ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ఖాతా ‘బ్లూ టిక్’ వివాదం

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ తీసేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే..! ఉపరాష్ట్రపతి అధికారిక అకౌంట్ కు ఎలా బ్లూ టిక్ తీసేస్తారంటూ పలువురు మండిపడ్డారు. దీనిపై ఉప రాష్ట్రపతి కార్యాలయం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ట్విట్టర్ మళ్లీ బ్లూ టిక్‌ను ఇచ్చింది.
ట్విట్టర్ పలు రకాల ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్‌ను ఇస్తుంది. బ్లూ టిక్ ఉంటే ట్విట్టర్ ధ్రువీకరించిందని అర్థం. ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, స్వచ్ఛంద సంస్థలు, వార్తా సంస్థలు, జర్నలిస్టులు, ఎంటర్టైన్మెంట్ సంస్థలు, క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులకు, పలువురు ప్రముఖులకు బ్లూ టిక్ ఇస్తుంది. ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తమ నిబంధనలను ఉల్లంఘించి వారి ఖాతాల నుంచి ట్విట్టర్ బ్లూ టిక్ తొలగిస్తోంది. ముందస్తుగా ఎటువంటి నోటీసులు, హెచ్చరికా చేయకుండా ఈ చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని తెలిపేలా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ఖాతా నుంచి బ్లూ టిక్ తొలగించింది. సాధారణంగా ఆరు నెలల పాటు యాక్టివ్ గా లేని ఖాతాలు, ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం చేయడం, పేరు మార్చుకోవడం వంటి చర్యలకు పాల్పడితే ట్విట్టర్ బ్లూ టిక్ గుర్తింపును తొలగిస్తుంది. వెంకయ్య నాయుడు ఆరు నెలలుగా తన వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ లు చేయడం లేదు. ఈ కారణంగానే ఆయన బ్లూ టిక్‌ను తొలగించింది. దీనిపై భారత ఉప రాష్ట్రపతి కార్యాలయం కూడా ట్విట్టర్‌కు అభ్యంతరాలు తెలిపింది. ఆరు నెలలుగా యాక్టివ్ గా లేని కారణంగానే వెంకయ్య నాయుడి ట్విట్టర్ ఖాతా నుంచి బ్లూ టిక్ తొలగించారని ఉప రాష్ట్రపతి కార్యాలయం నెటిజన్లకు కూడా తెలిపింది. తీవ్ర విమర్శలు రావడంతో తిరిగి వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ ఇచ్చింది. ఆయన ఉప రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతా మాత్రం ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుండడంతో దానిపై మాత్రం ట్విట్టర్ ఎటువంటి చర్యలే తీసుకోలేదు.

ట్విట్టర్ కొందరిని కావాలనే టార్గెట్ చేస్తోందా..?
ట్విట్టర్ సంస్థ భారత ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంది. అందుకే ప్రభుత్వంతో కయ్యానికి దిగుతున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంది. ఇలా ప్రముఖుల అకౌంట్ల మీద ట్విట్టర్ వివక్ష చూపడం కొత్తేమీ కాదు. గతంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అకౌంట్ ను కూడా రిమూవ్ చేసింది. అమిత్ షా అకౌంట్ ను సెన్సార్ చేసింది. కొద్దిరోజుల కిందట జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అకౌంట్ ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. అందుకు సరైన కారణాలను కూడా ట్విట్టర్ చెప్పలేదు.

గతేడాది నవంబర్ లో కూడా ఇలాంటి ఓ వివాదంలోనే ట్విట్టర్ ఇరుక్కుంది. యూనియన్ హోం మినిస్టర్ అమిత్ షా కు సంబంధించిన ప్రొఫైల్ పిక్ విషయంలో వివాదం నడిచింది. కాపీ రైట్ హోల్డర్ రిపోర్ట్ చేయడంతో అమిత్ షా ప్రొఫైల్ ఫోటోను డిస్ప్లే చేయడం జరగదని తెలిపింది. దీంతో పెద్ద ఎత్తున ట్విట్టర్ పై విమర్శలు వచ్చాయి.

కొందరి మీద మాత్రమే ట్విట్టర్ పని గట్టుకుని తమ రూల్స్ ను అప్లై చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను కూడా పర్మనెంట్ గా తొలగించారు. అయితే కొందరు భారతదేశం మీద విష ప్రచారం చేస్తున్నా, హిందుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నా కూడా ట్విట్టర్ పట్టించుకోవడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నిబంధనలను ట్విట్టర్ అమలు చేస్తోందని ఎంతో మంది బహిరంగంగా విమర్శిస్తూ ఉన్నారు.