More

  పుతిన్ మాజీ ప్రేయసి RAW ఏజెంట్..?

  RAW అని పిలిచే రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ భారత విదేశీ నిఘా విభాగం. RAW ప్రాణాలను ఫణంగా పెట్టి రహస్యాలు మన రక్షణ విభాగానికి చేరవేస్తుంది. విదేశాంగ విధాన రూపకల్పనలో, రక్షణ విధానంలో, దౌత్య విషయాల్లో RAW కృషి అత్యంత కీలకం. 1968లో ఏర్పడిన RAW అనేక కీలక ఆపరేషన్లను నిర్వహించింది. బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో RAW పోషించిన పాత్ర చరిత్రాత్మకమైంది.

  ఏ దేశానికి చెందిన నిఘా విభాగమైనా విదేశాల్లో ఉంటూ రహస్యాలు రాబడుతుంది. అందుకోసం అనేక వలలు విసురుతుంది. కరెన్సీ కట్టల్ని చూపి ఆశపెడుతుంది. అందమైన అమ్మాయిలను ఎరగా వేసి సీక్రెట్స్ తెలుసుకుంది. కేవలం మన దేశమే కాదు, అన్ని దేశాలకూ విదేశీ నిఘా విభాగాలుంటాయి.

  గూఢచర్య సంస్థల పనితీరులో నైతికతకు తావులేదు. కావాల్సిన రహస్యం కోసం పోవాల్సిన చోటుకు పోవాల్సిందే! పనికొచ్చే గేలాన్ని వేయాల్సిందే! రష్యాకు కేజీబీ, అమెరికాకు సీఐఏ, బ్రిటన్ కు MI6, ఇజ్రాయిల్ ‘మోస్సాద్, చైనా నిఘా సంస్థ ‘మినిస్ట్రీ ఆఫ్‌ స్టేట్‌ సర్వీస్‌, పాకిస్థాన్ కు ఐఎస్ఐ. ఈ నిఘా సంస్థల ఏజెంట్లు దేశ దేశాల్లో తిరుగుతూ కీలక రహస్యాలు తెలుసుకుని వారివారి దేశాలకు చేరవేస్తారు.

  RAW రష్యాలో నిర్వహించిన ఆపరేషన్ వివరాలేంటి? పుతిన్ ప్రేయసిని తన ఏజెంట్ గా మార్చుకుందా? 1980 చివర RAW నిర్వహించిన ఆపరేషన్ లక్ష్యాలేంటి? పాక్ అణుపరిశోధనల గుట్టు కనిపెట్టిందా? భారత్ లో చైనా గూఢచర్యం గురించి వివరాలు రాబట్టిందా? అమెరికా-రష్యా సంబంధాల్లో సీక్రేట్స్ ను గుప్పిట పట్టిందా? ప్రముఖ జర్నలిస్ట్ యతీశ్ యాదవ్ రాసిన ‘‘ RAW: A History of India’s Covert Operations ’’ పుస్తకంలో ఏముంది? ఇలాంటి కీలక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  1950 నుంచి 1970 మధ్య కాలంలో మన దేశంలో రష్యా నిఘా సంస్థ కేజీబీ జర్నలిస్టులను, రాజకీయ నాయకులను, అధికారులను, విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే వారిని రకరకాలుగా మభ్యపెట్టి సమాచారాన్ని రాబట్టింది. భారత దేశ అంతర్గత విధాన నిర్ణయాలు కేజీబీ కనుసన్నల్లోనే జరిగాయని ఆ తర్వాత బట్టబయలైంది. కేజీబీ కుట్రలు , భారత్ ను తమ కాలనీగా మార్చుకున్న విధానాల గురించిన వివరాలను నేను గతంలో కొన్ని వీడియోల్లో విశ్లేషించాను. కేజీబీ రహస్య పత్రాల ఆధారంగా రూపొందించిన ఆ వీడియోల లింక్ లను మీరు ఈ డిస్ క్రిప్షన్ లో చూడొచ్చు.

