ఫ్లోరిడా ఆక్సిజన్ కొరతతో అల్లాడుతోందన్న విషయం మీకు తెలుసా..? టెక్సస్‌లో కొవిడ్ బెడ్ల కొరత వేధిస్తోందన్న విషయం మీ చెవిన పడిందా..? అలబామా, ఒరెగాన్ రాష్ట్రాల్లో ఐసీయూ పడకలు కరవయ్యాయన్న కఠోర నిజం మీ దృష్టికి వచ్చిందా..? జార్జియాలో ఇప్పటికే 95 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు..? హ్యూస్టన్, మిస్సిసిప్పీ.. లూసియానా.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 42 రాష్ట్రాల పరిస్థితి అత్యంత దయనీయంగా వుందిప్పుడు. ప్రస్తుతం అమెరికా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో.. రోజుకు సగటున లక్షన్నర కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కానీ, ఏ న్యూస్ ఛానెల్లోనూ ఈ స్టోరీ కనిపించదు. ఏ ఛానెల్ హెడ్‌లైన్స్‌లోనూ అమెరికా కొవిడ్ మరణాల గురించి ప్రసారం చేయరు. ఏ న్యూస్ వెబ్సైట్లోనూ వీటికి ప్రాధాన్యతనివ్వరు. ఏ వెస్ట్రన్ మీడియా కూడా ఈ వార్తల్ని కవర్ చేయదు. అమెరికాలో కరోనా కల్లోలం.. పాశ్చాత్య మీడియా కంటికి కనిపించడం లేదు. ఆ మీడియా కెమెరాలు కనీసం అటువైపు చూడటం మానేశాయి.
ఈ విషయాన్ని ఒక్క క్షణం పక్కనపెట్టి.. ఒక్కసారి నాలుగు నెలలు వెనక్కి వెళ్లండి. ఆనాటి పాశ్యాత్య మీడియాతో పాటు.. మనదేశంలోని పెంపుడు మీడియాలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్‌లను ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. బీబీసీ, సీఎన్ఎన్, ఆల్ జజీరాతో పాటు.. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్, అమెరికన్, యూరోపియన్ మీడియా ఫోకస్ మొత్తం నాడు భారత్ పైనే వుంది. బెడ్లు లేవని, ఆక్సిజన్ లేదని బ్రేకింగ్‌ల మీద బ్రేకింగ్‌లు నడిపాయి. 24 గంటలూ వాల్ టు వాల్ లైవ్ డిబేట్లు పెట్టాయి. పాశ్యాత్య మీడియా ఛానెళ్ల కెమెరాలన్నీ.. భారత్‌లో కొవిడ్ పేషంట్లపైనే ఫోకస్ చేశాయి. శ్మశానాల్లో తిష్టవేసిన వెస్ట్రన్ మీడియా రాబందులు.. కొవిడ్ పేషంట్ల మృతదేహాలను జూమ్ చేసి మరీ చూపించాయి. కొవిడ్ బాధితులు బెడ్లను షేర్ చేసుకున్న దృశ్యాలను.. కాలుతున్న కాష్టాల విజువల్స్నూ చూపిస్తూ.. శ్మశాన జర్నలిజాన్ని ప్రదర్శించాయి.
మరి ఇప్పుడేమైంది..? ఆక్సిజన్ లేక అల్లాడుతున్న ఫ్లోరిడాపై ఎందుకు ఫోకస్ చేయడం లేదు..? అమెరికాలో కొవిడ్ మృత్యుఘోషను ఎందుకు చూపించడం లేదు..? ఇదేం సెలెక్టివ్ జర్నలిజం..? కొవిడ్ కేవలం భారత్‌లోనే వుందా..? ఏం.. అమెరికన్లవి ప్రాణాలు కాదా..? వాళ్ల ప్రాణాలకు విలువ లేదా..?
