కూతురు ప్రేమ వ్యవహారం నచ్చని తండ్రి ఆమెను హత్య చేశాడు. తన కూతుర్ని ఎందుకు చంపాల్సి వచ్చిందో వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖ కేజీహెచ్ డౌన్‌లోని రెల్లివీధిలో వడ్డాది వర ప్రసాద్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడు కేజీహెచ్ మహాప్రస్థానం వ్యాను డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య తో విబేధాలు ఉండగా.. ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్ద చేశాడు. పెద్ద కుమార్తె ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. రెండో కూతురు లిఖితశ్రీ(16) పదో తరగతి చదువుతోంది. అరవింద్ అనే యువకుడిని ప్రేమిస్తున్నానని ఇటీవల లిఖిత తన తండ్రి వరప్రసాద్‌కు చెప్పింది. ఇలాంటివి వద్దని.. అతడితో తిరగవద్దని వరప్రసాద్ కుమార్తె లిఖిత శ్రీ చెప్పాడు. తండ్రి మాటలు వినకుండా అరవింద్‌తో కలిసి ఇటీవల లిఖిత శ్రీ బయటకు వెళ్లింది. వరప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వాళ్లిద్దరిని తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. శుక్రవారం మధ్యాహ్నాం ఈ విషయమై మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అతడు కుమార్తెను హత్య చేసి చంపేశాడు. అనంతరం పోలీసులకు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది.
వరప్రసాద్ ఈ హత్యకు సంబంధించిన కారణాలను సెల్ఫీ వీడియోలో వివరించాడు. తన కూతురిని తానే చంపేశానని అన్నాడు. ఎవరో అబ్బాయి కోసం ఆమెను పెంచలేదని.. పెద్దమ్మాయి ఏదో చేసిందని ఆమెను వదిలేశాను. చిన్నమ్మాయి బాక్సింగ్‌లో చేరతానంటే చేర్పించాను.. అరవింద్‌ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అతను గొడవల్లో ఉన్నాడు. ఆగాలని కోరాను. అయినా నా మాట వినకపోవడంతో నా తల్లి విజయలక్ష్మీ వర్థంతి రోజునే నా కూతురిని చంపేశానని వీడియోలో వరప్రసాద్ చెప్పాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.