ఆనందయ్య కంటి మందుపై తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు

ఆనందయ్య కరోనా ఔషధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, హై కోర్టు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే..! మరో వైపు నేడు ఏపీ హై కోర్టు ఏ తీర్పు ఇస్తుందా అని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఏపీ హైకోర్టు నేడు ఆనందయ్య కంటిమందుపై విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఆనందయ్య కంటిమందును తాము వ్యతిరేకించడం లేదని, అయితే కంటిమందు విషయంలో నిపుణుల కమిటీ రావాల్సి ఉందని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి కంటి మందుకు అనుమతి ఇస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ విధంగా అయితే అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వినీకుమార్ మాట్లాడుతూ, రోజుకు 20 మందే వస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం తరపున న్యాయవాది స్పందిస్తూ నివేదిక వచ్చేందుకు 3 వారాలు పడుతుందని, ఇప్పటికిప్పుడు అనుమతి ఇవ్వలేమని తెలిపింది. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని ఆనందయ్య చెబుతూనే ఉన్నారు. ప్రతి జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. సోమవారం నుండి మందు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించారు. ఆ మందు కోసం వెబ్సైట్లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. www.childeal.in పేరుతో వెబ్సైట్ రూపొందించారు. ఆ వెబ్సైట్ పేరును నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. సైట్లో వినియోగదారులు ముందుగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ఆనందయ్య బృందం చెబుతోంది. దరఖాస్తు చేసుకున్నవారికి కొరియర్ ద్వారా మందును వారి చిరునామాకు నేరుగా పంపిణీ చేయనున్నారు. అయితే మందు తయారీ సమయంలో భద్రత , పంపిణీకి సహకరించాలని ఆనందయ్య కలెక్టర్ని కోరారు. జిల్లా అధికారుల సూచనల మేరకు కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు చేశారు. అకాడమీ ప్రాంగణంలో మందు తయారీ కోసం షెడ్ నిర్మాణం కోసం ఆనందయ్య భూమి పూజ చేశారు. భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుడు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.