More

  ISI గూఢాచారిగా దోవల్..? స్వర్ణమందిరంలో ‘రిక్షావాలా’..!

  ‘‘ఉపాయం, ఆయుధాన్ని గేలి చేస్తుంది. మోసం, ఉపాయాన్ని చూసి హాస్యమాడుతుంది. అన్నింటినీ మించి ‘దగా’ యుద్ధంలో విజయాన్ని సునాయాసం చేస్తుంది. అంటాడు కార్ల్ వోన్ క్లాస్ విట్జ్ తన ‘‘ON WAR’’ పుస్తకంలో. భరతదేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యుద్ధంలో ఉపాయం, మోసం, దగా ఎలాంటి పాత్ర పోషిస్తాయో అనుభవంలో తెలుసుకుని, అత్యద్భుతంగా conceptualize చేశారు. ఈ అనుభవ సారాన్నే ప్రస్తుతం దేశ భద్రతకోసం సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.

  1975-77 రెండేళ్లపాటు అమలయిన అత్యయిక పరిస్థితి తర్వాత 80ల ఆరంభంలో పంజాబ్ లో పేట్రేగిన వేర్పాటువాద ఉగ్రవాదం పాకిస్థాన్ అండతో చెలరేగిపోయింది. పంచనదుల తీరంలో రక్తపుటేరులు పారాయి. ఇందిరా గాంధీ ప్రభుత్వం ఒక దశలో అకాలీదళ్ ను నిలువరించేందుకు ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించింది.

  తాము పెంచి పోషించిన వేర్పాటువాద నేత జర్నల్ సింగ్ బింద్రన్ వాలే చివరకు ‘ఫ్రాంకెన్ స్టీన్’లా మారడంతో,  ఖంగుతిని-సిక్కుల మతవిశ్వాస  ప్రతీక అయిన స్వర్ణమందిరంపై 1984, 86, 88లో దాడి చేశాయి నాటి ఇందిర-రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు. వాటి పేరే ఆపరేషన్ బ్లూస్టార్, ఆపరేషన్ బ్లాక్ థండర్ -1, ‘ఆపరేషన్ బ్లాక్ థండర్-2’. ఈ  చివరి ఆపరేషన్ లో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఐఎస్ఐ ఏజెంట్ రూపంలో స్వర్ణ మందిరంలోకి ప్రవేశించి ‘‘Battle arch’’ ను పరిశీలించి-ఆపరేషన్ కు లైన్ క్లియర్ చేశారు.

  ‘ఖలిస్థాన్’ వేర్పాటువాద మూలాలేంటి? జర్నల్ సింగ్ బింద్రన్ వాలేను ఇందిరాగాంధీ ఎందుకు ప్రోత్సహించారు? ఖలిస్థాన్ ఉద్యమంలో సంజయ్ గాంధీ పాత్ర ఏంటి? అజిత్ దోవల్ ఐఎస్ఐ ఏజెంట్ గా స్వర్ణమందిరంలోకి ప్రవేశించి ఏం తెలుసుకున్నారు?  

  ఆపరేషన్ బ్లూస్టార్ లో దొర్లిన మిలటరీపరమైన తప్పిదాలను పునారావృతం కాకుండా ఉండేందుకు దోవల్ సూచించిన జాగ్రత్తలేంటి? తొలిదశలో ఖలిస్థాన్ ఉగ్రవాదానికి RAW మద్దతు పలికింది నిజమేనా? ఆపరేషన్ బ్లాక్ థండర్-2 లో దోవల్ పోషించిన పాత్ర ఏంటి? ఖలిస్థాన్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతు పలికిందా? సరబ్ జిత్ సింగ్ రాసిన ‘‘Operation Black Thunder: An Eyewitness Account of Terrorism in Punjab’’ పుస్తకంలో ఆపరేషన్ వివరాలను పూసగుచ్చినట్టూ తెలియజేసే ప్రయత్నం చేశారా? ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  భారతదేశ రాజకీయ చరిత్రలో ‘ఖలిస్థాన్’ ఉద్యమానికీ, ఉగ్రవాదానికీ ప్రత్యేక స్థానం ఉంది. దేశ సైనిక చరిత్రలో 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’, 1986లో చేపట్టిన ‘ఆపరేషన్ బ్లాక్ థండర్-1’ ఆ తర్వాత చివరగా 1988లో చేసిన ‘ఆపరేషన్ బ్లాక్ థండర్-2’కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రధాని హత్యకు పురికొల్పిన, సిక్కుల ఊచకోతకు కారణమైన, కాంగ్రెస్ కు మరోసారి జీవం పోసిన, సిక్కు-హిందూ వైరానికి ఆజ్యం పోసిన, ఐఎస్ఐ జోక్యానికీ ఆస్కారం కల్పించిన ఘనత ఖలిస్థాన్ ఉగ్రవాదానికి దక్కుతుంది.