  ఇటీవల మన దేశ నిఘా విభాగాలకు పబట్టుబడిన చైనా ఏజెంట్ ఉదాహరణ చూస్తే నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మరింత క్లియర్ గా అర్థమవుతుంది. చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ప్రజల ద్వారా భారీగా సమాచారం సేకరిస్తోంది. ఇందుకు వ్యాపార సంస్థలు, మీడియా, బ్యాంకులు, 180 దేశాల్లోని కన్ఫ్యూషియస్‌ సంస్థలను వాడుకొంటుంది.

  ఈ వాస్తవాన్ని భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్ చైనా నిఘా కార్యకలాపాలపై ఇటీవల రూపొందించిన అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. భారత్లోనూ ఎప్పటి నుంచో తమ నిఘా సంస్థలతో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్‌ జున్వే పదేళ్లకు పైగా గూఢచారిగా పనిచేస్తున్నాడని తేలింది.

  ఈ తరహాలోనే మనదేశ నిఘా విభాగం RAW కూడా విదేశాల్లో తన గూఢచర్య కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా రష్యా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది RAW. ఇందుకూ ఓ కారణం ఉంది. గతంలో మన దేశ అంతర్గత విషయాల్లో తలదూర్చిన కేజీబీకి సవాలు విసిరే ఉద్దేశంతో 1980 నుంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

  రష్యా ప్రస్తుత అధ్యక్షుడు, ఒకప్పటి నిఘా విభాగ అధికారి వ్లాదిమిర్ పుతిన్ మాజీ ప్రేయసిని మచ్చిక చేసుకుని రహస్యాలు రాబట్టిందని ప్రముఖ జర్నలిస్ట్ యతీశ్ యాదవ్ రాసిన ‘‘ RAW: A History of India’s Covert Operations ’’ పుస్తకం బట్టబయలు చేసింది.

  రష్యాలో RAW ఆపరేషన్లు 1988లో మొదలయ్యాయి. గోర్బచెవ్ అధికారంలోకి వచ్చాక ఆ దేశ మౌలిక విధానాల్లో మార్పులు వచ్చాయి. ఇరుగుపొరుగు సంబంధాల విషయంలో పట్టువిడుపులతో ఉండాలనే విదేశాంగ విధానం అమలులోకి వచ్చింది. దీంతో గోర్బచెవ్ మొదటి సారి 1988లో భారత్ పర్యటనకు వచ్చారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా 1988 నవంబర్ లో ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగారు గోర్బచెవ్.

  RAW ఆపరేషన్ పాలం విమానాశ్రయం నుంచే మొదలైంది. లాల్ బహదూర్ శాస్త్రి హయాం నుంచీ ఇందిర వరకూ కేజీబీ ఇండియాలో చేసిన నిఘా కుట్రలకు బదులు తీర్చుకోవాలనుకున్నRAW ప్రతీకారానికి రంగం సిద్ధమైంది.

  నిఘా విభాగాల పనితీరులో ఎక్కడా హడావిడి కనిపించదంటారు ‘‘ RAW: A History of India’s Covert Operations ’’ పుస్తక రచయిత యతీశ్ యాదవ్. అత్యంత ప్రశాంతంగా సాగిపోయే RAW కార్యకలాపాలు అత్యంత ప్రమాదకరమైన రహస్యాలను వెంటాడతాయంటారు. 1988లో గోర్బచెవ్ పర్యటన సందర్భంగా భారత్ కు వచ్చిన బృందంపై ఓ కన్నేసి ఉంచిన RAW తన ఆపరేషన్ కోసం తగిన వ్యక్తిని ఎంచుకునే పనిలో పడింది.

