More

  కృష్ణ మృతిపై ప్రముఖుల సంతాపం

  టాలీవుడ్ సూపర్ ‌స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్థరాత్రి కార్డియాక్ అరెస్టు కారణంగా ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

  సామాజిక స్పృహ కలిగించారు: కేసీఆర్
  కృష్ణ తన సినిమాలతో ప్రజలకు సామాజిక స్పృహ కల్పించారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సాంఘిక చిత్రాలతో జనాదరణ సంపాదించుకున్నారని, అప్పట్లో కార్మిక, కర్షక లోకం ఆయనను తమ అభిమాన హీరోగా, సూపర్ స్టార్‌గా కీర్తించేవారని గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థ స్థాపించి దాని ద్వారా సినీ పరిశ్రమలో నూతన ఒరవడులు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనని అన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  నిజ జీవితంలోనూ సూపర్ స్టార్:సీఎం జగన్
  కృష్ణ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా కృష్ణ కీర్తి గడించారని జగన్ కొనియాడారు. నిజజీవితంలోనూ ఆయన మనసున్న మనిషని అన్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాక, తెలుగు జాతికి కూడా తీరని లోటని అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు.

  కృష్ణ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది:చంద్రబాబు
  సూపర్ స్టార్ కృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన ఇక లేరన్న వార్త తనను కలచివేసిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్‌గా అభిమానులతో పిలిపించుకున్న ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని అన్నారు. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణను చెప్పుకుంటారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

  కృష్ణ స్ఫూర్తి అజరామరం: వెంకయ్య నాయుడు
  సూపర్ స్టార్ కృష్ణ మృతికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగు తెరపై కృష్ణ నింపిన స్ఫూర్తి అజరామరమని కొనియాడారు. సినిమాల్లోని ఆయన పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  చిత్ర పరిశ్రమ అభివ‌ృద్ధికి ఎంతో కృషి చేశారు:రేవంత్
  సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ గా వెలిగి, తెలుగు ప్రజల గుండెల్లో నటశేఖరుడిగా నిలిచిన కృష్ణగారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

  మాటలకు అందని విషాదం:చిరంజీవి
  మాటలకు అందని విషాదం ఇది.. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు.

  అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు.. భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేశ్ బాబుకు, ఆయన కటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను అని ఎంతో బాధగా రాసుకొచ్చారు.

  తెలుగు చిత్రసీమకు తీరని లోటు : పవన్ కళ్యాణ్
  దిగ్గజ నటుడు కృష్ణ మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. చిత్రసీమలో సూపర్‎స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణగారు…తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది అన్నారు. స్నేహశీలి, మృదుల స్వభావి అయిన ఆయన..ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివ‌ృద్ధికి కథనాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఆయన సేవలు చిరస్మరణీయమన్న పవన్…కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు : జూ. ఎన్టీఆర్
  కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయమని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

  Trending Stories

  Related Stories