  ప్రజాస్వామికంగా ఏర్పడిన ఒక ప్రభుత్వం విశ్వాస ప్రతీకపై సాయుధ దాడికి దిగిన మూడు సంఘటనలు ఆపరేషన్ బ్లూస్టార్, ‘ఆపరేషన్ బ్లాక్ థండర్1,2’. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ప్రధాని; వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిన అరుదైన ఘటన ఇది.  దేశంలో అత్యంత కీలక నిఘావిభాగం RAW ఒక అనవసర ఉద్యమానికి ఊతమిచ్చిన పరిణామం కూడా ఇదే!

  ఈ విపరిణామం ఇక్కడితో ఆగలేదు, కెనడా, అమెరికా, యూరప్ దేశాల్లోని ప్రవాస భారతీయ సిక్కులు ఖలిస్థాన్ వేర్పాటువాదానికి బాహటంగా మద్దతు తెలిపిన ప్రమాదకరమైన సందర్భం కూడా ఇదే! దేశ అంతర్గత భద్రతకూ, సమగ్రతకూ సవాలు విసిరిన పరిణామం ఖలిస్థాన్ వేర్పాటువాదం.

  వేర్పాటువాదం-మత విశ్వాసాల ప్రతిపదిక ఈ రెంటి ఆధారంగా తలెత్తిన జాట్ సిక్కు వేర్పాటువాదాన్ని తొలుత ప్రోత్సహించింది నాటి ప్రధాని ఇందిరాగాంధీ. ఇందిర వ్యక్తిగత ప్రోత్సాహం-రాజకీయ ప్రయోజనం అంత వరకే అది పరిమితం కాలేదు; చివరకు ప్రభుత్వ యంత్రాంగం సైతం ‘ఖలిస్థాన్’ వేర్పాటువాదం బలపడేందుకు కారణభూతమైంది.

  అత్యున్నత విదేశాంగ నిఘా సంస్థ ‘research and analysis wing’ కూడా ఈ ప్రోత్సాహక ప్రణాళికలో భాగం కావడం దేశ చరిత్రలో అత్యంత విషాదం. అంతే కాదు, హిందూ-సిక్కు మైత్రి చారిత్రకమైంది. మొఘల్, పర్షియా, ఆప్ఘన్ దండయాత్రలను నిలువరించిన హిందూ-సిక్కు బంధం మొదటి దఫా ఉపఖండ విభజన కాలంలో, రెండో సారి సిక్కు ఉగ్రవాదం పెల్లుబికిన తర్వాత శతృ సంబంధంగా పరిణమించింది.

  ఎమర్జెన్సీ ఎత్తివేసిన సుమారు ఐదు నెలల తర్వాత 1977 ఆగస్ట్ లో సంత్ జర్నల్ సింగ్ బింద్రన్ వాలే సిక్కు మత సంస్థ ‘దమ్ దమీ తఖ్సల్’ జోతేదార్ గా బాధ్యతలు చేపట్టాడు. ఎమర్జెన్సీ కారణంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది.

  అకాలీదశ్-జనతాపార్టీ కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. బింద్రన్ వాలే  ‘దమ్ దమీ తఖ్సల్’  జోతేదార్ బాధ్యతలు చేపట్టడాన్ని అకాలీదళ్ వ్యతిరేకించింది. అకాలీ కూటమి ప్రభుత్వం తనను తక్కువ అంచనా వేస్తోందని బింద్రన్ వాలే భావించాడు. దీనికి తోడు నిరంకారీ తెగ సిక్కులు తమపై దాడులకు దిగినా ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆగ్రహంతో రగిలిపోయాడు.

  1977 ఏప్రిల్ 13 వైశాఖీ రోజు నిరంకారీలకు, సిక్కులకూ మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 14 మంది మరణిచడంతో బింద్రన్ వాలే పేరు మొదటిసారి దేశమంతటా మారుమోగిపోయింది. పంజాబ్ లో అకాలీదళ్ ప్రభావాన్ని తగ్గించాలంటే బింద్రన్ వాలేను ప్రోత్సహించడం అవసరమని భావించారు సంజయ్ గాంధీ, జైల్ సింగ్. అప్పటికే ఖల్సా ఉద్యమ స్ఫూర్తితో ఉన్న బింద్రన్ వాలే వెన్ను తట్టింది కాంగ్రెస్.

