మత్తు ఇంజక్షన్లు వినియోగిస్తూ, వాటిని విశాఖపట్నం నగరంలో పలువురికి విక్రయిస్తున్న ముఠాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెట్టి, సోమవారం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ దరి ఎన్ఎస్టీఎల్ గేటు సమీపంలో సెబ్ టాస్క్ఫోర్స్, సిటీ పోలీసు టాస్క్ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలేనికి చెందిన చందు, పెందుర్తి ప్రాంతానికి చెందిన కల్యాణ్ సాయి, ఎం.గణేష్, భీమిలికి చెందిన కల్లా హరిపద్మ రాఘవరావుల వద్ద అనుమతి లేకుండా కొనుగోలు చేసిన పెంటాజోసిన్ లైన్ లాక్టట్ ఇంజన్లు 94 ఆంపిల్స్ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు సెబ్ ఇన్స్పెక్టరు సీహెచ్వీఎస్.ప్రసాద్ తెలిపారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి ఈ మత్తు ఇంజక్షన్లను తీసుకునివచ్చి తాము వినియోగిస్తూ, కొందరు యువకులకు విక్రయిస్తున్నట్టు వివరించారు.
వీరికి మత్తు ఇంజక్షన్లను ఢిల్లీకి చెందిన అసిమ్, వెస్ట్ బెంగాల్ చెందిన అనుపమ్ అధికారి అనే వ్యక్తులను సరఫరా చేస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు. వెస్ట్ బెంగాల్, ఢిల్లీ నుంచి సరుకు తీసుకువచ్చి వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తూ ఉంటారు. ముందస్తు సమాచారంతో పక్కా వ్యూహం తో విశాఖపట్నం సెబ్ అధికారులు నిందితులతో పాటు మత్తు ఇంజక్షన్లు సరఫరా చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లను, 94 ఇంజక్షన్స్, ఒక టూవీలర్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల అక్రమ విక్రయాల విషయంలో సెబ్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తామని విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు ఇలాంటి ఘటనలపై పకడ్బందీగా వ్యవహరించబోతున్నామని తెలిపారు.