మహారాష్ట్ర పోలీసులు కేంద్ర మంత్రి నారాయణ్ రాణెను అరెస్ట్ చేసిన ఘటనపై ఇప్పటికే పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. తింటున్న సమయంలోనే కేంద్ర మంత్రిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లడం.. అర్ధరాత్రి సమయంలో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. శివసేనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టడంతో మహారాష్ట్ర అట్టుడుకుతున్నది.

ఇప్పుడు విశ్వ హిందూ సేన అధ్యక్షుడు అరుణ్ పాఠక్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తల నరికి తెచ్చినవారికి రూ.51 లక్షల రివార్డును అరుణ్ పాఠక్ ప్రకటించారు. ఈ మేరకు తన ప్రకటనను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ప్రకటించారు. వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లను అతికించిన కేసులో మూడు నెలలుగా పరారీలో ఉన్నాడు. నారాయణ రాణె అస్థికలను కూడా కాశీలో నిమజ్జనం చేయడానికి అనుమతించబోమని పాఠక్ తెలిపారు. రాణెను బాలాసాహెబ్ ఠాక్రే శివ సైనికుడిగా చేస్తే ప్రజాదరణ పొందడానికి బీజేపీ బాలాసాహెబ్ కుమారుడిపైనే దాడి చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రేపై రాణె చేసిన వ్యాఖ్యలపై తమ చర్యను శివసేన సమర్థించుకున్నది. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే ఇలాగే ఉంటుందని హెచ్చరించింది.

కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తన జన్ ఆశీర్వాద్ యాత్రను మళ్లీ ప్రారంభించనున్నారని బుధవారం ఆయన అనుచరులు తెలిపారు. త్వరలోనే యాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. ఎప్పుడు ప్రారంభించేది త్వరలో తెలియజేస్తామని రాణె అనుచరుడు రజన్ తెలిపారు. రాణె ఆగస్ట్ 19వ తేదీన ముంబైలో తన జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రారంభించారు. ఏడు రోజులు పాటు సాగే ఈ యాత్ర సింధుదుర్గ్‌లో ముగియాల్సి ఉంది. సోమవారం రాయ్‌గఢ్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలియనందుకు ఉద్ధవ్ చెంప పగలకొడతానని అన్నారు. దీంతో ఆయనపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.