More

    20 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించే శివుడి విగ్రహం

    రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ‘విశ్వాస్ స్వరూపం’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని శనివారం ప్రారంభించనున్నారు. నాథ్‌ద్వారా పట్టణంలో ఏర్పాటు చేసిన 369 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని గుజరాత్‌కు చెందిన ఆధ్యాత్మిక నాయకుడు, మత బోధకుడు మొరారీ బాపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి తదితరుల సమక్షంలో ప్రజల కోసం తెరవనున్నారు. శివుడు ధ్యానముద్రలో ఉన్నట్టు ఈ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా నవంబరు 6 వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం రాష్ట్రంలో తొమ్మిది రోజుల పాటు – అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6 వరకు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థాన్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పలివాల్ తెలిపారు. “శ్రీనాథ్‌జీ నగరంలో ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన శివుని విగ్రహం మతపరమైన పర్యాటక రంగానికి కొత్త ఊపును తెస్తుంది” అని పలివాల్ పేర్కొన్నారు. మొరారీ బాపు తొమ్మిది రోజుల పాటూ రామ కథా పారాయణం చేస్తారు.

    ఉదయపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విగ్రహాన్ని తత్ పదం సంస్థాన్ నిర్మించింది. ఈ విగ్రహం ధ్యాన భంగిమలో ఉంది. 20 కిలోమీటర్ల దూరం నుండి కనిపిస్తుంది. కొండపై ఏర్పాటు చేయబడింది. ఈ విగ్రహం ప్రత్యేక లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోయి రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోందని కార్యక్రమ ప్రతినిధి జైప్రకాష్ మాలి తెలిపారు. ‘విశ్వాస్ స్వరూపం’ ప్రపంచంలోనే ఎత్తైన శివ విగ్రహం, ఇందులో లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం హాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి నాలుగు లిఫ్టులు, మూడు మెట్లు ఉన్నాయి. విగ్రహం పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 2012 ఆగస్టులో అప్పటి సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్, మొరారీ బాపు సమక్షంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

    దీని నిర్మాణంలో మూడు వేల టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకను ఉపయోగించారు. వర్షం, ఎండ నుండి రక్షించడానికి రాగి రంగు విగ్రహానికి జింక్ మిశ్రమంతో పూత పూయబడింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులను ఈ విగ్రహం తట్టుకోగలదని మాలి చెప్పారు. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో జరిగిందని తెలిపారు. విగ్రహం చుట్టూ ఉన్న వేదిక బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తారు. పర్యాటకుల కోసం ఫుడ్ కోర్ట్, అడ్వెంచర్ పార్క్, జంగిల్ కేఫ్‌ను ఉన్నాయి.

    Trending Stories

    Related Stories