More

    విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ కు సర్వం సిద్ధం.. విరాట్, రోహిత్ చెబుతోంది ఇదే

    భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈరోజు శ్రీలంకతో జరగబోయే టెస్ట్ మ్యాచ్ ఎంతో స్పెషల్..! ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్. భారత జట్టు త‌రుపున వందో టెస్టు ఆడ‌నున్న 12వ ఆట‌గాడిగా కోహ్లీ నిల‌నున్నాడు. ఈ మ్యాచ్‌కు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి ఇచ్చింది. 50 శాతం మంది ప్రేక్ష‌కులు ఈ మ్యాచ్‌ను వీక్షించ‌నున్నారు. దీంతో కోహ్లీ వందో మ్యాచ్ చూడాల‌న్న అభిమానుల కోరిక నెర‌వేర‌నుంది. వందో టెస్టులో కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. విరాట్ ఇంకో 38 ప‌రుగులు చేస్తే టెస్టుల్లో 8వేల ప‌రుగులు సాధించిన ఆరో భార‌త ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్‌(15,921), రాహుల్ ద్రావిడ్‌(13,298), సునీల్ గ‌వాస్క‌ర్‌(10,122), వీరేంద్ర సెహ్వాగ్‌(8,588), ల‌క్ష్మ‌ణ్‌(8,781) మాత్ర‌మే కోహ్లీ కంటే ముందు ఉన్నారు. ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ 99 టెస్టుల్లో 7,962 ప‌రుగులు చేశాడు.

    మొహాలీ స్టేడియంలో ఈ మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎసి లాంజ్, పెవిలియన్ టెర్రస్‌, విఐపి స్టాండ్‌లతో సహా అన్ని బ్లాక్‌ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సౌత్ బ్లాక్‌ లో 200 టిక్కెట్లు మినహా అన్నీ అమ్మేసినట్లు సిబ్బంది తెలిపారు. విద్యార్థులు చూడాలనుకుంటే మేము ఆ టిక్కెట్‌లను ఉంచామని.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆన్‌లైన్ విండోలో వాటిని కొనుగోలు చేయవచ్చని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్‌పి సింగ్లా అన్నారు.

    100 టెస్టులు ఆడతానని తాను ఎప్పుడూ ఊహించలేదని విరాట్ కోహ్లి తెలిపాడు. “నిజాయితీగా చెప్పాలంటే నేను 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది సుదీర్ఘ ప్రయాణం, చాలా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ 100కి చేరుకోగలిగాను.. దీనికి అందరికీ రుణపడి ఉంటాను” అని కోహ్లీ చెప్పాడు. “నేను 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగలనని నాకు ఎప్పుడూ తెలియదు. కానీ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. జీవితం చాలా అందమైనది.. అనూహ్యమైనవి చోటు చేసుకుంటూ ఉంటాయి. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన క్షణాలు ఉంటాయి. జీవితంపై ఎటువంటి ఆంక్షలు విధించాలని అనుకోవద్దు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి ఏమి జరగకూడదని భయపడటం లేదా నిరాశ చెందకుండా ఉండటం ఉత్తమం ఎందుకంటే నా కెరీర్, నా జీవితమే అందుకు ఒక ఉదాహరణ.” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

    కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కోహ్లీకి ఈ టెస్టు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తామన్నాడు. ఏ క్రికెటర్ అయినా వంద టెస్టులు ఆడటం సాధారణ విషయం కాదని., కోహ్లీ ఎంతో దూరం ప్రయాణించాడని అన్నాడు రోహిత్. టెస్టుల్లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పాడు. టీమిండియా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి ఎన్నో మార్పులు తెచ్చాడని అన్నాడు. కోహ్లీకి తన వందో టెస్టు ఒక ప్రత్యేకమైన మ్యాచ్ గా మిగిలిపోయేలా చేయాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్ పూర్తిగా ఐదు రోజుల పాటు కొనసాగేలా చేయాలనుకుంటున్నామని.. జట్టు ఈ స్థాయిలో ఉండటానికి కోహ్లీనే కారణమని చెప్పాడు.

    Trending Stories

    Related Stories