భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ లో జరుగుతున్న తొలి టెస్టుకు రెండో రోజు వెలుతురు లేమి, వర్షం అడ్డంకిగా మిగిలాయి. మొదట వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట ఆగిన కాసేపటికే వర్షం కూడా గ్రౌండ్ ను పలకరించింది భారత్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 125 పరుగులు చేసిన స్థితిలో వెలుతురు లేమితో మ్యాచ్ ను నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 57, రిషబ్ పంత్ 7 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, ఆ స్కోరుకు భారత్ ఇంకా 58 పరుగులు వెనుకబడి ఉంది.ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ కు 2, ఓల్లీ రాబిన్సన్ కు ఓ వికెట్ దక్కాయి. ఓపెనర్ రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన పుజారా 4 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ కావడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అజింక్యా రహానే 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వెలుతురు సరిగా లేకపోవడం, వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో రెండో రోజు ఆటను ముగించేశారు.
చాలా రోజుల తర్వాత ఓపెనింగ్ పార్ట్నర్ షిప్ బాగా వచ్చిందని ఆనందపడే లోపే రోహిత్ శర్మ భారీ షాట్ కు ప్రయత్నించి వికెట్ ను ఇచ్చేశాడు. పుజారా వచ్చినప్పటి నుండి ఇంగ్లండ్ బౌలర్లు ఇబ్బంది పెడుతూనే వచ్చారు. ఏ దశలో కూడా పుజారా కుదురుకున్నట్లుగా కనిపించలేదు. ఇక విరాట్ కోహ్లీ మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆండర్సన్ వేసిన బంతిని అంచనా వేయలేక కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. జేమ్స్ అండర్సన్ వేసిన 41వ ఓవర్‌లోని మూడో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ 104 పరుగుల మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లి టెస్టుల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇది ఐదోసారి. ఈ ఐదింటిలో మూడుసార్లు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లి గోల్డెన్‌డక్‌గా వెనుదిరిగాడు. 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో, 2018లో ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా ఆండర్సన్ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. గోల్డెన్ డక్ విషయంలో కోహ్లి మరోచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా మూడుసార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లి తొలిస్థానంలో ఉన్నాడు. లాలా అమర్‌నాథ్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు టెస్టు కెప్టెన్లుగా రెండేసి సార్లు గోల్డెన్ డక్ అయ్యారు. ఆండర్సన్ 12 టెస్టుల తర్వాత కోహ్లిని అవుట్ చేశాడు. చివరగా 2014లో ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో కోహ్లిని అండర్సన్ అవుట్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్ లో అజింక్యా రహానే అనవసరంగా రనౌట్ అయ్యాడు. ఓలి రాబిన్‌సన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్ రెండో బంతిని స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఢిపెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశలో ఉన్న బెయిర్ స్టో దగ్గరికి వెళ్లింది. అయితే రాహుల్ క్రీజు నుంచి కదలడంతో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రహానే పరుగు కోసం ముందుకు వచ్చాడు. రాహుల్ వద్దంటూ చేయితో సిగ్నల్ ఇచ్చినప్పటికి రహానే క్రీజు దాటి బయటకు వచ్చేశాడు. అప్పటికే బంతిని అందుకున్న బెయిర్ స్టో రహానే ఉన్న వైపు విసిరాడు. బంతి నేరుగా వికెట్లను గిరాటేయడంతో రహానే రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.