More

    ఇది రక్షణ దుర్గం..! మోదీ వలయం..!!

    ‘‘Indian defence policy is a subject that is often much-debated, but much less understood’’-తరచూ చాలా చర్చ జరిగి, ఏమీ అర్థం చేసుకోకుండా వదిలేసిన అంశం భారత రక్షణ విధానం… అనే వ్యాఖ్య తరచూ భద్రతా బలగాలకు సంబంధించిన చర్చల్లో వినిపిస్తూ ఉంటుంది.

    సమన్వయం లేని సైన్యం, ఏక సూత్రత లేని రణస్థలి, ఆజ్ఞానుసారంగా లేని ఆయుధ వినియోగం యుద్ధంలో విజయాన్ని అసాధ్యం చేస్తుందని హెచ్చరిస్తుంది భారత ప్రాచీన యుద్ధకళ. భారత సైన్యం సంఖ్యను చూస్తే ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద బలగం. త్రివిధ దళాలూ, శాఖలుగా విస్తరించిన వివిధ నిఘా విభాగాల సంఖ్య మొత్తం సుమారు 12 లక్షలు.

    ఇంత భారీ సంఖ్యలో గల సైన్యం దశాబ్దాలుగా అనేక రకాల కొరతలను ఎదుర్కొంటోంది. స్వదేశీ తయారీ కన్నా విదేశీ దిగుమతులపై మన బలగాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఆయుధ దిగుమతి, సేకరణ విధానం కూడా అత్యంత లోప భూయిష్టంగా ఉంది.

    రక్షణ విధానంలో కేంద్రం ప్రవేశపెడుతున్న మార్పులేంటి? ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఏర్పాటు ఎలా ఉండబోతోంది? థియేట్రైజేషన్, జాయింట్ ఫోర్సెస్ ప్రక్రియ అంటే ఏంటి? నేషనల్ ఇంటెలీజెన్స్ గ్రిడ్ ఏర్పాటు వల్ల వచ్చే మార్పులేంటి? భారత సైనిక స్వరూపం ఎలా ఉంటుంది? మన భూ, తీర ప్రాంత సరిహద్దు వివరాలేంటి? సుబ్రమణియమ్ నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ సిఫారసులు ఏంటి? Goldwater Nichols Act 1986 అంటే ఏంటి? India’s defence procurement policy ఎలా ఉండబోతోంది?

    త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం ‘ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్స్‌’ను ఏర్పాటు చేయడం సైనిక సంస్కరణల్లో కీలక నిర్ణయమని కేంద్రం భావిస్తోంది. సైనిక సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ‘చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌-సీడీఎస్‌’ను ఏర్పాటు చేసింది. థియేటర్‌ కమాండ్స్‌  పూర్తిస్థాయిలో అమల్లోకి తేవడం కోసం కేంద్ర రక్షణ శాఖ కసరత్తు మొదలుపెట్టింది.

    గతేడాది తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు ఐక్యంగా ఎదుర్కొన్న నేపథ్యంలో థియేట్రైజేషన్, జాయింట్ ఫోర్సెస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. భవిష్యత్తులో సాయుధ దళాల విలీనం తప్పని సరిగా చోటు చేసుకోవాల్సిందే అంటారు నిపుణులు. త్రివిధ దళాల మధ్య సమన్వయానికి, వనరుల అత్యుత్తమ వినియోగానికి బలగాలను ఒకే గొడుగు కిందకు తేవడం అత్యవసరం.  

    ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు ఒక కమాండర్‌ నేతృత్వంలో ప్రణాళికాబద్ధంగా, ఐకమత్యంగా ఉమ్మడి మిలటరీ లక్ష్యం కోసం సమర్ధవంతంగా, సమన్వయంతో పనిచేసేందుకు ఏర్పాటు చేసేవే ‘ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్స్‌’.

    నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014 లో ఏర్పడిన ఏన్డీఏ ప్రభుత్వం రక్షణ విధానంలో సమూల మార్పులను ప్రవేశపెట్టే పనికి శ్రీకారం చుట్టింది. 1947-1999 వరకు సుమారు 5 దశాబ్దాల రక్షణ విధానాన్ని పున: పరిశీలించింది. తప్పిదాలను విశ్లేషించింది. బలగాల సమన్వయంలో లోపాలను, నిఘా విభాగాల పనితీరులో రావాల్సిన మార్పులు, బలగాల మూకుమ్మడి దాడి అవసరాన్ని గుర్తించింది.

    ఇందుకోసం నాలుగు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది.

