విరాట్ కోహ్లీ కెప్టెన్ గా పలు సిరీస్ లలో విజయాలు సాధించాడు కానీ.. ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రం నెగ్గలేకపోయాడు. ఇది ఎంతో బాధించదగ్గ విషయమే..! ఇక నమీబియాతో లీగ్ మ్యాచ్ లో కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్ ఆడాడు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి తనకు ఇదే సరైన సమయమని విరాట్ కోహ్లీ తెలిపాడు. గత ఆరేడు సంవత్సరాల నుంచి విపరీతమైన క్రికెట్ ఆడామని… ఫీల్డ్ లోకి దిగిన ప్రతిసారీ ఎంతో ఒత్తిడికి గురవుతుంటామని చెప్పాడు. అత్యున్నతమైన ఆటగాళ్లతో కలిసి ఆడటం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. ఒక జట్టుగా అందరం మంచి ప్రదర్శన ఇచ్చామని తెలిపాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో నిరాశపరిచినా… అనేక మ్యాచ్ లలో మంచి ఫలితాలను సాధించామని చెప్పాడు. టీ20లో రెండు ఓవర్లలోనే ఫలితం తారుమారవుతుందని అన్నాడు. తమ ఓటమిని టాస్ పైకి నెట్టేయలేమని అన్నాడు. కొన్నేళ్లుగా జట్టు సాధించిన ఘన విజయాల వెనుక కోచింగ్ టీమ్ పాత్ర కూడా ఉందని చెప్పాడు. భారత క్రికెట్ కు వారు విశేషమైన సేవలను అందించారని కొనియాడాడు. టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా తన ఆటతీరులో మార్పు రాదని చెప్పాడు. ఎప్పటి మాదిరే జట్టు విజయం కోసం తన వంతు పాత్రను పోషిస్తానని తెలిపాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడం భారత జట్టుకు ఎంతో మేలు చేస్తుందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
భారత జట్టు కోచ్ గా బాధ్యతలు విడిచిపెడుతున్న రవి శాస్త్రి మాట్లాడుతూ… టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో జట్టులో మార్పు తీసుకురావాలని నాకు నేనే చెప్పుకున్నాను… నేను అనుకున్న మార్పు తీసుకురాగలిగానని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో టీమిండియా ఎదిగిన తీరు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని అన్నారు. సొంతగడ్డమీద బలమైన జట్లుగా పేరుగాంచిన అన్ని జట్లను విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు వాళ్ల సొంతగడ్డల మీదే ఓడించింది అని తెలిపారు. కోహ్లీ ఎంతో మెరుగైన ప్రమాణాలు నెలకొల్పాడని.. ముఖ్యంగా టెస్టు క్రికెట్ అత్యుత్తమ రాయబారుల్లో కోహ్లీ ఒకడని అన్నారు. టీమిండియా తదుపరి కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టును మరో మెట్టు పైకి తీసుకెళతాడని భావిస్తున్నట్టు రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. రాహుల్ ద్రావిడ్ కు అత్యుత్తమ జట్టు అందుబాటులో ఉందని వివరించారు. గత కొంతకాలంగా నిర్విరామంగా బబుల్ లో ఉండడం వల్ల శక్తులు హరించుకుపోయిన భావన కలుగుతోందని, ఆటగాళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉండొచ్చని అనుకుంటున్నానని తెలిపారు.