National

పునీత్ చదివిస్తున్న 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై నేను చూసుకుంటాను: విశాల్

కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ఆదివారం నిర్వహించారు. ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశారు. పునీత్‌ రాజ్ కుమార్ 46 సంవత్సరాల వయసులో శుక్రవారం నాడు గుండెపోటు రావడంతో మరణించారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు రాజ్‌కుమార్‌ అంతిమ యాత్ర ప్రారంభం అయింది. 6.30 గంటలకు యాత్ర కంఠీరవ స్టూడియోకు చేరుకొన్నది. వేలాది మంది అభిమానుల అశ్రు నయనాల మధ్య ఈ యాత్ర సాగింది. సీఎం బసవరాజ్‌ బొమ్మై పునీత్‌ నుదుటిపై ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్ రాజ్ కుమార్ లేడనే చేదు నిజాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.

పునీత్ రాజ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో మంది పిల్లలకు విద్యను అందించి.. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారు. పునీత్ రాజ్ కుమార్ చేసిన మంచి పనులను తాము కొనసాగిస్తామని దక్షిణాది నటులు చెబుతూ వస్తున్నారు. తాజాగా నటుడు విశాల్ పునీత్ రాజ్‌కుమార్ ను స్మరించుకుంటూ.. ఇప్పటి వరకు ఆయన చదివిస్తున్న 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని మాట ఇవ్వడం విశేషం. పునీత్ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని, మేకప్ ఉన్నా లేకున్నా ఆయన ఒకేలా మాట్లాడేవారని విశాల్ అన్నారు. సమాజానికి పునీత్ ఎంతో చేశారని.. ఎంతోమందికి ఉచిత విద్యను అందించడంతోపాటు వృద్ధాశ్రమాల్ని కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ఒకే ఒక్క మనిషి ఇన్ని పనులు చేశాడంటే నమ్మలేకున్నానని, ఇప్పటి వరకు ఆయన చదివించిన 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని మాట ఇచ్చారు విశాల్. ‘ఎనిమి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారని, చివరికి తన కళ్లను కూడా దానం చేశారని విశాల్ గుర్తు చేశారు. పునీత్ లేరన్న విషయం నమ్మశక్యం కావడం లేదన్నారు. ఆయన మరణం ఒక్క చిత్ర పరిశ్రమకే కాదని, మొత్తం సమాజానికే తీరని లోటని అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలకు తనవంతు సాయాన్ని అందిస్తానని మాటిచ్చారు.

Related Articles

Back to top button