నాగార్జున యూనివర్సిటీలో జాబ్ మేళా.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయ సాయిరెడ్డి

0
852

గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ప్రైవేట్ సంస్థలలో 15వేల పోస్ట్‌లకు ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లో YSR కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్ మేళాను ప్రారంభించారు ఎంపీ విజయసాయి రెడ్డి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపి మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ లు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంత రావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ విజయ సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పిలుపును ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర పార్టీలపై కూడా సెటైర్లు వేశారు విజయసాయి. ఓటమి భయంతోనే కొందరు పొత్తులు పెట్టుకుంటారని.. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్న వైసీపీ విజయాన్ని ఆపలేరని అన్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని.. ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదన్నారు. అధికారం చంద్రబాబు నాయుడు వదులుకోలేదని.. ఆయననే ప్రజలు వద్దనుకున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు తెదేపా వారు చేసినవే అని.. తిరిగి ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారనే విమర్శలు చేశారు.

జాబ్ మేళా మేరుతో వైసీపీ నాయకులు యువతను మోసం చేస్తున్నారని తెలుగు యువత ఆరోపించింది. జాబ్ మేళా జరుగుతున్న నాగార్జున యూనివర్శిటీకి బయలుదేరిన తెలుగు యువత ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదని తెలుగు యువత ప్రతినిధులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. ప్రభుత్వ శాఖల్లో 2.30లక్షల ఉద్యోగాలు భర్తి చేస్తామని చెప్పడంతో నమ్మి ఓట్లు వేసిన యువతను ఇప్పుడు వీధులపాలు చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భరోసా, భద్రత లేని ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.