హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్‌లో వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం దగ్గర పోలింగ్ తీరును పరిశీలించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని ఓటర్లు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ గ్రామస్తులు కౌశిక్ రెడ్డిని నిలదీశారు. నీకు ఇక్కడేం పని.. ఎందుకొచ్చావంటూ ఆయన్ని ప్రశ్నించారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పలువురు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి దొంగ ఓట్లు వేయించడానికే వచ్చారంటూ ఆరోపించారు. దీంతో కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు స్థానికుడైన కౌశిక్ రెడ్డిని ఎందుకు పంపించేశారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
పోలింగ్ తీరును పరిశీలించడానికి వచ్చానని పాడి కౌశిక్ రెడ్డి చెబుతున్నా కూడా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. జై ఈటల అంటూ నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి బయటి వరకు తరిమారు. పోలింగ్ సెంటర్కు ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించారు. దాంతో కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన భార్య జమునతో కలిసి కమలాపూర్ లోని 262 నెంబర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక ఎన్నిక కోసం ఇన్ని వందల కోట్లను ఖర్చు చేసిందని అన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ప్రభుత్వ జీవోల ద్వారా వేల కోట్ల రూపాయల ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు. హుజూరాబాద్ లో ఏం జరుగుతోందనే విషయాన్ని యావత్ తెలంగాణ ఉత్కంఠగా ఎదురు చూసిందని ఈటల అన్నారు. తమ గుండెల్లోని బాధను హుజూరాబాద్ ప్రజలు ఓట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చారని… 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదవుతుందని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి సహకరించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఈటల అన్నారు. ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.