భారత్ లోని ఎన్నో ప్రాంతాల్లో డి.ఆర్.డి.ఓ. అతి తక్కువ సమయంలోనే ఆసుపత్రులను నిర్మిస్తూ ఉంది. దేశం లోని పలు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేసింది డి.ఆర్.డి.ఓ. భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఆసుపత్రులను నిర్మించి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. కోవిడ్ కేసుల పెరుగుదల తరువాత డి.ఆర్.డి.ఓ. చాలా వేగంగా స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన పలు నగరాల్లో ఆసుపత్రులను నిర్మించారు. ఢిల్లీ లోని 750 పడకల సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ ఆసుపత్రి, గుజరాత్ అహ్మదాబాద్‌లో 900 పడకల ధన్వంతరి ఆసుపత్రి, పాట్నాలో 500 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి, వారణాసిలోని 750 పడకల పండిట్ రాజన్ మిశ్రా ఆసుపత్రి, 500 పడకల అటల్ లక్నోలోని బిహారీ వాజ్‌పేయి ఆసుపత్రి.. ఇలా మొదలైన చోట్ల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులను నిర్మించారు. ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేయడంలో విద్యుత్తు, నీటి కనెక్షన్లు ఇతర అవసరమైన అనుమతులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలు డి.ఆర్.డి.ఓ. కి సహాయం చేస్తున్నాయి. ఈ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగుల చికిత్స కోసం ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ సపోర్ట్ వంటి పూర్తి సౌకర్యాలను అందించనున్నారు. కరోనా కేసులు ఎక్కువ అయితే పడకల సంఖ్యను కూడా పెంచొచ్చు. మొదటి వేవ్ సమయంలో కొన్ని చోట్ల నిర్మించిన ఆసుపత్రులను కరోనా కేసులు తగ్గడంతో మూసి వేశారు. ఎప్పుడైతే సెకండ్ వేవ్ సమయంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరగడంతో ఈ ఆసుపత్రులు ఎన్నో ప్రాణాలను కాపాడాయి. అందుకే మరిన్ని నగరాల్లో ఈ తరహా ఆసుపత్రులను నిర్మించాలని కోరుతున్నారు.
హైదరాబాద్ లో కూడా డి.ఆర్.డి.ఓ. ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ విభాగం కోరింది. హైదరాబాద్ నగరంలో కూడా కోవిడ్ హస్పిటల్ ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ లేఖలో డి.ఆర్.డి.ఓ. ఛైర్మన్ సతీష్ రెడ్డిని కోరారు. కోవిడ్ థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారని వస్తున్న వార్తలపై ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారని రావినూతల శశిధర్ తన లేఖలో డి.ఆర్.డి.ఓ. కు తెలియజేశారు.
మన దేశం కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో డి.ఆర్.డి.ఓ. యొక్క కీలక పాత్రను ఎప్పుడూ వింటూనే ఉంటామని తెలిపారు. దేశం ప్రజల ప్రాణాలను కాపాడటానికి డి.ఆర్.డి.ఓ. ఎన్నో రకాలుగా సహాయపడుతోందని.. 2-డీజీ యాంటీ కోవిడ్ డ్రగ్ దగ్గర నుండి దేశంలో ఎన్నో ప్రాంతాల్లో నెలకొల్పిన ఆసుపత్రుల వరకూ డి.ఆర్.డి.ఓ. చేస్తున్న కృషి అమోఘమని శశిధర్ లేఖలో కొనియాడారు. డి.ఆర్.డి.ఓ. కార్యకలాపాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
హైదరాబాద్ లో ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం కనీసం 500 పడకలతో కూడిన తాత్కాళిక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ లో తాత్కాళిక కోవిడ్ ఆసుపత్రిని దివంగత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా ఏ.పి.జె. అబ్దుల్ కలాం పేరుతో నెలకొల్పితే బాగుంటుందని అన్నారు. కలాం గారికి హైదరాబాద్ లోని డి.ఆర్.డి.ఓ. తోనూ చిన్న పిల్లలతోనూ విడదీయలేని అనుబంధం ఉన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. తాత్కాళిక ఆసుపత్రి నిర్మాణానికి సికింబ్రాబాద్ లో రక్షణ శాఖకు సంబంధించిన అనేక ఖాళీ స్థలాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు రావినూతల శశిధర్ లేఖలో తెలియజేశారు.