Special Stories

ఫ్యాక్ట్ చెక్: మా గ్రామంలోకి ప్రవేశించవద్దంటూ యోగి ఆదిత్యనాథ్ ను అడ్డుకున్నారా..?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నో నగరాలను తిరుగుతూ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను తెలుసుకుంటూ ఉన్నారు. పలువురు కరోనా రోగుల కుటుంబాలను కలిసి.. చికిత్స సకాలంలో అందుతుందో లేదో అనే విషయాలను తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలని.. సామాజిక దూరం అన్నది ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. అందుకు సంబంధించిన పలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

యోగి ఆదిత్యనాథ్ ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వచ్చారు. అందులో యోగి ఆదిత్యనాథ్ కు, మాట్లాడుతున్న వ్యక్తికి మధ్య మంచాన్ని అడ్డుగా ఉంచారు. ఎవ్వరూ వెళ్ళడానికి వీలు లేకుండా ఓ మంచాన్ని అడ్డుగా ఉంచారు. ఆ మంచం అవతలి నుండే సదరు వ్యక్తితో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉన్న వీడియోను మనం గమనించవచ్చు.

అయితే ఈ వీడియోను, ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న కొందరు. యోగి ఆదిత్యనాథ్ ను గ్రామంలో రాకుండా అడ్డుకున్నారంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఓ ముసలాయన యోగి ఆదిత్యానాథ్ తమ గ్రామంలో అడుగుపెట్టకూడదంటూ చెప్పారని.. ఆదిత్యనాథ్ ఎన్ని సార్లు అడిగినా ఆయన అడ్డు తీయలేదని పోస్టులు పట్టారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వీడియోను సోషల్ మీడియా లో వైరల్ చేశారు. యాక్ట్రెస్ నగ్మా, కాంగ్రెస్ నేత ఓంవీర్ యాదవ్, కన్వల్ చడ్డా.. ఇలా పలువురు ఇదే జరిగింది అంటూ పోస్టులు పెట్టారు. ఇంకొందరు నాయకులు కూడా దీన్ని షేర్ చేశారు.

నటి నగ్మా ‘ఈ ఘటన ఆదివారం నాడు మీరట్ జిల్లాలోని బిజౌళి గ్రామంలో చోటు చేసుకుంది. యోగి ఆదిత్యనాథ్ మా గ్రామంలోకి రాకూడని గ్రామస్థులు డిమాండ్ చేశారని.. ఆయన ఎన్ని సార్లు అడిగినా కూడా గ్రామస్థులు అడ్డుగా ఉన్న వస్తువులను తీయకపోవడంతో ఆదిత్యనాథ్ వెనుతిరిగారు’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

నిజం ఏమిటంటే:

మీరట్ పోలీసులు ఈ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ‘కొందరు ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా పోస్టులు పెడుతూ ఉన్నారని.. ఇవి ఫేక్ న్యూస్ కిందకు వస్తాయని’ మీరట్ పోలీసులు ట్వీట్ పెట్టారు.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కంటోన్మెంట్ లో ఉన్న కుటుంబాన్ని పరామర్శిస్తున్నప్పుడు తీసిన వీడియో అంటూ క్లారిటీ ఇచ్చారు. బిజౌళి గ్రామంలో కంటోన్మెంట్ జోన్ లను అధికారులు ఏర్పాటు చేశారని.. అక్కడికి వెళ్లిన యోగి ఆదిత్యనాథ్ అక్కడి కుటుంబాలతో పరిస్థితుల గురించి ఆరాతీశారని.. వైద్యం సరిగా అందుతోందా లేదా అన్నది తెలుసుకున్నారని మీరట్ పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు.

తమ బాగోగుల గురించి స్వయానా ముఖ్యమంత్రి వచ్చి తెలుసుకోవడం పట్ల స్థానికులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమకు వైద్య సహాయం అందుతోంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అక్కడే ఉన్న ప్రజలు ‘యోగీజీ జిందాబాద్’ అంటూ నినాదాలు కూడా చేశారు.

తప్పుగా కథనాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిని యూపీ పోలీసులు హెచ్చరించారు. తప్పుడు కథనాలు పోస్టు చేసిన కొందరు జర్నలిస్టులు వీడియోలను డిలీట్ చేసి క్షమాపణలు కూడా చెప్పారు. కొందరు మాత్రం ఇంకా జనాలను తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు.

‘యోగి ఆదిత్యనాథ్ ని గ్రామస్థులు అడ్డుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు’. వైరల్ అవుతున్న ఈ కథనాలు ‘ఫేక్’.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − one =

Back to top button