ప్రస్తుతం అమెరికాలో కొవిడ్ యాక్టివ్ కేసులు 84 లక్షల 35 వేల పైచిలుకు. ప్రతి పదిలక్షల మందిలో సగటున 1974 మంది అమెరికాలో మరణిస్తుంటే.. భారత్‌లో అత్యల్పంగా 315 మంది మరణిస్తున్నారు. అమెరికాలోని ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న కొవిడ్ పేషంట్ల సంఖ్య లక్షకు పైమాటే. ఇక, క్వారంటైన్లు, ఐసోలేషన్లు కలుపుకుంటే ఆ సంఖ్య మరో పది రెట్లు ఉంటుంది. గత ఎనిమిది నెలల్లో ఇవే అత్యధిక గణాంకాలు. కొవిడ్ కేసుల్లో 12 శాతం, మరణాల్లో 23 శాతం పెరుగుదల కనిపిస్తోందిప్పుడు. 77 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. కేసులు అంతకంతకూ పెరుగుతూనేవున్నాయి. ఫ్లొరిడాలో రోజుకు రెండువందలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇది గత జనవరి పీక్ టైమ్ కంటే.. 30 శాతం అధికం. ఫ్లొరిడాలో ఆగస్టు 26న ఒకేరోజు 901 కొవిడ్ మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంల ఆగస్ట్ 13 నుంచి 19 మధ్య కాలంలో లక్షాయాభైవేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ సగటున 23 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయన్నమాట. కొత్త కేసుల్లో 20 శాతం పెరుగుదల నమోదవుతోంది. ఫ్లొరిడాలోని ప్రతి లక్ష మందిలో 80 మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇవి ఒక్క ఫ్లొరిడాకు చెందిన గణాంకాలు మాత్రమే. మిగతా రాష్ట్రాలు ఫ్లొరిడాకు ఏమాత్రం తీసిపోలేదు. అలబామా, మిస్సిసిప్పీ, జార్జియా, లూసియానాల్లో లక్షకు 55 మంది హాస్పిటలైజ్ అవుతున్నట్టు.. అమెరికా ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. అమెరికా హెల్త్‌కేర్ సిస్టమ్ ప్రశ్నార్థకంగా మారింది.
అమెరికాలో రోజుకు సగటున లక్షా యాభైవేల కొవిడ్ కేసులు నమోదవుతున్నట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రాల ఆరోగ్య శాఖలకు హెచ్చరికలు చేసింది. ఒక్క వారంలోనే 11 లక్షల 11 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఇప్పటికి 4 కోట్ల మందికి కరోనా సోకితే, అందులో సుమారు 6 లక్షల 57 వేల మంది మరణించారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మరి, అమెరికాలో ఇంతలా మహమ్మారి విజృంభిస్తున్నా.. అంతర్జాతీయ మీడియా ఎందుకు కళ్లుమూసుకుంది..? ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి..? ప్రపంచంలోనే నెంబర్ వన్ అంటూ గప్పాలు కొట్టే.. న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికల హెడ్‌లైన్స్‌లో వాటికి ప్రాధాన్యతనివ్వరేం..?
న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో కొవిడ్ మరణాలను దాచే ప్రయత్నం చేశాడు. ఇటీవలో 43 వేల మంది న్యూయార్క్ పౌరులు కొవిడ్‌తో మరణించినట్టు ప్రకటించాడు. అక్కడ అసలు మరణాల సంఖ్య 55 వేలు. అంటే ఏకంగా 12 వేల మరణాలను దాచేశాడు. ఈ వార్తను ప్రసారం చేసిన సీఎన్ఎన్ మాత్రం.. న్యూయార్క్ డెత్టోల్కు 12 వేల మరణాలు అడ్జస్ట్ చేసినట్టు రాసుకొచ్చింది. యాడ్ అయ్యాయి అంటూ రాసుకొచ్చింది. పన్నెండు వేల చావులు సీఎన్ఎస్ లెక్కలో కేవలం అడ్జెస్ట్మెంట్ మాత్రమేనట..! జూన్‌లో అమెరికా వాల్ స్ట్రీట్ జర్నల్ భారత్‌లో కొవిడ్ మరణాలకు లెక్కలేదంటూ వార్తల్ని వండివార్చింది. బ్రెజిల్లో మరణమృదంగం అంటూ మరో అమెరికా పత్రిక డెయిలీ న్యూస్ రాసుకొచ్చింది. ఏబీసీ న్యూస్.. రష్యాలో కొవిడ్ మరణాల్లో అధికారిక లెక్కలకు అసలు లెక్కలకు పొంతనలేదని రాసింది. కానీ, అదే అమెరికన్ మీడియా.. సొంత దేశంలో కొవిడ్ మరణాలను మాత్రం ‘అడ్జెస్ట్’ అంటూ సాధారణ విషయంలా కొట్టిపారేసింది. ఇలా అక్కడి డెమొక్రాట్లు కొవిడ్ గణాంకాలను మార్చేస్తున్నా.. అంతర్జాతీయ మీడియా పట్టించుకోవడం లేదు. కొవిడ్ విషయంలో అమెరికాను టార్గెట్ చేయాలన్నది మా ఉద్దేశం కాదు. కరోనా మహమ్మారికి ప్రపంచంలోని ప్రతి దేశమూ బాధిత దేశమే. ఏ దేశపౌరుడిదైనా ప్రాణమే. కానీ, అంతర్జాతీయ మీడియా.. ముఖ్యంగా అమెరికన్ మీడియాకు ఎందుకీ పక్షపాతం..? ఇదే నా ప్రశ్న.
