ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. రుషికొండలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత… పరిపాలన ప్రారంభం కావొచ్చన్నారు. ముఖ్యమంత్రి విశాఖలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తే ఎవరూ అడ్డుకోలేరన్నారు. అయితే బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోందని.. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకువస్తాయని చెప్పారు. నరసాపురం సభకు వచ్చిన మహిళలతో చున్నీలు తీయించడం సిగ్గుచేటని.. మహిళా కమిషన్ చైర్ పర్శన్ వాసిరెడ్డి పద్మకు ఈ చర్యలు తప్పు అనిపించలేదా..? అని ప్రశ్నించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం సభకు హాజరయ్యే ప్రజలకు డ్రెస్‌కోడ్ ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులను జైలుపాల్జేస్తుంటే సహించబోమని హెచ్చరించారు.