విరాట్ కోహ్లీ కోవిడ్ బారిన పడ్డాడు. మాల్దీవుల వేకేషన్‌కు వెళ్లొచ్చిన విరాట్ కు పాజిటివ్ వచ్చింది అని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగానే కోహ్లీకి కరోనా పాజిటివ్ వచ్చింది. జూన్ 24 నుంచి లీసెస్టర్‌షైర్‌తో జరిగే భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు కోహ్లీకి కరోనా పాజిటివ్ రావడం భారత జట్టును ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ -19 బారిన పడిన తర్వాత ఆటగాళ్లను ఓవర్‌లోడ్ చేయొద్దని వైద్యుల సలహా ఉండడంతో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్లే. ఇక భారత బృందంలో మరిన్ని కోవిడ్ కేసులు ఉండవచ్చనే అనుమానాలు మొదలయ్యాయి.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జులై 1 నుంచి 5 వరకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రీషెడ్యూల్ అయిన ఐదో టెస్టు ప్రారంభం కానుంది. కోవిడ్ -19 వ్యాప్తి ఆందోళనతో గతేడాది సెప్టెంబర్ 10న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కావాల్సిన ఐదో, చివరి టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, హనుమ విహారి, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. కోహ్లీ జట్టులో కీలక సభ్యుడిగా ఉండటంతో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టుకు దూరం కావాల్సి వస్తే అది టీమిండియాకు ఊహించని దెబ్బ తగిలే అవకాశం ఉంది. టెస్టుకు ఇంకా సమయం ఉంది కాబట్టి కోహ్లీ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్ట్ మ్యాచ్ తర్వాత టీ20, వన్డే సిరీస్ జరగనుంది.
టీ20, వన్డే సిరీస్‌లో మూడేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా- 2021 టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. మొదటి రెండు టెస్టుల్లో భారత కెప్టెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డప్పటికీ, ఆ తర్వాత కుదురుకున్నాడు. 32 ఏళ్ల కోహ్లీ ఆ సిరీస్ లో 7 ఇన్నింగ్స్‌ల్లో 31.14 సగటుతో 218 పరుగులు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు కొట్టాడు.