More

    ఉద్యోగ సంఘాల‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన లేఖ

    కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు మండిప‌డుతున్నాయి. పీఆర్సీపై రాజీప‌డబోమని, చ‌ర్చ‌ల‌కూ రాబోమ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు చెబుతున్నాయి. ఉద్యోగ సంఘాల‌ నేత‌ల‌కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ లేఖ రాశారు. ఒకపక్క కరోనా బీభత్సం సృష్టిస్తోంద‌ని.. మరొక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక‌ దుస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపవలసిందిగా కోరుతున్నారు. కొత్త పీఆర్సీ అమ‌లు చేయ‌డం వ‌ల్ల రూ.10,247 కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని ఏపీ స‌ర్కారు చెబుతోంద‌ని.. త‌మ‌కు చిన్న‌ మొత్తంలో పెంచిన జీతాలు వ‌ద్దంటూ ఉద్యోగ సంఘాలు స‌మ్మెకు దిగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. సాధార‌ణంగా జీతాలు పెంచాల‌ని ఉద్యోగులు స‌మ్మెల‌కు దిగడం తాను చూశాన‌ని.. పెంచిన జీతాలు వ‌ద్దంటూ స‌మ్మెకు దిగ‌డం ఇదే ప్ర‌థ‌మం అయి ఉండొచ్చ‌ని అన్నారు. ఈ పరిస్థితులలో స‌మ్మెను ఆపాల‌ని ఆయ‌న కోరారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు పోకుండా చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం సాధించాలని కోరుతున్నానని ఉండవల్లి పేర్కొన్నారు.

    స‌చివాల‌య ఉద్యోగుల సంఘం ఈ రోజు కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసింది. ఇత‌ర అసోసియేష‌న్ల‌తో క‌లిసి స‌మ్మెకు వెళ్లే అంశంపై చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఉద్యోగులు చ‌ర్చ‌ల‌కు వ‌స్తార‌ని ఏపీ మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ, పేర్ని నాని ఎదురుచూస్తున్నారు. ఛాంబ‌ర్‌లోనే ఉద్యోగ సంఘాల నేత‌ల కోసం ఎద‌రుచూస్తున్నారు. పీఆర్సీపై చ‌ర్చ‌ల‌కు రావాల‌ని ఇప్ప‌టికే వారు పిలుపునిచ్చారు.

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీపై ఉద్యోగులు చేస్తోన్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి సుజాత ప్ర‌క‌టించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్ప‌టికీ ఉద్యోగుల సమస్యలు తీరలేదని, త‌మ ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె ప్ర‌క‌టించారు. రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తామని హెచ్చ‌రించారు. ఎలా పోరాడాలో తేల్చుకోలేని అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నార‌ని.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇస్తారని ఉద్యోగులంతా భావిస్తే, వారితో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు 19 శాతం ఐఆర్ తేడా ఉందని తెలిపారు.

    ఆదివారం నాడు ఐదు గంటల పాటు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఉద్యోగ సంఘాల నేతలు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. సోమవారం నాడు చర్చలకు రాబోవడంలేదని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. పీఆర్సీ జీవోలు రద్దు చేసినప్పుడే చర్చలకు వస్తామని.. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. శశిభూషణ్ కుమార్ ఉద్యోగ సంఘాలు సోమవారం మధ్యాహ్నం చర్చలకు రావాలంటూ మరోసారి ఆహ్వానించారు. చర్చల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సీఎస్ సమీర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటారని వివరించారు.

    Trending Stories

    Related Stories