స్పేస్ టూరిజంలో భాగంగా ప్రపంచ కుబేరుడు, వర్జిన్ గ్రూప్ సంస్థల అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. భూమి నుండి నింగికి ఎగసిన వ్యోమనౌక గంట తర్వాత సురక్షితంగా తిరిగివచ్చింది. రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములతో కూడిన యూనిటీ-22 నౌక సురక్షితంగా భూమిపై ల్యాండైంది. భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న రిచర్డ్ బ్రాన్సన్ ఆశలకు ఈ విజయం మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఈ రోదసి యాత్రలో తెలుగమ్మాయి శిరీష బండ్ల పాల్గొంది. రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసిలో ప్రవేశించిన నాలుగోో భారత సంతతి వ్యోమగామిగా శిరీష ఘనత సాధించింది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అరుదైన రోదసియాత్ర చేపట్టారు. దీన్ని లైవ్ లో తిలకించేందుకు వర్జిన్ గెలాక్టిక్ ఏర్పాట్లు చేసింది. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ అంతరిక్ష ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తన కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ యొక్క రాకెట్ ను అంతరిక్ష అంచులకు తీసుకుని వెళ్ళాడు. సమీప భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. అందుకోసమే ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ విమానం మార్కెటింగ్ ఈవెంట్‌గా ఉద్దేశించబడింది. సంస్థ అనుకున్న వాణిజ్య అంతరిక్ష విమానాల ద్వారా స్పేస్ టూరిజం మొదలుపెట్టించాలని అనుకుంటూ ఉన్నారు. ప్రతిదీ సరిగ్గా జరిగితే వచ్చే ఏడాది స్పేస్ టూరిజం ప్రారంభం కానుంది.
అమెరికాలోని న్యూ మెక్సికోలోని లాంచ్‌ప్యాడ్ నుండి కంపెనీ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లారు. “ఇది అంతరిక్షంలోకి వెళ్ళడానికి అందమైన రోజు. మేము స్పేస్‌పోర్ట్ అమెరికాకు చేరుకున్నాము ”, బ్రాన్సన్ తన షెడ్యూల్ టేకాఫ్‌కు రెండు గంటల ముందు ట్వీట్ చేశాడు. అయితే ఈ ప్రయోగం కాస్త ఆలస్యంగా మొదలైంది. న్యూ మెక్సికోలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని వర్జిన్ గెలాక్టిక్ వర్గాలు మొదట వెల్లడించాయి. దాంతో అంతరిక్ష యానం 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అయింది. వర్జిన్ గెలాక్టిక్ చేపట్టిన ఈ రోదసి యాత్ర కోసం యూనిటీ 22 వ్యోమనౌకను ఉపయోగించారు. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములు ప్రయాణించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందం వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు గంట తర్వాత వ్యోమనౌక రోదసిలో ప్రయాణించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. వీవీఎస్ యూనిటీ స్పేస్ ఫ్లైట్‌లో వర్జిన్ గెలాక్టిక్ రిచర్డ్ బ్రాన్సన్, చీఫ్ ఆస్ట్రోనాట్ ఇన్స్ట్రక్టర్ బెత్ మోసెస్, వర్జిన్ గెలాక్టిక్ లీడ్ ఆపరేషన్స్ ఇంజినీర్ కొలిన్ బెన్నెట్, శిరీష బండ్ల వెళ్లారు. ఈ వ్యోమనౌకకు డేవ్ మెకేయ్, మైఖేల్ మసూకి పైలెట్లుగా వ్యవహరించారు.
బండ్ల శిరీష కూడా ఈ ప్రయాణం చేసొచ్చిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష కొన్నాళ్లుగా వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. శిరీష 2015లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా వర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు. ఈ మధ్యే 747 ప్లేన్ ఉపయోగించి అంతరిక్షంలోకి శాటిలైట్‌ను లాంచ్ చేసిన వర్జిన్ ఆర్బిట్ వాషింగ్టన్ ఆపరేషన్స్‌ను కూడా చూసుకుంటోంది. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. శిరీష వయసు 34 ఏళ్లు. ఆమె తల్లిదండ్రులది గుంటూరు జిల్లా. ఈమె గుంటూరులోనే పుట్టారు. కానీ అమెరికాలో పెరిగారు. నాలుగేళ్ల వయసు నుంచి హ్యూస్టన్‌లో ఉంటున్నారు.