  ఆనంద్ పూర్ సాహిబ్ తీర్మానం అమలుపై పట్టుబట్టిన హర్ చరణ్ సింగ్ లోంగోవాల్, శిరోమణీ గురుద్వారా ప్రబంధక్ కమిటీ చైర్మన్ జి.ఎస్.తొహ్రా, నాటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ త్రయాన్ని నియంత్రించాలంటే బింద్రన్ వాలేను ప్రోత్సహించడమే మార్గమని సంజయ్ గాంధీకి సలహా ఇచ్చాడు జైల్ సింగ్. బింద్రన్ వాలే బలపడటం అకాలీదళ్ కు జీర్ణం కాదు. దీంతో సిక్కు ప్రయోజనాల గురించి మాట్లాడ్డం అకాలీదళ్ అనివార్యంగా మారుతుంది.

  ఈ పరిణామాలు సహజంగానే జనతాపార్టీకి నచ్చదు. అందుకు ప్రధాన కారణం జనతా పార్టీ ప్రధానంగా పట్టణ ప్రాంత హిందూ వ్యాపార వర్గ ప్రయోజనాల మూలంగా పంజాబ్ లో మనుగడ సాగిస్తోంది. అంటే బింద్రన్ వాలే ఎదుగుదల అకాలీ-జనతాపార్టీల మధ్య విభేదాలకు కారణమవుతుందని జైల్ సింగ్ అంచనా.

  సంజయ్ గాంధీకి సన్నిహితులు కమల్ నాథ్, జైల్ సింగ్ లు మొత్తంగా బింద్రన్ వాలేకు పరోక్ష మద్దతు ఇవ్వడం విషయంలో ఒక అంగీకారానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే 1977 చివరి నాటికి కాంగ్రెస్, బింద్రన్ వాలే బంధం గాఢమైంది. ఆర్థిక సహకారం అందింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే 1980, జనవరి చివరి నాటికి ఇందిరాగాంధీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టే నాటికి ‘బింద్రన్ వాలే ఆపరేషన్’ వల్ల పెద్దగా ప్రయోజనమేమీ కనిపించలేదు. దీంతో 1984 డిసెంబర్ ఎన్నికల కోసం మరోసారి ఖల్సా సెంటిమెంట్ ను ఉపయోగించుకోవాలనుకుంది కాంగ్రెస్ పార్టీ.

  భింద్రన్ వాలే వివాదాస్పద అంశాలపై రెచ్చగొట్టేలా ప్రసంగించడం మొదలైంది. మెల్లమెల్లగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. పంజాబ్‌లో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. 1982లో చౌక్ గురుద్వారా వదిలిన భింద్రన్‌వాలే మొదట స్వర్ణమందిరంలో గురునానక్ నివాస్, తర్వాత కొన్ని నెలలకు ఆకల్ తఖ్త్‌లో తన అభిప్రాయాలను అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు.

  1984 డిసెంబర్ లో 8వ లోక్ సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. బింద్రన్ వాలే ‘ఫ్రాంకెన్ స్టీన్’ లా మారిపోయిన విషయం కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆలస్యంగా తెలిసి వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చైనా-పాకిస్థాన్ సాయంతో ‘ఖలిస్థాన్’ ఏర్పాటు చేసుకునే సమయం ఆసన్నమైందని బహిరంగ ప్రకటన చేశాడు నాటి పంజాబ్  విద్యాశాఖ మంత్రి సుఖ్ జీందర్ సింగ్. ఐఎస్ఐ సాయంతో ఆయుధ సేకరణ జరిగిపోయింది.

  అకాలీదళ్ ను అదుపు చేసేందుకు కాంగ్రెస్ ప్రోత్సహించిన  భింద్రన్ వాలే చివరకు ఏకు మేకయ్యాడు. అంతిమంగా ఆపరేషన్ బ్లూస్టార్ జరిగిపోయింది. 1984 జూన్ 1న మొదలైన ఆపరేషన్ 9న ముగిసింది. ఆపరేషన్లో భారత సైన్యం 83 మంది సైనికులను కోల్పోయింది. మరో 248 మంది జవాన్లు గాయపడ్డారు. వీరు కాకుండా మరో 492 మంది మరణించినట్లు ధ్రువీకరించింది.

