More

    గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రాజీనామా

    గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కొద్దిసేపటి కిందట గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికిప్పుడు విజయ్ రూపానీ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఊహించని రీతిలో విజయ్ రూపానీ శనివారం సాయంత్రం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రూపానీ రాజీనామాకు కారణమేమిటో స్పష్టంగా తెలియదు. ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎం విజయ్ రూపానీ. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు.

    తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని విజయ్ రూపానీ తెలిపారు. ఇది సాధారణంగా భారతీయ జనతా పార్టీలో చోటు చేసుకునేదే అని తెలిపారు. భారతీయ జనతా పార్టీలోనే ఉండి పార్టీ ఎదుగుదల కోసం పని చేస్తానని తెలిపారు. తాను ఇప్పటికే అయిదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని.. అందుకు తనకు చాలా గర్వంగా కూడా ఉందని తెలిపారు. కేంద్రంలోనూ, రాష్ట్రం లోనూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తూ వెళుతోందని అన్నారు. ప్రజలకు బీజేపీ మీద గట్టి నమ్మకం ఉందని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రి అవతారం ఎత్తుతారా లేక ఇంకెవరినైనా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ రాజీనామా వ్యవహారంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

    Trending Stories

    Related Stories