మోదీ తెచ్చినవి గిఫ్టులు కాదు..!
బైడెన్ ఇచ్చిన బహుతులు కాదు..!!

0
670

అమెరికా పర్యటన ముగించుకుని వస్తూ వస్తూ.. 157 కళాఖండాలను వెంటతీసుకొచ్చారు ప్రధాని మోదీ. వాటిని అమెరికా మనకిచ్చిన బహుమతులంటూ.. బైడెన్ మోదీకిచ్చిన రిటర్న్ గిఫ్టులంటూ.. కొన్ని మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయి. నిజానికి, అమెరికా ప్రభుత్వం మనకిచ్చిన బహుతులు కాదు. ప్రధాని మోదీకి బైడెన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్టులు అంతకంటే కాదు. ఆ కళాఖండాలు మన దేశ సాంస్కృతిక సంపద. ఆ విగ్రహాలు మన వారసత్వ చిహ్నాలు. మన సంపదను మనం తిరిగి తెచ్చుకుంటే.. బహుమతులంటూ ప్రచారం చేస్తున్నాయి ఇంగితం లేని కొన్ని మీడియా సంస్థలు.

ఇక, విషయంలోకి వద్దాం. కొన్ని దశాబ్దాలుగా.. దుర్మార్గుల చేతుల్లో పడి అక్రమమార్గంలో.. మన పురాతన విగ్రహాలు, కళాఖండాలు సరిహద్దులు దాటుతున్నాయి. మన సాంస్కృతిక, వారసత్వ సంపద అపహరణకు గురవుతోంది. అందుకే, వాటిని గుర్తించి.. తిరిగి పుట్టింటికి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం 157 భారతీయ కళాఖండాలను తిరిగి మనకు అప్పగించింది. అదీ అసలు సంగతి. నిజానికి, అమెరికా నుండి 157 కళాఖండాలు, పురాతన వస్తువులను దేశానికి తీసుకొస్తామంటూ.. అంతకుముందే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు.. అమెరికా పర్యటనలో వున్న ప్రధాని మోదీకి.. ఆ విలువైన పురాతన సంపదను అందజేసింది బైడెన్ సర్కార్. ఆ విగ్రహాలు త్వరలోనే భారత్‎కు చేరుకోనున్నాయి. అంతకుముందు కూడా మోదీ తన విదేశీ పర్యటనల్లో భాగంగా,.. జర్మనీ సహా పలు యూరప్ దేశాల నుంచి పురాతన విగ్రహాలను, కళాఖండాలను తిరిగి తీసుకొచ్చారు.

అమెరికా తిరిగి అప్పగించిన కళాఖండాల్లో 157 కళాఖండాల్లో 71 సాంస్కృతిక చిహ్నాలు కాగా.. మిగతావాటిలో బొమ్మలు, పెయింటింగులు వగైరా వున్నాయి. 71 సాంస్కృతిక కళాఖండాల్లో 60 హైందవ సంస్కృతికి చెందిన విగ్రహాలు, కళాఖండాలు కాగా.. 16 బౌద్ధమతానికి, 9 జైన మతానికి చెందిన కళాఖండాలు ఉన్నాయి. వీటిలో సాధారణ శకానికి ముందు 2000 సంవత్సరాల నాటి రాగి వస్తువులతో పాటు యాంటిక్ వస్తువులు,.. అలాగే సాధారణ శకం 2వ శతాబ్దం నాటి టెర్రకోట వస్తువులు ఉన్నాయి. వీటిలో 45 వస్తువులు సాధారణ శకానికి ముందు నాటివని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో నృత్య గణపతి విగ్రహంతో పాటు.. 900 ఏళ్లనాటి నటరాజ విగ్రహాలు కూడా వున్నాయి.

మన పురాతన సంపదను తిరిగి తీసుకువస్తున్న మోదీ ప్రభుత్వంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే మోదీకి కృతజ్ఙతలు తెలిపారు. మా అమూల్యమైన జాతీయ సంపదలో భాగమైన కళాఖండాలను తిరిగి తీసుకొచ్చినందుకు ICCR తరఫున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నామంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఇది పరస్పర గౌరవం ఆధారంగా సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక మార్గమని కొనియాడారు.

అయితే, వెలకట్టలేని భారతీయ పురాతన సంపద తిరిగి భారత్‎కు చేరుకోవడం వెనుక ఓ వ్యక్తి సంవత్సరాల కృషి వుంది. రాత్రింబవళ్లూ శ్రమించి.. సాక్ష్యాధారాలు సేకరించి.. విదేశాల్లోని మ్యూజియంలలో వున్న మన వారసత్వ సంపదను గుర్తించారాయన. అతడే తమిళనాడుకు చెందిన విజయ్ కుమార్. భారతీయ కళాఖండాలను గుర్తించడంలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ పేరుతో ఓ ఎన్జీవో సంస్థను ఏర్పాటు చేసి.. దోపిడీకి గురైన మన పురాతన సంపదపై విశేషంగా పరిశోధనలు చేస్తున్నారు విజయ్ కుమార్. సంప్రదాయ కళలన్నా.. శిల్పాలన్నా విజయ్ కుమార్‎కు ఎనలేని అభిమానం. దేశం నుండి అక్రమంగా తరలించబడిన పవిత్ర విగ్రహాలను తిరిగి పుట్టినింటికి తీసుకురావడానికి ఆయన.. గత 14 ఏళ్ల నుంచి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు.

