గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయవాడలోని 50వ డివిజన్‌లో పర్యటించారు. కార్యక్రమంలో భాగంగా మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఇతర నాయకులతో కలిసి పర్యటించిన వెల్లంపల్లి వీఎల్‌వీ నాగబాబు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటికి వెళ్లారు. నాగబాబు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. మీరు రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడినట్టు టీడీపీకి చెందిన వారు ట్వీట్ చేశారని, మీరెందుకు ఆ విషయంపై మాట్లాడడం లేదని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న వెల్లంపల్లి ఆగ్రహంతో ఊగిపోయారు. అవన్నీ నీకెందుకు.. నీకేం కావాలో చెప్పాలని నిలదీశారు. ఆ ఆరోపణలను ప్రెస్‌మీట్ పెట్టి ఎప్పుడో ఖండించానని చెప్పారు. “వెళ్లవోయ్.. నోర్ముయ్’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడే ఉన్న సీఐ సుబ్రహ్మణ్యాన్ని పిలిచి ఆరోపణలు నిరూపించకుంటే నాగబాబును అరెస్ట్ చేయాలంటూ హుకుం జారీ చేశారు. తన వద్ద రుజువులు ఉన్నాయని, చూపిస్తానని చెప్పి ఫోన్ తీసుకొచ్చేందుకు వెళ్లగా.. ‘‘ఇక్కడ కాదు, అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించండి.. నిరూపించకుంటే అరెస్ట్ చేయండి’’ అని ఆదేశించి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఆ తర్వాత నాగబాబును పోలీసులు కొత్తపేట స్టేషన్‌కు తీసుకెళ్లారు. జనసేన విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నాగబాబును పరామర్శించారు. ఆపై ఉన్నతాధికారులతో మాట్లాడి విడిపించి బయటకు తీసుకొచ్చారు.