గూండాగిరీలో అగ్రస్థానంలో ఉన్న కేరళ.. ఆ స్థానానికి ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటోంది. ఏకంగా కళాశాల ప్రిన్సిపల్ పైనే దాడికి దిగుతామని SFI నాయకులు బెదిరింపులకు దిగారంటే.. ఆ రాష్ట్రంలో గూండాగిరీ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నీ కాళ్లు విరగ్గొడతాం, నిన్ను తగులబెడతామంటూ ప్రిన్సిపల్ కే వార్నింగ్ ఇచ్చారు SFI నాయకులు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. ప్రిన్సిపల్ పై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నా.. అక్కడే వున్న పోలీసు అధికారులు ఈ సీన్‌ను కళ్లప్పగించి చూశారు. సబ్ ఇన్ స్పెక్టర్, మరో ఇద్దరు పోలీసుల సమక్షంలో అయిదు నిమిషాల పాటు కాలేజీ ప్రిన్సిపాల్‌ను బెదిరించారు. దీనినిబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వాన్నంగా వుందో అర్థం అవుతోంది. కేరళ త్రిసూర్ జిల్లా మహారాజాస్ టెక్నలాజికల్ ఇన్స్టిట్యూట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హాసన్ ముబారక్ నేతృత్వంలోని అయిదుగురు SFI లీడర్లు, తాత్కాలిక ప్రిన్సిపాల్ డాక్టర్ P.దిలీప్‌పై అనుచితవ్యాఖ్యలు చేస్తూ.. ఈ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూండాయిజానికి పాల్పడిన ముబారక్ అండ్ గ్యాంగే.. సౌమ్యంగా వుండే ప్రిన్సిపాల్‌ను గూండాయిజానికి పాల్పడే వ్యక్తిగా చిత్రీకరించారు. క్యాంపస్ నుంచి బయటకి వచ్చాక ఏం చేస్తానో చూడు. విద్యార్థుల విషయంలో జోక్యం చేసుకుంటే, కాళ్లు విరగ్గొడతాం అని ప్రిన్సిపాల్‌ను నోటికొచ్చినట్టు దూషించారు. ఈ మాటలు వైరల్ వీడియోలో స్పష్టంగా వినిపించాయి. ఇంతకీ ఆ ప్రిన్సిపల్ చేసిన తప్పేంటో తెలుసా..? నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన విద్యార్థిని మందలించడమే.
వివరాల్లోకి వెళ్తే.. ఓ కాలేజీ విద్యార్థి ‘స్కాల్పల్ స్ల్కరోసిస్’ అనే తలకు సంబంధించిన చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో డాక్టర్ సలహా మేరకు క్యాప్ ధరించి కాలేజీకి వచ్చాడు. అయితే, యూనిఫామ్ నిబంధనలకు అది విరుద్ధం కావడంతో.. తాత్కాలిక ప్రిన్సిపల్ దిలీప్ సదరు విద్యార్థిని మందలించాడు. నిజానికి, సదరు విద్యార్థి చర్మవ్యాధితో బాధపడుతున్న విషయం యాక్టింగ్ ప్రిన్సిపల్‌కు తెలియదు. అందుకే, కాలేజీకి క్యాప్ పెట్టుకురావద్దని మందలించాడు. అయితే, SFI గ్యాంగ్‌కు ఆ విద్యార్థి ఏం చెప్పాడో.. ఏమో గాని.. ప్రిన్సిపల్ పై మూకుమ్మడిగా దాడికి దిగారు. ఐదుగురు అనుచరులతో కలిసి వచ్చిన హసన్ ముబారక్,.. ప్రిన్సిపాల్‌పై పిచ్చి ప్రేలాపనలు పేలాడు.
SFI నాయకులు ఇలా ప్రిన్సిపల్స్‌పై దారుణంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గత ఆగస్ట్‌లో తిరువనంతపురం కార్యవట్టం ప్రభుత్వ కళాశాలలోనూ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. అర్హత లేని కోర్సులో జాయిన్ అవుతానన్న విద్యార్థి విన్నపాన్ని ప్రిన్సిపల్ తిరస్కరించారు. వారి దృష్టిలో అదే ఆయన చేసిన పెద్ద తప్పు. గూండాల్లా మారిన ఎస్ఎఫ్ఐ నేతలు నాడు ఆ ప్రిన్సిపల్‌ను బరబరా లాక్కుంటూ తీసుకెళ్లి, ఇష్టానుసారంగా ప్రవర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. క్యాంపస్‌కు చేరుకుని.. వారిని క్యాంపస్ లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో.. మరింత రెచ్చిపోయిన SFI గూండాలు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ దాడిలో.. కజకూటం అసిస్టెంట్ కమిషనర్ సహా నలుగురు పోలీసులు గాయపడ్డారు. అయితే, పోలీసులు ప్రిన్సిపల్‌ను మాత్రం రక్షించగలిగారు. ప్రిన్సిపల్‌పై అరాచకంగా ప్రవర్తించిన విద్యార్థి సంఘం నేతలను అరెస్టు చేశారు.