తిరుపతిలో ఇటీవల బాగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్‌లో 25 అడుగుల తాగు నీటి వాటర్ ట్యాంక్.. భూమిలో నుంచి బయటకు వచ్చింది. అది చూసిన స్థానిక ప్రజలు భయపడ్డారు. 18 సిమెంట్ రింగులతో భూమిలో ఈ వాటర్ ట్యాంక్ నిర్మించారు. తాజాగా ఆ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా ట్యాంక్ పైకి లేచింది. ట్యాంక్ పైకి లేస్తుండటంతో.. అందులో ఉన్న మహిళ తీవ్ర భయాందోళనకు గురై ట్యాంక్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. భూమిలోపలి నుంచి బయటకు వచ్చిన ట్యాంక్ ఇప్పటికీ నిటారుగా నిలిచి ఉంది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.

ఇది సహజ పరిణామమేనని.. ఎవరూ టెన్షన్ పడకండని అధికారులు చెబుతున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా భూమి లోపలి పొరలు బాగా నానడం వల్ల.. వాటర్ ట్యాంక్ ఉబికి వచ్చిందని వివరించారు. ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోనూ గతంలో జరిగింది.

గురువారం సాయంత్రం తిరుపతిలో మరోసారి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో నగరం మరోసారి జలమయమైంది. గురువారం రాత్రి 9గంటల నుంచి అరగంటపాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో తిరుపతి నగరంలోని వీధులు, ప్రధాన నగరాలు పూర్తిగా వరదనీటతో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఉరుములుమెరుపులతో కూడిన వర్షం రావడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద ఉన్న శ్రీవారి భక్తులు ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు.