. తద్వారా ఈకామర్స్‌ రంగంలో అక్రమాలకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సప్లయ్‌ చెయిన్‌ను డిజిటలైజ్ చేయడం, కార్యకలాపాలను ప్రామాణీకరించడం, మరికొంతమంది సరఫరాదారులను చేర్చడాన్ని ప్రోత్సహించడం, లాజిస్టిక్స్‌ సామర్థ్యాలు, వినియోగదారులకు విలువను పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి రూపకల్పన చేస్తోంది.

ఈ క్రమంలోనే డిజిటల్‌ గుత్తాధిపత్యాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ తొమ్మిది మంది సభ్యుల సలహా మండలిలో నందన్‌ నీలేకనిని కూడా చేర్చింది. నందన్‌ నీలేకని ఇప్పటికే UIDAI చైర్మన్‌ గానూ, టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్, న్యూ పెన్షన్ స్కీమ్, GST సహా ఐదు కీలక ఆర్థిక రంగ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వ సాంకేతిక సలహా బృందానికి నాయకత్వం వహించి.. విజయవంతమయ్యారు. అందుకే, కొత్త బాధ్యతలను నందన్ నీలేకనికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. ఆయన నతృత్వంలో తొమ్మిది మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఐటీ దిగ్గజం నందన్‌ నీలేకనీతో పాటు, నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ, క్యూసిఐ చీఫ్ ఆదిల్ జైనుల్‌ భాయ్, అవానా క్యాపిటల్ వ్యవస్థాపకుడు అంజలి బన్సాల్, డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ దిలీప్ అస్బే ఉన్నారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ హెడ్ సురేష్ సేథి, ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ చీఫ్ ప్రవీణ్ ఖండేల్వాల్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు.

‘ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’ పేరుతో ఏర్పటవుతున్న ఈ కమిటీ.. నిబంధనల అమలును వేగంగా ట్రాక్ చేయడానికి సూచనలు ఇస్తుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వాణిజ్య శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మండలి జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రాథమికంగా డిజిటల్ గుత్తాధిపత్యాలను అరికట్టడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుంది.

ప్రస్తుతమున్న ఈ కామర్స్ సైట్స్ ద్వారా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి బడా సంస్థలు మాత్రమే లాభాలను కొల్లగొడుతున్నాయి. దీంతో చిరు వ్యాపార సంస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలతో పాటు.. చిన్న వ్యాపార సంస్థలను కూడా డిజిటల్ ప్లాట్‎ఫామ్‎లోకి తీసుకొచ్చి.. ప్రభుత్వమే అనుసంధానకర్తలా వ్యవహరించాలనేది ONDC ముఖ్య ఉద్దేశం. దీనివల్ల చిన్న పరిశ్రమలతో పాటు.. వస్తు ఉత్పత్తిదారులైన రైతులకు, చిరు వ్యాపారులకు కూడా మంచి జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా ఈ కొత్త విధానం వల్ల సప్లయి చైన్ కూడా సులభతరంగా మారుతుంది.

ఈ ఓపెన్ సోర్స్ విధానం.. అమెజాన్ వంటి అన్ని బడా విక్రేతలకే కాకుండా.. అన్ని రకాల ప్రొవైడర్లకు అందుబాటులో వుంటుంది. తద్వారా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు.. వినియోగదారుడి ఆసక్తి ఆధారంగా విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యపడదు. ఎందుకంటే ఈ నెట్‌వర్క్ ఈ ప్లాట్‌ఫామ్‎ల సేవలకు ఒక వైపు నుంచి మాత్రమే మాత్రమే ఛార్జీలు వసూలు చేయడానికి అవకాశం వుంటుంది. ఉదాహరణకు స్విగ్గీ సంస్థను పరిగణలోకి తీసుకుంటే.. కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్‎పై రెస్టారెంట్ తో పాటు.. కస్టమర్ దగ్గర కూడా స్విగ్గీ సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుంది. అయితే, కొత్త విధానంలో కేవలం కస్టమర్ నుంచి మాత్రమే సర్వీస్ ఛార్జీలు వసూలు చేసే అవకాశం వుంటుంది. దీంతో విక్రేతల మధ్య వివక్ష చూపడానికి అవకాశం వుండదు.

పైగా కస్టమర్ ఆర్డర్ చేసిన ఏరియాలోనే స్థానిక ఉత్పత్తిదారుల ద్వారా తక్షణ డెలివరీ సాధ్యపడుతుంది. తద్వారా అమెజాన్ వంటి పెద్ద సంస్థల గోడౌన్లపై భారం తగ్గుతుంది. దీనివల్ల ఆయా కంపెనీల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. దీంతో వినియోగదారుడికి మరింత తక్కువ ధరకు వస్తు ఉత్పత్తులు లభిస్తాయి. మొత్తానికి, ONDC విధానం ద్వారా.. చిన్న వ్యాపార సంస్థలు, వినియోగదారులతో పాటు అటు, అమెజాన్ వంటి పెద్ద సంస్థలు కూడా లాభపడతాయి.

అంతేకాకుండా, కొత్త ఓపెన్ సోర్స్ విధానం వల్ల ఈ-కామర్స్ సేవల్లోకి మరిన్ని సంస్థలు చేరే అవకాశం వుంది. ఉదాహరణకు, ఓపెన్ సోర్స్ నెట్‌వర్క్ అయిన యూపీఐ ఆధారంగా ఏ కంపెనీ అయినా పేమెంట్స్ ప్లాట్ ఫామ్ ను రూపొందించుకోవచ్చు. ఈ వెసులుబాటు వల్లనే యూపీఐ ప్రారంభించిన ఐదేళ్ళలోనే వందలాది పేమెంట్ సర్వీస్ సంస్థలు ఉద్భవించాయి. దాదాపు ప్రతి బ్యాంక్, అలాగే పేమెంట్ బ్యాంక్, యుపిఐ ఆధారంగా వాటి సొంత వేదికలను నిర్మించుకున్నాయి. అలాగే ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఆధారంగా ఫేస్ బుక్, వాట్సాప్, జియో, ఎయిర్ టెల్, పాంటాలూన్స్.. ఇలా సంస్థ అయినా ఈ-కామర్స్ వేదికలను నిర్మించుకోగలుగుతాయి.

మొత్తానికి, భౌతికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలకు.. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లు నిర్మించుకోవడానికి ONDC దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు.. ప్రజలను, చిన్న తరహా వ్యాపార సంస్థలను ఇంటర్నెట్ ఫ్రెండ్లీగా మార్చేస్తుంటే.. భారత్ మాత్రం ఈ విధానాన్ని రివర్స్ లో అభివృద్ధి చేస్తోంది. ఇంటర్నెట్ నే పీపుల్ ఫ్రెండ్లీగా, బిజినెస్ ఫ్రెండ్లీగా మార్చేస్తోంది. చెల్లింపుల కోసం యూపీఐని వినియోగించడం ద్వారా ప్రపంచ దేశాలు గొప్ప విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఇదే విధానాన్ని వివిధ రంగాలు విస్తృతం చేస్తూ.. భారత్ కొత్త ప్రయోగానికి తెరతీసింది. అయితే, ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ విజయవంతమైతే గనుక.. ప్రపంచ దేశాలన్నీ భారత్ నే అనుసరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

twenty + 5 =

Back to top button