2011లో.. న్యూయార్క్‎కు చెందిన సుభాష్ కపూర్ అనే వ్యక్తి.. అక్రమంగా విగ్రహాల రవాణా చేస్తూ.. ఇంటర్ పోల్ పోలీసులకు చిక్కాడు. పక్కా సమాచారం మేరకు, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో సూభాష్ కపూర్ నడుపుతున్న 100 మిలియన్ డాలర్ల విలువైన స్మగ్లింగ్ రాకెట్ గుట్టువీడింది. అయితే, ఈ అక్రమార్కుడిని పట్టుకోవడం వెనుక విజయ్ కుమార్ కృషి వుంది. విజయ్ కుమార్ అందించిన సమాచారం మేరకే.. ఇంటర్ పోల్ పోలీసులు నాడు సుభాష్ కపూర్‎ను అరెస్ట్ చేశారు. ఇలా దేశంలోని సాంస్కృతిక వారసత్వ సంపదను సరిహద్దులు దాటిస్తున్న సుభాష్ కపూర్ లాంటి దుర్మార్గులు ఇంకా ఎంతో మంది వున్నారు. ఈ వ్యవస్థీకృత లిఫ్టింగ్ మాఫియాకు వ్యతిరేకంగా 2008 నుంచి పోరాటం చేస్తున్నారు విజయ్ కుమార్. సాక్ష్యాలను సేకరించడం, క్రిమినల్ ప్రాసిక్యూషన్లను భద్రపరచడం, పోలీసులకు సమాచారం చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇంతకుముందు కూడా మన దేశానికి చెందిన పురాతన విగ్రహాలను గుర్తించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. తమిళనాడులోని విరుద్ధాచలంలో ప్రఖ్యాతిగాంచిన పురాతన శివాలయం వుంది. ‘విరుద్ధగిరీశ్వరార్’ దేవాలయంగా పిలుచుకునే ఈ ఆలయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో దర్శనమిస్తాడు. ఇది దేశంలోని అరుదైన విగ్రహాల్లో ఒకటి. అయితే, గుడిలో వున్నది ఓ నకిలీ విగ్రహం. అసలైన విగ్రహం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వున్న ‘న్యూ‎సౌత్ వేల్స్ ఆర్ట్ గ్యాలరీ’లో వుంది. ఈ అసలైన విగ్రహాన్ని గుర్తించి, తిరిగి దేశానికి రప్పించేందుకు విజయ్ కుమార్ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. విజయ్ కుమార్ అసలైన అర్థనారీశ్వర విగ్రహాన్ని తీసుకొచ్చేవరకు.. తాము పూజిస్తున్నది ఓ నకిలీ విగ్రహమన్న సంగతి.. విరుద్ధగిరీశ్వరార్ ఆలయ పురోహితులకు గానీ, అధికారులకు గానీ తెలియదు. దీనిని బట్టి అక్రమార్కులు మన సాంస్కృతిక సంపదను ఎంత పకడ్బందీగా సరిహద్దులు దాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి ఎన్నో విగ్రహాలు దేశానికి తిరిగొచ్చేలా చేస్తున్నారు విజయ్ కుమార్. 2016 జూన్‎లో అమెరికా పర్యటన సందర్భంగా.. మోదీకి ఓ అరుదైన గణేషుడి విగ్రహాన్ని అందజేసింది నాటి ఒబామా ప్రభుత్వం. ఈ అరుదైన విగ్రహాన్ని తిరిగి పొందడానికి సాయం అందించింది కూడా విజయ్ కుమారే. దీంతో తొలిసారి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని 2013లో ఓహియోలోని టోలెడో మ్యూజియంలో గుర్తించారు. ఈ విగ్రహంపైనున్న మచ్చలను.. పుదుచ్చేరిలోని ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్‎లో వున్న ఛాయాచిత్రాలతో పోల్చిచూశామని.. తద్వారా అసలైన విగ్రహాన్ని గుర్తించామని చెప్పారు విజయ్ కుమార్. దీనికి సంబంధించిన వీడియోను ‘రిమూవర్ ఆఫ్ అబ్‎స్టాకిల్స్’ పేరుతో యూట్యూబ్‎లో కూడా అప్‎లోడ్ చేశారు. మొత్తానికి పూర్తి సాక్ష్యాలతో సహా నిరూపించిన తర్వాత.. టోలెడో మ్యూజియం బేషరతుగా వినాయకుడి విగ్రహాన్ని భారత ప్రభుత్వాన్నికి అప్పగించింది.