ఈ నిజాల్ని చూపేందుకు అంతర్జాతీయ మీడియా ముఖ్యంగా అమెరికన్ మీడియా భయపడుతోందా..? కనీసం బైడెన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని కావాలనే విస్మరిస్తోందా..? మరి, ఇదే వెస్ట్రన్ మీడియా.. మిగతా దేశాల విషయంలో శ్మశాన జర్నలిజాన్ని ఎందుకు ప్రదర్శించింది..? ముఖ్యంగా భారత్‌ను టార్గెట్ చేసిన అంతర్జాతీయ మీడియా.. కొవిడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు చిత్రించేందుకు విఫలయత్నం చేసింది. సెకండ్ వేవ్ సందర్భంగా భారత్ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పాశ్చాత్య మీడియా విష ప్రచారం చేసింది. భారత ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలను అప్రతిష్టపాలు చేయడానికి చేయాల్సిందంతా చేసింది. దేశాన్ని కించపరిచేందుకు పాశ్చాత్య మీడియా చేయని ప్రయత్నం లేదు. భారత్‌లో కొవిడ్ గణాంకాలు ప్రదర్శించే విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. కొవిడ్ మరణాలకు పెద్దపీట వేస్తూ.. శ్మశానాల్లో కాలుతున్న శవాల విజువల్స్‌ను పదే పదే ప్రదర్శించి పబ్బం గడుపుకున్నాయి. మొత్తానికి కొవిడ్‌పై పోరాటంలో భారత్‌ను విఫల దేశంగా ప్రచారం చేశాయి. కానీ, ఇందుకు భిన్నంగా భారత్.. చైనా వైరస్ కు ఎదురొడ్డి నిలిచింది. ఓవైపు కొవిడ్ ను ఎదుర్కొంటూనే.. మరోవైపు ప్రపంచ వామపక్ష భావజాల మీడియాను కూడా ఎదుర్కోవాల్సివచ్చింది.
ఇక, వెస్ట్రన్ మీడియా కనుసన్నల్లో పనిచేసే.. మన దేశపు పెంపుడు మీడియా సైతం.. యూఎస్‌లోని కొవిడ్ విలయతాండవంపై మాటవరసకైనా ఓ వార్త రాయడంలేదు. పాశ్చాత్య మీడియాను ప్రసన్నం చేసుకోవడానికి.. ఇక్కడి కుహానా లెఫ్ట్ లిబరల్ మీడియా మేధావులు వారితో చేతులు కలిపారు. చెప్పాలంటే అమెరికా కొవిడ్ విపత్తు విషయంలో మన పెంపుడు మీడియా కవరేజ్ సున్నా. శ్మశానాలను హైలైట్ చేసి చూపించిన మన లెఫ్ట్ లిబరల్ మీడియా.. అమెరికా విషయంలో సైలెంట్ అయిపోయింది. అమెరికన్ల మృతదేహాలు వారికి కనిపించడం లేదు. అక్కడ రోగులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు కూడా వారి దృష్టికి ఆనడం లేదు.
