More

    తెలంగాణ బీజేపీ సీనియర్ నేత జంగారెడ్డి మృతిపట్ల ప్రధాని న‌రేంద్ర మోదీ సంతాపం

    తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి (87) అనారోగ్య కార‌ణాల‌తో ఈ రోజు ఉద‌యం కన్నుమూశారు. జంగారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగానూ ప‌నిచేశారు. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. జంగారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ‌ నేత‌లు ప‌లు కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేసుకున్నారు. జంగారెడ్డి మృతి బీజేపీకి తీర‌నిలోట‌ని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. బీజేపీ వ్య‌వ‌స్థాప‌కుల్లో జంగారెడ్డి ఒక‌ర‌ని.. ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ సంతాపం తెలిపార‌ని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయ‌న కుమారుడికి మోదీ ఫోన్ చేశార‌ని, ఆయ‌న కుటుంబాన్ని ఫోనులో ప‌రామ‌ర్శించార‌ని తెలియజేశారు.

    ఆయ‌న మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సంతాపం వ్య‌క్తం చేశారు. జంగారెడ్డి కుమారుడు స‌త్య‌పాల్ రెడ్డికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేసి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. జనసంఘ్, బీజేపీ విజయ పథంలోకి తీసుకెళ్లడానికి జంగారెడ్డి విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ‘శ్రీ సి .జంగా రెడ్డి గారు ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. జన సంఘ్ నూ, బీజేపీ నూ ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఎంతో మంది ప్రజల మనసులలో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతో మంది కార్యకర్తలకు స్ఫూర్తినిచ్చారు. భాజపా క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారు. ఆయన మరణం పట్ల చింతిస్తున్నాను. ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలపడం జరిగింది. ఓం శాంతి’ అంటూ ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

    ఆయన రేంజి ఏమిటంటే:

    జంగారెడ్డికి ఎంత‌గా ప్ర‌జాభిమానం ఉందో చెప్ప‌డానికి 1984లో జ‌రిగిన ఎన్నిక‌లు ఒక ఉదాహ‌ర‌ణ అంటారు. ఆ ఏడాది దేశంలో జ‌రిగిన సాధారణ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలలో చందుప‌ట్ల‌ జంగారెడ్డి ఒకరు. హనుమకొండ పార్లమెంట్‌ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజారిటీతో ఆయన గెలిచారు. ఆ ఎన్నిక‌ల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌, ఉమ్మ‌డి ఏపీ వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలుపొంది స‌త్తా చాట‌గా, బీజేపీ ఏ మాత్రం నిలవలేకపోయింది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన నాయ‌కుడిగా జంగారెడ్డి నిలిచి త‌న బ‌లం ఏంటో నిరూపించుకున్నారు. ఉమ్మ‌డి ఏపీలో అప్ప‌ట్లో 30 సీట్లు సాధించిన ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగు దేశం కేంద్రంలో కీల‌క పాత్ర పోషించింది.

    Trending Stories

    Related Stories