రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన విజయ్ రూపానీ

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికిప్పుడు విజయ్ రూపానీ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎం విజయ్ రూపానీ. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యెడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. విజయ్ రూపానీ రాజీనామా చేసిన వెంటనే గుజరాత్ బీజేపీ ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. విజయ్ రూపానీ 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్నారు. అటు, వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా, కొత్త సీఎంతో ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ యోచనగా కనిపిస్తోంది.
రాజీనామా అనంతరం గాంధీనగర్‌లో మీడియాతో మాట్లాడిన విజయ్ రూపానీ.. ఇన్నాళ్లు తనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం వచ్చిందని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను నెరవేర్చానని.. ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నది బీజేపీ అధిష్ఠానం సిద్ధాంతమని, అందుకు అనుగుణంగానే తాను రాజీనామా చేశానని రూపానీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా, చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. సీఎంగా గుజరాత్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, వచ్చే ఎన్నికల్లోనూ మోదీ నాయకత్వంలో తమదే విజయం అని ఉద్ఘాటించారు. సీఎం ఎవరైనా మోదీ మార్గదర్శనంలో పనిచేస్తామని రూపానీ స్పష్టం చేశారు. గుజరాత్ బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలసికట్టుగానే ఉన్నామని తేల్చేశారు.
కొత్త ముఖ్యమంత్రిగా మొత్తం నలుగురు నేతలు ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. మన్సుక్ మాండవీయ, నితిన్ పటేల్, సీఆర్ పాటిల్, పురుషోత్తమ్ రూపాలా కొత్త సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో ఉన్న నలుగురిలో మన్సుక్ మాండవీయ ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతోపాటు రసాయనాలు ఎరువుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. నితిన్ పటేల్ 2016 నుంచి గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్నారు. సీఆర్ పాటిల్ లోక్‌సభ్యుడిగా ఉన్నారు. పురుషోత్తమ్ రూపాలా కూడా మోదీ ప్రభుత్వంలో మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరిని బీజేపీ ఎన్నుకుంటుందా.. లేక ఇతర రాష్ట్రాల్లో లాగే మరో సంచలన పేరుతో బీజేపీ అధిష్టానం ముందుకు వస్తుందో చూడాలి.