వివో.. భారత దేశంలో ప్రముఖ మొబైల్ బ్రాండ్. దీని వేర్లు మాత్రం చైనాలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే..! తాజాగా ఈ సంస్థ చేస్తున్న అక్రమాలు బయట పడడంతో అందరూ షాక్ అవుతూ ఉన్నారు. భారతదేశానికి పన్ను ఎగురవేస్తూ చైనాకు డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. భారత్‌లో పన్ను ఎగవేసేందుకు వివో తమ టర్నోవర్‌లో సుమారు 50శాతం మొత్తాన్ని చైనాకు తరలించినట్లు ఈడీ తెలిపింది. ఈ మొత్తం 62వేల 476కోట్ల రూపాయలు. 119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 465 కోట్ల రూపాయల వివో నిధులను స్తంభింపజేసినట్లు ఈడీ వివరించింది. 73 లక్షల నగదు, 2 కిలోల బంగారు కడ్డీలను కూడా సీజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
వివో స్కాం ప్రధాన సూత్రధారి బిన్ లూ భారత్‌ను విడిచివెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. భారత్ అంతటా వివోను విస్తరించే బాధ్యతలను బిన్ లూకు అప్పగించగా అతడు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు తెగబడ్డాడు. వివో దాని అనుబంధ కంపెనీలపై ఈడీ దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు జరిపిన నేపధ్యంలో బిన్ లూ పరారీ గురించి తెలిసింది. దాదాపు 30 ప్రదేశాల్లో ఈడీ దాడులు జరిపింది. ఈడీ దాడుల సందర్భంగా కంపెనీకి చెందిన పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ లభించడం లేదని దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది.