కోల్ కతాలో మోడల్స్ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. రెండు వారాల వ్యవధిలో నలుగురు మోడల్స్ ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతున్నాయి. ఇటీవలే బిదిషా సూసైడ్ చేసుకోగా.. ఆ తర్వాత ఆమె స్నేహితురాలు మంజూషా కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఇప్పుడు మరో 18 ఏళ్ల యువ మోడల్ సరస్వతీ దాస్ ఆత్మహత్యకు పాల్పడింది.
ఆదివారం కోల్ కతాలోని కస్బాలో బేడియాదంగా వద్ద తన గదిలోనే ఆదివారం సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి దాస్ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఉరి వేసుకుని ఉండటాన్ని చూసింది ఆమె అమ్మమ్మ. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించగా.. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సరస్వతి దాస్ తన అమ్మమ్మతో కలిసి నిద్రపోతూ ఉండగా.. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సరస్వతి పక్కన లేకపోవడంతో అమ్మమ్మ మరో గదిలోకి వెళ్లింది. అప్పటికే అక్కడ సరస్వతి దాస్ ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమె తన చదువును విడిచిపెట్టి, ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది. మోడలింగ్ చేస్తూ ఉంది. ఆమె ఇటీవలి కాలంలో డిప్రెషన్‌తో కొట్టుమిట్టాడుతోందని కోల్‌కతా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాత్రి 1 గంటల వరకు ఆమె తన ప్రియుడితో మాట్లాడుతున్నట్లు పోలీసులు ఫోన్ రికార్డులను సేకరించారు. మరణానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు.