Telugu States

అసదుద్దీన్ ఒవైసీకి గట్టి కౌంటర్ ఇచ్చిన రాములమ్మ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా టీకా పంపిణీ చేయనున్నట్టు మోదీ వెల్లడించారు. కేంద్రమే టీకాలు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని మోదీ ప్రకటించారు. వ్యాక్సిన్‌కు రాష్ట్రాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని.. వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు. వ్యాక్సినేషన్‌పై అనేకసార్లు సీఎంలతో మాట్లాడాడాని.. టీకా కొరతపై అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ల కొరతపై రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఉచిత టీకా వద్దనుకుంటే సొంతఖర్చుతో ప్రైవేటుగా టీకా వేయించుకోవచ్చని పేర్కొన్నారు. రూ.150 సర్వీస్ చార్జితో ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ పొందవచ్చని అన్నారు. వ్యాక్సిన్లలో 25 శాతాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

మోదీ వ్యాఖ్యలపై ఎప్పటి లాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శనలు చేశారు. మరో అనవసర ప్రసంగం వినిపించినందుకు ప్రధానికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. కేంద్రం తన వ్యాక్సినేషన్ విధానాన్ని మార్చుకోవడానికి కారణం సుప్రీం కోర్టు ఆదేశాలే కారణం అయ్యుంటాయని.. వ్యాక్సిన్ విధానం వైఫల్యాలకు రాష్ట్రాలను బాధ్యుల్ని చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీనే వ్యాక్సిన్ సరఫరాపై ఘోరంగా విఫలం చెందారని ఒవైసీ విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలకే మోదీ పెద్ద పీట వేశారని తెలిపారు. దేశంలో వ్యాక్సిన్లకు ఎందుకింత భారీ కొరత ఏర్పడింది? దేశంలో సంపన్న వర్గాలకు మాత్రం వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా, పేదవాళ్లు మాత్రం వేచిచూడాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలంటే జూలై నాటికి 60 కోట్ల డోసులు కావాలి. కానీ ఇప్పుడు మనం నెలకు 8 కోట్ల డోసులే పొందగలుగుతున్నామని.. ప్రధాని ఈ కనీస లెక్కలను గుర్తించడంలోనూ విఫలమయ్యారని విమర్శించారు.

అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి ట్విట్టర్ లో బదులిచ్చారు. దేశంలో 135 కోట్ల భారీ జనాభా ఉన్నప్పుడు వ్యాక్సిన్ కొరత ఏర్పడడం సహజమే ఒవైసీ జీ… అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచం మొత్తం దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ కవల పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా? అని ప్రశ్నించారు. 2020 జులైలోనే వ్యాక్సిన్ కు ఆమోదం లభిస్తే, ఆ వ్యాక్సిన్ సంస్థకు ఆర్డర్ ఇవ్వకుండా ఏంచేస్తున్నారని విజయశాంతి ప్రశ్నించారు. 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వడం వీఐపీ సంస్కృతి అయితే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ సంస్కృతి కోసమా? అని విజయశాంతి ట్విట్టర్ లో విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న ఫోటోను కూడా విజయశాంతి ట్వీట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

ten + thirteen =

Back to top button