బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరిన నీరు.. ట్రాక్టర్ లో ప్రయాణీకుల తరలింపు

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా భారీ నీటి ఎద్దడి ఏర్పడింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నగరాన్ని కలిపే రోడ్లపైనా, విమానాశ్రయం లోపల రోడ్లు కూడా వరద నీటిలో ఉండిపోయాయి. దీంతో పలు విమానాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి. విమానాశ్రయానికి చేరుకోవడానికి, విమానాశ్రయం నుండి బయటకు వెళ్ళడానికి కూడా ప్రయాణీకులు చాలా కష్టాలు పడ్డారు.
భారీవర్షాల వల్ల విమానాశ్రయానికి వెళ్లే రహదారులు జలమయమయ్యాయి.వందలాది టాక్సీలు, ప్రైవేట్ వాహనాలు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో చిక్కుకుపోయాయి.దీంతో ప్రయాణికులు టెర్మినల్స్లోకి ప్రవేశించలేకపోయారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడానికి ట్రాక్టర్ ఎక్కాల్సి వచ్చింది. విమానాశ్రయానికి విమాన ప్రయాణికులు ట్రాక్టర్లపై వెళుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురవవచ్చని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ కూడా బెంగళూరు సిటీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తూర్పు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా కర్ణాటక రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.