అంతేకాదు, 2020 మొదట్లో సీతాసమేత రామలక్ష్మణుల అరుదైన కాంస్య విగ్రహాన్ని కూడా ఇలాగే తిరిగి తీసుకొచ్చారు. ఈ విగ్రహం కొన్నేళ్ల క్రితం అపహరణకు గురైంది. ఇండియన్ ప్రైడ్ ప్రాజెక్ట్‎లో భాగంగా.. పుదుచ్చేరిలోని ‘ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరి’ని సంప్రదించి.. అందులో ఛాయాచిత్రాల ఆధారంగా పురాతన విగ్రహాలకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించారు. 1950, 60 దశంలో తమిళనాడుకు దేవాలయాలకు చెందిన.. దాదాపు 10 శాతం విగ్రహాల సమచారంతో.. ఫొటో డాక్యుమెంటరీని రూపొందించింది ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్. ఈ డాక్యుమెంటరీలో వేలాది పవిత్ర విగ్రహాలకు సంబంధించిన లక్షల కొద్ది ఛాయాచిత్రాలున్నాయి. అక్రమార్గంలో సరిహద్దులు దాటిన అరుదైన సంపదను తిరిగి పొందడంలో ఈ డాక్యుమెంటరీ కీలక పాత్ర పోషిస్తోంది.

అపహరణకు గురైన కళాఖండాలు, విగ్రహాలు, సాంస్కృతిక సంపదను సేకరించే ఉద్దేశంతో.. 2013లో ‘ఇండియన్ ప్రైడ్ ప్రాజెక్ట్’ స్థాపించారు. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో విజయ్ కుమార్ కూడా ఒకరు. గత జూలైలో ‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా’ నుంచి భారత ప్రభుత్వానికి ఎనిమిది విగ్రహాలు, ఆరు పెయింటింగులు అందించడంలో ఐపీపీ కీలక పాత్ర పోషించింది.

ఇటీవల విగ్రహాల అపరహణపై మాట్లాడిన ఓ ఐపీపీ వాలంటీర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాంస్కృతిక సంపదను సరిహద్దులు దాటిస్తున్న అక్రమార్కులకు ఎలాంటి భావోద్వేగ విలువలు ఉండవని.. విగ్రహాలను కేవలం సౌందర్య సాధనంగా మాత్రమ చూస్తారని అన్నారు. ఇందుకు ఇటీవల ఓ మారుమూల గ్రామం నుంచి తనకొచ్చిన ఈమెయిలే నిదర్శనమని తెలిపారు. తమ గ్రామంలోని ఓ పురాతన ఆలయం గురించి వివరించాచిన ఆ గ్రామస్తుడు.. తమ తాత ముత్తాతలకు అక్కడే శ్రాద్ధ కర్మలు జరిగేవని.. తమ తల్లిదండ్రులు కూడా ఆ గుడిలోనే వివాహం చేసుకున్నారని తెలిపారు. కానీ, ఆ గుడిలో ఇప్పుడు విగ్రహం లేదని.. ఆ విగ్రహం తిరిగి తీసుకురావడంలో సహాయం చేయాలని కోరుతూ ఈమెయిల్ పంపినట్టు ఐపీపీ వాలంటీర్ తెలిపారు. ఆ గ్రామస్తుడు.. విగ్రహాల అపహరణ అనేది జాతీయ స్థాయి నేరం కంటే కూడా.. తమ వ్యక్తిగత నష్టంగానే పరిగణిస్తున్నారని అన్నారు.

ఒక నివేదిక ప్రకారం, స్మగ్లర్లు దేశం నుండి అరుదైన కళాకృతుల తరలించడమే పనిగా పెట్టుకున్నారు. గుర్తించకుండా ఉండటానికి మొదట.. విగ్రహాలు, పురాతన వస్తువులను ముక్కలుగా విడగొట్టి,.. హాంకాంగ్, బ్యాంకాక్, దుబాయ్, లండన్, స్విట్జర్లాండ్ వంటి ప్రదేశాలకు తరలిస్తూవుంటారు. ఇలా మన దేశ సాంస్కృతిక, వారసత్వ సంపద సరిహద్దులు దాటిపోతోంది. దీనిని అరికట్టాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు.. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. ఇండియన్ ప్రైడ్ ప్రాజెక్ట్ కో ఫౌండర్ విజయ్ కుమార్.

ఏదేమైనా.. మోదీ తన అమెరికా పర్యటనలో 157 విగ్రహాలు, కళాఖండాలను తిరిగి పుట్టింటికి తీసుకురావడం శుభపరిణామం. అవి కేవలం కళాఖండాలు కావు. మన సాంస్కృతిక సంపద. మన వారసత్వ చిహ్నాలు. ఇలా అపహరణకు గురై ప్రపంచవ్యాప్తంగా వున్న మన పురాతన విగ్రహాలను, కళాఖండాలను తిరిగి తీసుకురావాలి. ఈ ప్రక్రియ కొనసాగుతూనేవుండాలి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here