  గోర్బచెవ్ ఆంతరంగీకుడైన నికోలస్ డార్శీ సోదరుడు నికోలస్ ఆలెగ్జాండర్ ను తన భవిష్యత్ ఆపరేషన్స్ కు తగిన వ్యక్తిగా ఎంచుకుంది RAW. దీంతో రంగంలోకి దిగారు RAW అధికారి అశోక్ ఖురానా-ఇది ఆయన కోడ్ నేమ్ మాత్రమే. అలెగ్జాండర్ ను తాజ్ మహాల్ కు తీసుకెళ్లిన ఖురానా అసలు గుట్టు విప్పాడు. RAW కోసం కొన్ని పనులు చేయాల్సిందిగా కోరాడు.

  ఈ మొత్తం ఆపరేషన్ ప్రధాన లక్ష్యం అమెరికా, చైనా విషయాల్లో రష్యా వైఖరి, పాకిస్థాన్-రష్యా సంబంధాలు, ఆఫ్ఘనిస్థాన్ నిఘా విభాగాలకు కేజీబీ ఇచ్చిన ట్రెయినింగ్ వివరాలతో పాటు 1950,1960 సమయంలో చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థ భారత్‌లో కొన్ని కీలక ఆపరేషన్లు నిర్వహించింది. టిబెట్‌ ఆక్రమణ సమయంలో భారీ సంఖ్యలో ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌ను అక్కడకు తరలించింది. వీళ్లే ఆక్రమణ తర్వాత ఇండో-టిబెట్‌ సరిహద్దుల్లో స్థిరపడ్డారు.

  ఆ తర్వాత భారత్‌లో గూఢచర్యం మొదలు పెట్టారు. టిబెట్‌లోని లాసాలో బోర్డర్‌ అఫైర్స్‌ ఆఫీస్‌ పేరుతో ఒక నిఘా కార్యలయాన్ని చైనా తెరిచింది. దాదాపు నాలుగు వందల మందిని ఇందులో నియమించింది. 1960 నుంచి ఈశాన్య భారత్‌లో వేర్పాటువాదానికి చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థలే కారణం అయ్యాయి. అప్పట్లో భారత్‌ రష్యాతో సన్నిహతంగా ఉండేది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సంపాదించడం కూడా ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం.

  మొత్తంగా అశోక్ ఖురానా అలెగ్జాండర్ ను ఒప్పించడంలో విజయవంతమయ్యారు. దీంతో కేజీబీ ఆపరేషన్ మొదలైంది. సుమారు ఆరుమాసాల పాటు ఖురానా-అలెగ్జాండర్ ఇద్దరూ వేరు వేరు దేశాల్లో రహస్యంగా కలుసుకుంటూ వచ్చారు. అనేక రహస్య పత్రాలను అలెగ్జాండర్ ద్వారా ఖురానా RAW కార్యాలయానికి చేరవేస్తూ వచ్చారు. అత్యంత కీలక సందర్భం కోసం ఖురానా ఎదురు చూస్తూ వచ్చారు. ప్రధాని రాజీవ్ గాంధీ పర్యటనలో ఈ అవకాశం చిక్కింది ఖురానాకు.

  1989, జూలైలో రాజీవ్ గాంధీ ద్వైపాక్షిక చర్చల కోసం బయల్దేరి వెళ్లారు. ఈ బృందంలో అశోక్ ఖురానా కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా బలగాల స్థితి, యూరప్ అభివృద్ధి, పరస్పర సహకారం అంశాలపై ద్వైపాక్షిక చర్చలు ముగియగానే రాజీవ్ గాంధీ భారత్ బయల్దేరారు. ఖురానా మాత్రం మాస్కోలోనే ఉండిపోయారు. ఇక కీలక ఆపరేషన్ కు రంగం సిద్ధమైందన్నమాట.