ఇదిలావుంటే, పాశ్చాత్య మీడియా పక్షపాతం కొవిడ్ విపత్తుకే పరిమితం కాలేదు.. వాక్సిన్ల విషయంలోనూ ఈ మీడియా రాబందులు భారత్‌పై దుష్ప్రచారం చేశాయి. భారత్‌లో టీకాల పంపిణీ పూర్తిచేయాలంటే పదేళ్ల పడుతుందని లెక్కలు గట్టాయి. మోదీ ప్రభుత్వానికి అంత సీన్ లేదంటూ వితండవాదం చేశాయి. కానీ, ఎనిమిది నెలలు పూర్తికాకుండానే.. దేశంలో దాదాపు సగం మందికి.. కనీసం సింగిల్ డోసు అందించి చరిత్ర సృష్టించింది భారత్. వ్యాక్సిన్ పంపిణీలో చాంపియన్ అని జబ్బలు చరుచుకున్న అమెరికా, చైనా వంటి దేశాలే ఆశ్చర్యపోయేలా టీకాలను పంపిణీ చేసి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశసంలను అందుకుంది. 65 కోట్ల వాక్సిన్ డోసులలో చివరి పదికోట్ల డోసులు కేవలం 19 రోజుల్లో పంపిణీ చేసింది. తద్వారా అతి తక్కువ కాలంలో పదికోట్ల డోసులను అందించిన మొదటి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
ఇటీవలే కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి మన్సుఖ్ మాండవియా దేశంలో వ్యాక్సినేషన్ డేటాను విడుదల చేశారు. మొదటి పదికోట్ల డోసులను అందించడానికి 85 రోజుల సమయం పట్టిందని ప్రకటించారు. అదే 20 కోట్లు దాటడానికి 45 రోజులు.. 30 కోట్లకు చేరుకోవడానికి 29 రోజుల సమయం పట్టగా.. 40కు చేరుకోవడానికి 24 రోజులు పట్టింది. అలాగే, 50 కోట్ల మార్కును, 60 కోట్ల మార్కును చేరుకోవడానికి కేవలం 19 రోజలు పట్టింది. దీనిని బట్టి దేశంలో వ్యాక్సినేషన్ ఎంత వేగవంతంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
కానీ, పాశ్చాత్య మీడియా గతంలో భారత్‌లో టీకా పంపిణీపై అడ్డగోలు రాతలు రాశాయి. జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినప్పుడు పక్షపాతంతో కూడిన కథనాలను వడ్డించాయి. భారత వ్యాక్సిన్లపై అనేక సందేహాలను వ్యక్తం చేశాయి. పూర్తి జనాభాకు వ్యాక్సిన్లు అందించే సత్తా భారత్‌కు లేదంటూ.. కుహనా లౌకికవాద జర్నలిస్ట్ మేధావులతో చెప్పించింది వెస్ట్రన్ మీడియా. మారుమూల ప్రాంతాలకు టీకాలు చేరుకోవడం అసంభవని ప్రకటించింది ఇదే పాశ్చాత్య మీడియా. టీకా పంపిణీలో భారత్ కచ్చితంగా ఫెయిల్ అవుతుందంటూ.. వార్తా కథనాల్ని వండి వార్చిన వెస్ట్రన్ మీడియా.. నేటి వాస్తవ గణాంకాలపై మాత్రం చిన్న వార్త కూడా ప్రసారం చేయడం లేదు. కొవిడ్ మరణాలపై, ఆక్సిజన్ షార్టేజీపై శ్మశాన జర్నలిజాన్ని ప్రదర్శించిన ఈ మీడియా సంస్థలకు.. వాస్తవాల్ని ప్రసారం చేయడానికి మనసు రావడం లేదు.
మొత్తంగా బీబీసీ, రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, CNN, ఇలా వార్తాసంస్థ ఏదైనా వారందరి రేసిస్టు భావజాలం ఒక్కటే. వారి దృష్టిలో భారత్ అంటే ఒక అనగారిన దేశం. పేదరికం, నిర్లక్ష్యంతో అలమటిస్తున్న దేశం. ఈ భావన వారిది మాత్రమే కాదు.. మన దేశంలోని కుహనావాదులది కూడా ఇవే ఆలోచనలు. అందుకే పాశ్చాత్య దురహంకారాన్ని మనపై ఎప్పుడూ వారు రుద్దుతూనేవుంటారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఈ కొవిడ్ టైమ్‌లోనే మనకు కనిపిస్తాయి. కొవిడ్ విస్తరిస్తున్న మొదట్లో ఒక పత్రికలో.. ఈ కొవిడ్ చైనాలో పుట్టింది కాబట్టి నయం.. అదే భారత్‌లో పుట్టి వుంటే ప్రపంచం సర్వనాశనమయ్యేది అని వ్యాఖ్యానించింది. ప్రపంచం కొవిడ్ ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉంది కానీ, భారత్ లో సౌకర్యాల లేమి వల్ల అగ్రదేశాలు ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని మరో వార్తాసంస్థ వ్యాసం రాసింది. భారత్ కొవిడ్ ను నియంత్రించవచ్చు సరే. కానీ, వ్యాక్సిన్లు తాము మాత్రమే అభివృద్ధి చేయగలమని పాశ్యాత్య మీడియా భావించింది. ఇలా అడుగడుగునా భారత్ విఫలమవుతుందని ఆశించి భంగపడ్డ వెస్ట్రన్ మీడియా.. తమ ఆధిపత్య ధోరణిని కట్టిపెట్టక తప్పని పరిస్థితి ప్రస్తుతం ఎదురవుతోంది. భారత్ నాశనమవ్వాలని అగ్రదేశాల రాకాసిమూకలు కోరుకుంటున్నాయి. కానీ, భారతీయులుగా మనం మాత్రం ఆయా దేశాల ప్రజలంతా క్షేమంగా ఉండాలనే కోరుకుందాం.. సర్వేజనా సుఖినోభవంతు..