కువైట్ జైలులో కడపకు చెందిన వెంకటేష్ ఆత్మహత్య

0
857

భారత్ కు చెందిన ఎంతో మంది విదేశాలకు వెళ్లి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు. కువైట్ లాంటి దేశాల్లో కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు. కొందరు యజమానులు పెట్టే టార్చర్ ను భరిస్తూ కూడా కాస్త ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఉంటున్నారు. అయితే ఏవైనా చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నా అక్కడి అధికారులు మన వాళ్లను పలు కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు. అలా ఓ కేసులో ఇరుక్కున్న కడప జిల్లాకు చెందిన వెంకటేష్ కువైట్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

కువైట్‌లోట్రిపుల్ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప జిల్లా వాసి వెంకటేష్ జైల్లోనే ఉరివేసుకొని మరణించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. మంచానికి ఉన్న వస్త్రంతో ఉరివేసుకొని చనిపోయాడు. వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని కడపలోని కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు తెలియజేశారు. వెంకటేష్ ఆత్మహత్య చేసుకొని ఉండడని.. జైలు అధికారులే చంపేసి ఉంటారని అతడి భార్య ఆరోపిస్తోంది. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన శ్రీరాములు కుమారుడు పిలోళ్ల వెంకటేశ్ మూడేళ్ల కిందట కువైట్ కి వెళ్లాడు. అక్కడ ఓ షేక్ ఇంట్లో డ్రైవర్‌గా పనిలో చేరాడు. రెండేళ్ల తర్వాత వెంకటేశ్ తన భార్య స్వాతిని కూడా కువైట్ తీసుకెళ్లాడు. భార్యాభర్తలిద్దరూ అక్కడే ఉంటుండగా, వాళ్ల ఇద్దరు పిల్లలు మాత్రం దిన్నెపాడులో తాత శ్రీరాములు దగ్గర ఉంటున్నారు. కువైట్‌లో వెంకటేశ్ పనిచేస్తున్న ఇంటి యజమాని ఇంట్లో మార్చి 6న దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి యజమానితో పాటు అతడి భార్య, కూతురిని చంపేసి డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు. వెంకటేషే ఈ హత్యలు చేశాడని కువైట్ పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల నుంచి వెంకటేష్‌కే ఎక్కువ ఫోన్ కాల్స్ వెళ్లాయని ఆ ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తప్పుడు కేసు పెట్టి తన భర్తను జైల్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారని వెంకటేష్ భార్య స్వాతి ఆరోపిస్తోంది. వెంకటేష్‌ని అరెస్ట్ చేసి.. తనను బలవంతంగా ఇండియా పంపించారని తెలిపింది స్వాతి. వెంకటేష్ హత్య చేసి ఉంటే సీసీ ఫుటేజీ ఎందుకు బయటపెట్టడం లేదని స్వాతి ప్రశ్నిస్తోంది. చనిపోయిన షేక్ కుటుంబానికి వారి బంధువులతో గొడవలు ఉన్నాయని కూడా తెలిపింది. అనవసరమైన కేసులో వెంకటేష్‌ను ఇరికించారని ఆమె ఆరోపిస్తోంది. తమ భర్తను విడిపించాల్సిందిగా ఇటీవల కడప కలెక్టర్‌ని కూడా ఆశ్రయించింది. వెంకటేష్ కుటుంబం ఆ ప్రయత్నాల్లో ఉండగానే జైల్లోనే వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త వచ్చింది.