  ఆపరేషన్ లోకి ప్రవేశించింది ఆగ్నేయ జార్జీయాకు చెందిన 27 ఏళ్ళ అందమైన వనిత. ఆమె పేరు ఆనస్తేషయా కోర్కియా. అలెగ్జాండర్ ఖురానాకు ఆనస్తీషియా కోర్కియాను పరిచయం చేశాడు. చెర్నోబిల్ అణు ప్రమాదం తర్వాత ఆనస్తీషియా కోర్కియా జార్జియాను వదిలి మాస్కోలో స్థిరపడింది. అంతర్జాతీయ ఆటమిక్ ఎనర్జీ సంస్థ-ఐఏఈఏ కు రష్యా ప్రభుత్వానికీ మధ్య లాబీ చేసే సంస్థలో పనిచేయడం ఆరంభించింది.

  ఆకుపచ్చ కళ్శ మెరుపులతో ఆకట్టుకునే ఆనస్తీషియా కోర్కియాకు ఇంగ్లీషు భాషపై మంచి పట్టు ఉంది. ప్రపంచ రాజకీయాలను ఔపోసన పట్టింది. అలెగ్జాండర్ – ఆనస్తీషియా కోర్కియా అప్పటికే గాఢమైన ప్రేమలో ఉన్నారు. ఖురానా ఈ ప్రేమ జంటను తన ఆపరేషన్ కు అనువైన పరికరంగా భావించాడు. వారిద్దరినీ ఒప్పించేందుకు పథకం సిద్ధం చేశారు ఖురానా. ఆనస్తీషియా కోర్కియాకు రష్యా ప్రభుత్వంలోని కీలక నేతలు, అధికారులతో నేరుగా సంబంధాలున్నాయి. అనుకున్నదే తడవుగా సంప్రదించగల చనువూ ఉంది. దీన్నే వాడుకోవాలనుకున్నారు ఖురానా.

  RAW తన ఏజెంట్లను నియమించుకోవడం అంత సులభం కాదు. నరాలు చిట్లే ఉత్కంఠ ఉంటుంది. కోర్కియాను ఒప్పించడంలో ఖురానాకు ఎదురైన అనుభవం కూడా ఇదే! ఎక్కడ పొరపాటు జరిగినా ‘ద్రోహం’ పొంచి ఉంటుంది. సరిగ్గా బెర్లిన్ గోడ కూలడానికి కొద్దిరోజుల ముందు అలెగ్జాండర్ – ఆనస్తీషియా కోర్కియా ప్రేమ జంట RAW ఏజెంట్లుగా పనిచేయడానికి అంగీకరించింది. 1989 డిసెంబర్ నాటికి కోర్కియా నుంచి రహస్య సమాచారం ఖురానాకు అందడం మొదలైంది. అమెరికా విషయంలో రష్యా విధానాలకు సంబంధించిన రహస్య సమాచారంతో పాటు యూరప్, ఆసియాలపై కేజీబీ అంచనాల కీలక సమాచారం ఖురానాకు చేరింది. ఈ ఆపరేషన్ పేరు ‘‘Operation Azalea’’ నిర్ణయించింది RAW.

  ఏ చిన్న సమాచారం కూడా వ్యర్థమైంది కాకుండా ఉండేందుకు ఖురానా జాగ్రత్త పడ్డారు. ప్రపంచ దేశాల విషయంలో భారత్ వైఖరి రూపొందడంలో ఈ సమాచారం విశేషంగా తోడ్పాటు అందించింది. యూరప్, అమెరికాలతో రష్యాకు గల కమ్యూనికేషన్ వ్యవస్థల సమాచారాన్ని RAW సేకరించింది. పాకిస్థాన్ విషయంలో రష్యా విధానానికి సంబంధించిన సమాచారం అందింది.