    1. త్రివిధ దళాల సమన్వయం కోసం CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు చేయడం
    2. NATGRID- నేషనల్ ఇంటెలీజెన్స్ గ్రిడ్ ఏర్పాటు
    3. India’s defence procurement policy- భారత ఆయుధ సేకరణ విధాన పున:సమీక్ష
    4. ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్స్‌, జాయింట్ ఫోర్సెస్ ప్రక్రియ

    2020, జనవరిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా – బిపిన్ రావత్ ను నియమించింది. నేషనల్ ఇంటెలీజెన్స్ గ్రిడ్ సెప్టెంబర్ చివరి వారంలో ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభమవుతుందని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. అంటే తొలి రెండు సంస్కరణలు మిగతా సంస్కరణలు ముందు షరతుగా చేయాల్సినవి కాబట్టి వాటిని త్వరితగతిన చేసింది కేంద్రం. మలిదశలో మిగతా రెండు సంస్కరణలను మొదలు పెట్టింది.

    సైనిక స్వరూపం తెలిస్తే రక్షణశాఖకు సంబంధించిన అంశాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి కాబట్టి, కొన్ని అవసరమైన ప్రాథమిక అంశాలు చెప్పి…సైనిక సంస్కరణలకు సంబంధించిన విషయంలోకి వస్తాను. కాల్బలగమే… ప్రధానంగా ఉన్న భారత సైన్యం-ఏడు కమాండ్ లుగా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రధాన కేంద్రం దేశ రాజధాని ఢిల్లీలో ఉంటుంది.

    ఏడు కమాండ్స్ ఏంటో చూద్దాం…

    1. Northern command – ఉధంపూర్ లో ఉంది. ఉధంపూర్ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్ లో ఉంది. ఈ కమాండ్ కింద 7 డివిజన్లు, 3 కోర్ యూనిట్లు, ఒక బ్రిగేడ్ ఉన్నాయి.
    2. Army training command –హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లా లో ఉంది.
    3. Western command – పంజాబ్ లోని చాందీమందిర్ లో ఉంది. 9 డివిజన్లు, 3 కోర్ యూనిట్లు, 6 బ్రిగేడ్లు ఉన్నాయి.
    4. Central command – ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఉంది. –ప్రస్తుతానికి ఈ కమాండ్ కింద ఎలాంటి యూనిట్లూ లేవు. వీటన్నింటినీ south western command కు అసైన్ చేసింది రక్షణ శాఖ.
    5. South western command – రాజస్థాన్ లోని జైపూర్ లో ఉంది. 7 డివిజన్లు, 2 కోర్ యూనిట్లు, 3 బ్రిగేడ్లు ఉన్నాయి.
    6. Eatern command – పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతలో ఉంది-  ఈ కమాండ్ కింద 12 డివిజన్లు మరో 4 కోర్ యూనిట్లూ పనిచేస్తాయి.
    7. Southern command – మహారాష్ట్రలోని పుణెలో ఉంది. 6 డివిజన్లు, 2 కోర్ యూనిట్లు, 3 బ్రిగేడ్లు ఉన్నాయి.

    ఈ ఏడు కమాండ్లతో సంబంధం లేకుండా ఆగ్ర కేంద్రంగా పారచూట్ బ్రిగేడ్ ఉంది. ఇది పూర్తి స్వతంత్రంగా ఉంటుంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆదేశాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. భారత వాయుసేన, తీర రక్షక దళాలకు సంబంధించిన కమాండ్లు కూడా ఉన్నాయి. సందర్భానుసారంగా వాటి వివరాలు వెల్లడిస్తాను.

    తాజా సంస్కరణలో ఉధంపూర్ లోని Northern command ను యధాతథంగా ఉంచి మిగతా ఆరు కమాండ్లను సమన్వయం చేసే పనిలో ఉంది రక్షణ శాఖ. భారత సైన్యంలో బ్రిటీష్ కాలం నుంచీ నార్తర్న్ కమాండ్ ఉనికిలో ఉంది. వలసపాలన కాలంలో 1895లో నార్తర్న్ కమాండ్ ఏర్పడింది. 1942లో నార్త్ వెస్టర్న్ ఆర్మీగా మార్చారు. దీని ప్రధాన ఉద్దేశం వాయువ్య సరిహద్దును కాపాడటం. కోహాత్, బలూచిస్థాన్, పెషావర్, వజిరిస్థాన్, రావల్పిండి నార్తర్న్ కమాండ్ కింద ఉండేవి.

    1947లో దేశ విభజన తర్వాత నార్త్ కమాండ్ ప్రధాన కేంద్రం పాకిస్థాన్ సైన్యానికి ప్రధాన కేంద్రంగా మారింది. దీంతో నాటి భారత ప్రభుత్వం నార్తర్న్ కమాండ్ రద్దు చేసి కొత్తగా ఉత్తర సరిహద్దుల పహారా కోసం 1972లో నార్తర్న్ కమాండ్ ను ఉధంపూర్ లో ఏర్పాటు చేసింది. అత్యంత కీలకమైన స్థానంలో ఉండటం వల్ల, పాక్, చైనా సరిహద్దులతో పాటు, జమ్మూ-కశ్మీర్ లో కౌంటర్ టెర్రరిజాన్ని అరికడుతున్న కారణంగా నార్తర్న్ కమాండ్ ను సంస్కరణల నుంచి మినహాయించారు.

    మహాదళపతిగా పిలిచే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఇటివల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. భారత వాయుసేన పదాతిదళానికి కేవలం సహాయక విభాగమంటూ చేసిన వ్యాఖ్యపై తీవ్రమైన చర్చ జరిగింది. త్రివిధ దళాల్లో ఏ దళాన్నీ తక్కువ చేయాల్సిన అవసరం లేదు కానీ, సీడీఎస్ అన్నమాటలో ఒక వాస్తవాన్ని గుర్తించాలి. భౌగోళిక విస్తృతి ఉన్న దేశాలకు, తీర ప్రాంతం విస్తారంగా ఉన్నదేశాలకు మధ్య సైనిక పొందికలో వ్యత్యాసం ఉంటుంది. భారత దేశంలో మొత్తం తీర ప్రాంతం విస్తీర్ణం 7516.6 కి.మీటర్లు. మొత్తం భౌగోళిక సరిహద్దు 15వేల 106 కి.మీటర్లు. 29 రాష్ట్రాల్లో కేవలం 5 రాష్ట్రాలకు మాత్రమే అంతర్జాతీయ సరిహద్దులు లేవు.

    అంటే భారత సైనిక పొందికలో తీరప్రాంత దళం, పదాతిదళమే ప్రధాన భూమిక పోషిస్తుంది. అయితే యుద్ధ సమయాల్లో పదాతి దళాలకు, తీరప్రాంత దళాలకు ప్రధాన, కీలక రక్షణగా నిలిచేది వాయు సేన మాత్రమే. వాయుసేన లేకుండా కాల్బలగాలు, తీరప్రాంత గస్తీ దళాలు పూర్తి రక్షణలో యుద్ధం చేయలేవు.

    బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలో ఒకింత వాస్తవం ఉంది. తక్కువ చేయనక్కరలేదు కానీ, తక్షణ సరిహద్దు సమస్యలు, ఘర్షణలు వచ్చినప్పుడు పదాతిదళాలను, తీరప్రాంత దళాలను వాడినంత వేగంలో వాయుసేనను ఆదేశించలేదు రక్షణ శాఖ. అందులో చాలా చిక్కులుంటాయి కాబట్టి.

    రక్షణ రంగ సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు…. CLAWS-సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ ఫేర్ స్టడీస్ ఆగస్ట్ సంచికలో  కల్నల్ అజింక్యా జాదవ్ రాసిన ‘Theaterisation’: A Desideratum for National Security’ వ్యాసాన్ని ఆధారంగా చేసుకుని సాధికారికమైన వివరాలు వెల్లడించే ప్రయత్నం చేస్తాను.

    భద్రతా బలగాల సమన్వయం అనే చర్చ, అందుకు సంబంధించిన ప్రయత్నాలు ఎప్పుడు మొదలయ్యాయి? ఎవరు పూనిక వహించారు? ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. భారత రక్షణ వ్యూహకర్త, ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ తండ్రి కే.సుబ్రమణియమ్ రక్షణ బలగాల సమన్వయం గురించి సుదీర్ఘ కాలం కృషి, ప్రయత్నాలు చేసిన గొప్ప వ్యక్తి. 1980లో కె.సుబ్రమణియం, జనరల్ ఎస్.కే. సిన్హాలు jointness and  integration గురించి పదే పదే ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.

    1999లో కార్గిల్ యుద్ధం తర్వాత 2000లో నాటి వాజ్ పాయ్ ప్రభుత్వం కే.సుబ్రమణియం నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్గిల్ రివ్యూ కమిటీ సైతం బలగాల సమన్వయం గురించి మరోసారి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. త్రివిధ దళాల మధ్య సమన్వయం లోపించిందని స్పష్టంగా నివేదికలో పేర్కొంది. సత్వరమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు అవసరమని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.

    అంతేకాదు, జాయింట్ థియేటర్ కమాండ్స్ తో పాటు integration of the services with Ministry of Defence –MoD త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పింది. 2001లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమర్పించిన “Reforming the National Security System” నివేదికలో కూడా CDS ఏర్పాటు అవసరాన్ని నొక్కి చెప్పారు. 7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో అనేక సార్లు చర్చలోకి వచ్చి ప్రతిపాదనలుగా మిగిలిపోయిన కీలక సంస్కరణలు మోదీ ప్రభుత్వం ప్రస్తుతం అమల్లోకి తెస్తోంది. మరిన్ని వివరాలు మరో కథనంలో తెలియజేస్తాను.

    Related Stories