కోహ్లీ వన్డే సిరీస్ ఆడడం లేదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

0
902

భారత మెన్స్ క్రికెట్ లో ఏదో జరుగుతోందనే ప్రచారం గత కొద్ది రోజులుగా కొనసాగుతూ ఉంది. సెల‌క్ట‌ర్లు విరాట్ కోహ్లీని వ‌న్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శ‌ర్మకు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీనిపై భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ వివరణ కూడా ఇచ్చాడు. కోహ్లీ మాత్రం దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

ఇక ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌కు దూరంగా ఉండాల‌ని కోహ్లీ భావించాడని.. జనవరిలో తన కుమార్తె వామిక బర్త్‌డే ఉండడంతో విరాట్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విహార‌యాత్ర‌కు ప్లాన్ చేసుకున్నాడనే ప్రచారం సాగింది. వామిక తొలి పుట్టిన రోజు కావ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని.. ఇప్ప‌టికే ఈ విషయంపై బీసీసీఐకు స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. రోహిత్‌కు వ‌న్డే కెప్టెన్సీ ఇచ్చిన కారణంగా కోహ్లీ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని కొంద‌రు అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని బీసీసీఐ అధికారి తెలిపారు. ఇప్పటి వరకూ కోహ్లీ వన్డేలను ఆడకుండా ఉండేందుకు, BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేదా సెక్రటరీ జే షాకు ఎలాంటి అధికారిక అభ్యర్థనను పంపలేదు. ప్రస్తుతానికైతే కోహ్లీ వన్డే సిరీస్ ఆడబోతున్నాడని” అని బీసీసీఐ సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు
“కోహ్లీ జనవరి 19, 21, 23 తేదీల్లో మూడు వన్డేలు ఆడబోతున్నాడు,” అని చెప్పుకొచ్చారు. “విరాట్ కోహ్లీ తన కుటుంబంతో ప్రయాణిస్తున్నాడు. అయితే, అతను టెస్ట్ సిరీస్ తర్వాత బయో బబుల్ లో అలసటగా భావించి, విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా సెలెక్టర్ల ఛైర్మన్, సెలెక్షన్ కమిటీ కన్వీనర్ అయిన సెక్రటరీ (జై షా)కి తెలియజేస్తాడు, ”అని తెలిపారు.

మరోవైపు ప్రాక్టీస్ సెష‌న్‌లో తొడ కండ‌రాల గాయం బారిన ప‌డ‌డంతో ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ నుంచి హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలో ప్రియాంక పాంచాల్‌ను ఎంపిక చేశారు. రోహిత్.. వ‌న్డే సిరీస్‌ క‌ల్లా కోలుకుంటాడ‌ని బీసీసీఐ ఆశిస్తోంది. ద‌క్షిణాఫ్రికాల‌తో వ‌న్డేల‌కు అత‌డే సారథ్యం వ‌హిస్తాడ‌ని బీసీసీఐకు చెందిన ఓ అధికారి తెలిపాడు. రోహిత్ గాయంపై మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇక ద‌క్షిణాఫ్రికాతో ఈ నెల 26 నుంచి మూడు టెస్టు సిరీస్ ప్రారంభం కానుండ‌గా.. జ‌న‌వ‌రి 19 నుంచి 26 వ‌ర‌కు మూడు వ‌న్డేల సిరీస్ నిర్వహించనున్నారు.