విశ్వక్ సేన్ నటించిన హర్రర్ మూవీ విడుదల.. కానీ ఎవరికీ తెలియదు..!

0
263

విశ్వక్ సేన్ గత కొన్నేళ్లలో టాలీవుడ్ లో మంచి హీరోలలో ఒకడిగా ఎదిగాడు. ఓ వైపు అతడిని వివాదాలు వెంటాడుతూ ఉన్నా.. సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ ను అందుకుంటూ ఉండగా.. మరికొన్ని సినిమాలు పర్వాలేదనిపిస్తూ ఉన్నాయి. మాస్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోగా టాలీవుడ్ లో స్థిరపడిపోయాడు. సాధారణంగా విశ్వక్ సేన్ చిత్రం విడుదలైనప్పుడు కాస్త సందడి ఉంటుంది. తన సినిమాను జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి విశ్వక్ సేన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

తాజాగా విశ్వక్ సేన్ సినిమా ఒకటి విడుదల అయిందనే విషయం ఎవరికీ తెలియదు. అతని సినిమాలలో ఒకటి ఇటీవల OTTలో విడుదలైంది. ఎటువంటి హైప్, బజ్ లేదా ప్రమోషన్స్ లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా పేరు ‘బూ’. గత వారం జియో సినిమాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఈ సినిమాలో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ..దాన్ని ప్రమోట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మేఘా ఆకాష్, మంజిమా మోహన్, పృధ్వీరాజ్‌లతో కూడిన బలమైన తారాగణం ఉన్నప్పటికీ ఈ సినిమాకు మినిమమ్ ప్రమోషన్‌లు లేవు. తలైవి, అన్న, నాన్న వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్ ఈ సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టలేదు. దీన్ని బట్టి ఈ సినిమా గురించి ఎవరికీ తెలియకూడదని విశ్వక్ సేన్ అనుకున్నాడో.. ఏమో.. అని అందరికీ అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత అయినా ఎవరైనా పట్టించుకుంటారనుకుంటే అది కూడా లేకుండా పోయింది. హారర్ జానర్ లో విడుదలైన ఈ సినిమాను జనం కూడా చూడడం లేదు. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే బోర్ కొట్టడం మొదలైంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. చూసిన కొద్ది మంది మాత్రం ఇది గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన చెత్త హారర్ సినిమా కోవలోకే వస్తుందని పెదవి విరిచారు. అందుకేనేమో ఈ సినిమా గురించి చెప్పుకోడానికి కూడా సదరు స్టార్స్ ముందుకు రాలేదు.