  1592 మందిని అదుపులోకి తీసుకుంది సైన్యం. ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత ఇందిర హత్య, రాజీవ్ ప్రధాని పదవి చేపట్టడం జరిగిపోయాయి. సిక్కుప్రజలను సంతృప్తి పరిచేందుకు 1985, జూలై 24న హరిచరణ్ సింగ్ లోంగోవాల్-ప్రధాని రాజీవ్ గాంధీల మధ్య ఒప్పందం జరిగింది. దీన్నే Rajiv–Longowal Accord గా పేర్కొంటారు. ఈ ఒప్పందం కూడా అంతంత మాత్రంగానే అమలైంది. దీంతో మరోమారు సిక్కు ఉగ్రవాదం క్రమంగా వేళ్లూనుకుంది.

  1986లో మరోమారు స్వర్ణ దేవాలయం ఉగ్రవాదాలకు అడ్డాగా మారింది. ‘కీర్తన్’ సమయాల్లో కలష్నికోవ్ ల ఉగ్ర కైవారం మొదలైంది. భారత సైన్యం ‘ఆపరేషన్ బ్లాక్ థండర్-1కు శ్రీకారం చుట్టింది. 1986, ఏప్రిల్ 30న ఆపరేషన్ బ్లాక్ థండర్-1 మొదలైంది.

  అప్పటికే 2వందల మంది సాయుధ సిక్కు ఉగ్రవాదులు మూడు నెలలుగా స్వర్ణమందిరంలో తిష్ఠవేసి ఉన్నారు. నాటి పంజాబ్ డీజీపీ జులియో రెబెరో ఆధ్వర్యంలో, కొన్ని గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో 3వందల మంది ఎన్.ఎస్.జీ కమెండోలు, 7 వందల మంది బీఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. పెద్దగా ప్రాణ నష్టం లేకుండానే ఆపరేషన్ ముగిసింది.

  ఈ పరిణామాల నేపథ్యంలోనే అంటే, 1980 నాటికే అజిత్ దోవల్ పంజాబ్ పరిణామాలపై దృష్టి సారించారు. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల కార్యకలాపాలపై నిరంతరం ఇంటలీజెన్స్ బ్యూరోకు నివేదికలు పంపారు. 1988, మే 9 న  స్వర్ణ మందిరంలో ఆపరేషన్ బ్లాక్ థండర్-2 మొదలైంది.  

  జర్నైల్ సింగ్ భింద్రావాలే మరణించినా ఆయన ప్రభావం ఇంకా పూర్తిగా పోలేదు. భారత అత్యుతన్నత నిఘా విభాగాలు RAW-IBలు స్వర్ణమందిరంలో మాటువేసిన ఉగ్రవాదుల సంఖ్య, వారి వద్ద ఉన్న ఆయుధాలు, తూటా నిల్వలు తెలియకుండా ఆపరేషన్ మొదలు పెట్టకూడదని భద్రతా బలగాలకు సూచించాయి. లోపల నెలకొన్న పరిస్థితి అంచనా వేయాల్సిన అత్యవసర స్థితి ముందుకు వచ్చింది. దీంతో అజిత్ దోవల్ సరికొత్త ప్రణాళికను ప్రతిపాదించారు.

  1984లో వలె ఖలిస్థాన్ ఉగ్రవాదులకు పాక్ గూఢచార విభాగం మద్దతు ఉందా లేదా అని తెలుసుకోవడంతో పాటు, బ్యాటిల్ అర్చ్ సహా, పొజిషన్స్, వెపన్ కాంపోజిషన్, అమ్యూనేషన్ తాలూకు వివారాలు తెలుసుకోవడానికి ఒకరు తప్పనిసరిగా లోపలికి వెళ్లాల్సిందే అంటూ ప్రతిపాదన RAW-IB ముందుంచారు దోవల్. అయితే, ఎవరు వెళ్లాలన్న ప్రశ్న ముందుకు వచ్చింది. లిప్తకాలంలో జవాబు ఇచ్చారు దోవల్. తానే స్వయంగా ఉగ్రవాదుల వద్దకు మారువేశంలో వెళ్లి పరిస్థితిని తెలియజేస్తానని ఆత్మస్థైర్యంతో వెల్లడించారు. దీంతో దోవల్ ‘రిక్షావాలా’ అవతారమెత్తారు. 

  రిక్షావాలా అవతారం ఎందుకు అనే సందేహాన్ని వెలిబుచ్చారు నిఘా విభాగ అధికారులు. అందుకు దోవల్ తడుముకోకుండా జవాబు చెప్పారు. అదే  ‘Military camouflage’ ఎత్తుగడ. 18వ శతాబ్దంలో ‘రైఫిల్ యూనిట్ల’లో వాడిన ‘Military camouflage’ గురించి తేటతెల్లం చేశారు. రిక్షావాలాగా మారువేశం వేస్తే తన రూపు రేఖలు అచ్చుగుద్దినట్టూ సరిపోతాయి కాబట్టి, దాన్నే ఎంచుకుంటే మంచిదని సూచించారు.