  1990 జూన్ లో బెర్లిన్ గోడ కూలిన తర్వాత ఐక్యజర్మనీ ఏర్పాటు విషయంలో రష్యా, అమెరికాల వైఖరుల సమాచారం కూడా ఖురానా ద్వారా RAW చేతికి చిక్కింది. అలెగ్జాండర్ సోదరుడు నికోలస్, అమెరికాతో చర్చల కోసం వాషింగ్టన్ వెళుతున్న సమాచారం ముందే తెలుసుకుంది RAW. నికోలస్ పర్యటన ఎజెండాలో అణు పరీక్షలు, కౌంటర్ టెర్రరిజం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద వివరాలను రాబట్టింది. 1990లో సోవియట్ రష్యా పతనం తర్వాత కూడా RAW సంబంధాలు కొనసాగాయి.

  అలెగ్జాండర్ – ఆనస్తీషియా కోర్కియాల మధ్య విభేదాలు మొదలయ్యాయని ఖురానా గుర్తించారు. వలపు వల విసరడం గూఢచర్యంలో సహజం. అలెగ్జాండర్ ఖురానా దీన్ని వారు తమ విధుల్లో తప్పని అంశంగా గుర్తించారు. కీలక సమాచారం కోసం ఆనస్తేషియా కోర్కియా అందాలను ఎరగా వేయాలని నిర్ణయించారు. అందులో ఉన్న రిస్క్ ను అంచనా వేశారు. అనుకున్నట్టుగానే కేజీబీ హెడ్ క్వార్టర్స్ లో ఓ అధికారికి వలపు వల విసిరింది కోర్కియా.

  ఆనస్తేషియా కోర్కియా వలపు వల విసిరిన సదరు అధికారి ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కీలకంగా వ్యవహరించారు. పాకిస్థాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించిన కీలక సమాచారాన్నిరాబట్టిన కోర్కియా… ఖురానాకు చేరవేసింది. అయితే 1996లో మొదటి సారి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖురానాకు మరో ఆపరేషన్ బాధ్యతలు అప్పగించింది RAW. అయినా సరే ఖురానా రష్యా రహస్య సంబంధాలను కొనసాగించారు. ఆనస్తేషియా కేజీబీ వర్గాల నుంచి అందిస్తున్న సమాచారం అత్యంత కీలకమైందనీ, కాబట్టి తనను తిరిగి రష్యా ఆపరేషన్స్ కు బదిలీ చేయాలని కోరడంతో ఖురాను తిరిగి మాస్కోకు పంపించారు.

  అయితే మారిన పరిణామాల నేపథ్యంలో ఆనస్తేషియా కోర్కియా డబుల్ ఏజెంట్ గా మారిందనే విషయం ఖురానా పసిగట్టారు. తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా భారత్ కు ఎలాంటి సమాచారం ఇవ్వాలో ‘డిజైన్డ్’ సమాచారం పంపడంపై ఖంగుతిన్న RAW ఆపరేషన్ ను హఠాత్తుగా నిలిపివేసింది.

  నిజానికి ఇది కొనసాగి ఉంటే 2000 డిసెంబర్ 13న భారత పార్లమెంట్ పై జరిగిన దాడిని నియంత్రించే అవకాశం ఉండేదంటారు మాజీ RAW అధికారులు. ఆకుపచ్చ కళ్ల ఆనస్తేషియా కోర్కియాకు కేజీబీ రహస్యాలు వెల్లడించింది ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే అనేది ఒకానొక అంచనా అంటారు నిపుణులు.

  నిఘా విభాగాల పనితీరులోనే సమస్యలుంటాయి. అనేక ఫలితాలు సాధించినా కొన్ని సందర్భాల్లో అవి బెడిసికొట్టిన విషమ సమయాలు కూడా ఉంటాయి. మన దేశ విదేశాంగ నిఘా విభాగం అట్లా అనేక ఆపరేషన్లు నిర్వహించి విజయవంతమైంది. మరికొన్ని సందర్భాల్లో ఆపరేషన్లను హఠాత్తుగా నిలిపివేయాల్సి వచ్చింది.

  Trending Stories

  Related Stories