బెంగాల్‌ నుంచి ప్రజలు భయంతో పారిపోతున్నారని పార్లమెంట్ లో ఏడ్చేసిన రూపా గంగూలీ

0
822

బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో జరిగిన హింసాకాండపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు రూపా గంగూలీ శుక్రవారం రాజ్యసభలో విరుచుకుపడ్డారు. అక్కడ ఎనిమిది మందిని మొదట దారుణంగా కొట్టి, ఆపై కాల్చి చంపిన ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. పార్లమెంటులో రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలు బ్రతకలేకపోతున్నారని.. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. బెంగాల్‌ నుంచి ప్రజలు భయంతో పారిపోతున్నారని ఆమె అన్నారు.

“మేము పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేస్తున్నాము. అక్కడ సామూహిక హత్యలు జరుగుతున్నాయి, ప్రజలు అక్కడి నుండి పారిపోతున్నారు… రాష్ట్రంలో బ్రతకడం దుర్భరంగా మారింది ”అని నటి రూపా గంగూలీ అన్నారు, పశ్చిమ బెంగాల్‌లో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “పశ్చిమ బెంగాల్‌లో ప్రజలు మాట్లాడలేని స్థితిలో ఉంది. హంతకులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలను చంపే ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా ఉండి ఉండదు. మనం మనుషులం” అని రూపా గంగూలీ అన్నారు.

అంతకుముందు రోజు, బీర్భూమ్‌లోని రాంపూర్‌హాట్ బ్లాక్‌లో జరిగిన ఘటనపై కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ఈ కేసు దర్యాప్తును నిర్వహిస్తోంది. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్‌ శ్రీవాస్తవ, జస్టిస్‌ ఆర్‌ భరద్వాజ్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ ఏప్రిల్‌ 7లోగా నివేదికను సమర్పించాలని సీబీఐకి సూచించింది. మార్చి 23 న, కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సరైన విచారణ జరిపేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదికను సమర్పించాలని కోరింది. సాక్ష్యాలను కాపాడడం, ఆ ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన కోసం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీసీ కెమెరాల ద్వారా దృశ్యాలను నిరంతరం పర్యవేక్షించాలని కోర్టు ఆదేశించింది. ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించేందుకు ఢిల్లీలోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు చెందిన బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.

బీర్భూమ్ దారుణం

గుర్తు తెలియని దుండగులు డజను ఇళ్లకు నిప్పుపెట్టడంతో అక్కడ ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ పోలీసులు ఒకే ఇంట్లో ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, ఆపై వాటిని రాంపూర్‌హట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు. ఒక నివేదిక ప్రకారం, దుండగులు ఇళ్లకు నిప్పంటించే ముందు బయట తాళాలు వేశారు. భాదు షేక్ అనే తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్త హత్య తర్వాత ఈ సంఘటన జరిగింది. మృతుడు సోమవారం (మార్చి 21) జాతీయ రహదారి-60లోని ఒక దుకాణం వద్ద కూర్చొని ఉండగా బాంబులతో దాడి చేశారు. ఈ హింసాకాండకు సంబంధించి ఇప్పటివరకు కనీసం 20 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బీర్భూమ్ హత్యాకాండపై కలకత్తా హైకోర్టు కూడా సుమోటోగా విచారణ చేపట్టింది.