  ‘Military camouflage’ ఎత్తుగడ 1915 నాటికి-అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో మరింత రాటుదేలింది. ‘Military camouflage’ అంటే-మనం ఎంచుకున్న పని-మన శరీర ఆకృతి-మనం సంచరించే ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని కార్యచరణలోకి దిగడం అన్నమాట. సదరు వాతావరణంలో కలిసిపోయి, ఎలాంటి అనుమానం రాకుండా పనిని పూర్తి చేయడం కోసమే వాడే ఎత్తుగడ పేరే ‘Military camouflage’.

  రిక్షావాలా అవతారం ఎత్తిన దోవల్ సుమారు పది రోజుల పాటు స్వర్ణ మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. దోవల్ అప్పటికే IB- joint director హోదాలో ఉన్న అధికారి. ఉగ్రవాదులను తాను ఐఎస్ఐ ఏజెంట్ అని నమ్మించడం అంత సులభసాధ్యమైన విషయం కాదు. చివరాఖరుకు ఉగ్రవాదుల కంటపడ్డాడు దోవల్. వారికి అనుమానం రాగానే రిక్షావాలా వేశంలో ఉన్న దోవల్ ను పిలిచి మాట్లాడ్డం మొదలుపెట్టారు.

  అవకాశం చిక్కగానే దోవల్ అసలు విషయం ఉగ్రవాదులకు చేరవేశారు. ఐఎస్ఐ తనను పురమాయించిందంటూ ఉగ్రవాదులకు నమ్మిక కలిగేవిధంగా చెప్పారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ మరో రెండు రోజులకు మొదలవుతుందనగా స్వర్ణమందిర ప్రాంగణంలోకి వెళ్లారు దోవల్. సుమారు 10 గంటల పాటు అక్కడే గడిపి-తనకు అవసరమైన సమాచారం పూర్తిగా వచ్చిందని ఖరారు చేసుకున్నాక బయటపడ్డారు.

  ఉగ్రవాదుల సంఖ్య, సెంట్రీ పొజిషన్స్, ఫైరింగ్ కవర్స్, ఆయుధాలు, అమ్యూనేషన్ వగైరా వివరాలతో క్రిష్టల్ క్లియర్ బ్యాటిల్ లే అవుట్ ను బలగాలకు అందించారు దోవల్. అంతకన్న ముఖ్యమైన విషయం వారి సంసిద్ధత, అహార నిల్వలు, అనారోగ్యం తాలూకు వివరాలు కూడా ఈ లే అవుట్ కు జత చేశారు.

  దోవల్ స్వర్ణమందిర ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన 24 గంటలకు ఆపరేషన్ మొదలైంది. దోవల్ రూపొందించిన బ్యాటిల్ లే అవుట్ చూశాక ఒక అంచనాకు వచ్చారు సైనిక అధికారులు. ‘స్నైపర్స్’ ఉంటే పని మరింత సులువు అవుతుందనీ, ప్రాణ నష్టాన్ని గరిష్ఠ స్థాయిలో నివారించవచ్చని కూడా దోవల్ సూచించారు. దీంతో సైన్యం స్నైపర్ లను పురమాయించింది. 1988, మే9 న ఆపరేషన్ మొదలైంది. 18వ తేదీ ముగిసింది.

  ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించింది కే.పీ.ఎస్ గిల్ గా ప్రఖ్యాతి చెందిన కన్వర్ పాల్ సింగ్ గిల్. కే.పీ.ఎస్ గిల్ నాటి పంజాబ్ డీజీపీ. ఈ ఆపరేషన్ లో 2వందల మంది సిక్కు ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులు లొంగిపోగా, 41 మంది హతమయ్యారు. 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తో పోలిస్తే తక్కువ నష్టం జరిగింది. స్వర్ణం మందిరం పాక్షికంగా ధ్వంసమైంది. ఆపరేషన్ బ్లాక్ థండర్-2 వివరాలను కూలంకషంగా పొందుపరిచారు నాడు అమృత్ సర్ డిప్యూటి కమిషనర్ గా పనిచేసిన సరబ్జిత్ సింగ్ తన పుస్తకం ‘‘Operation Black Thunder: An Eyewitness Account of Terrorism in Punjab’’లో. 

  Trending Stories

  Related Stories