More

    కోహ్లీ సోషల్ మీడియా పోస్టు.. 11.45 కోట్లు అంటూ ప్రచారం..!

    ప్రపంచంలో ఏ క్రికెటర్ కు కూడా లేనంత ఆదాయం భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉంది. ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కోహ్లీ.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే భారీగా ఆదాయం వస్తుందనే ప్రచారం జరుగుతూ ఉంది. కోహ్లీ నెట్ వర్త్ 1000 కోట్లకు పైనే ఉంటుందని ఇటీవలే స్టాక్ గ్రో సంస్థ అంచనా వేసింది. ఇక ఆయన సోషల్ మీడియా పోస్టులకు కోట్లలో ఆదాయం వస్తోందని ప్రచారం సాగింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 11.45 కోట్లు వసూలు చేస్తున్నాడంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వార్తపై కోహ్లీ స్పందించాడు. ట్విట్టర్ ద్వారా జీవితంలో తాను అందుకున్న ప్రతిదానికీ రుణపడి ఉన్నానని కోహ్లీ చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా తన సంపాదన గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపాడు.

    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-100లో ఇద్దరు ఇండియన్ సెలబ్రిటీలు ఉన్నారని ఓ మీడియా సంస్థ తెలిపింది. విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా ఇద్దరే భారత్ నుంచి నిలిచారంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ ప్రకారం విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 14వ స్థానంలో నిలిచాడని.. భారత్ నుంచి టాప్‌లో ఉన్నాడని తెలిపారు. కోహ్లీకి ఇన్‌స్టాలో 25 కోట్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారని.. ఇందులో ఒక్కో స్పాన్సర్ పోస్టుకు 13,84,000 డాలర్లు వసూలు చేస్తున్నాడని తెలిపారు. భారత కరెన్సీలో చూస్తే అక్షరాలా రూ. 11 కోట్ల 45 లక్షలకుపైనే అంటూ వైరల్ అయిన పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. అందుకు సంబంధించి కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పుడు చక్కర్లు కొడుతున్న సోషల్‌ మీడియా సంపాదన వార్తల్లో ఎలాంటి నిజం లేదని కోహ్లీ ట్వీట్ చేశాడు.

    ఇన్‌స్టాగ్రామ్‌లో ఖరీదైన అథ్లెట్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడని సామాజిక మాధ్యమాల వ్యాపార నిర్వహణ వేదిక హాపర్‌ హెచ్‌క్యూ వెల్లడించింది. ఒక్కో పోస్టుకు కోహ్లీ రూ.11.45 కోట్ల చొప్పున తీసుకుంటున్నాడని అందులో తెలిపింది. ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, మెస్సి మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. ఒక్కో పోస్టు కోసం రొనాల్డో రూ.26.76 కోట్లు, మెస్సి రూ.21.49 కోట్లు వసూలు చేస్తున్నారని సదరు మీడియా సంస్థ తెలిపింది.

    Related Stories