More

    వాసిరెడ్డి పద్మ వర్సెస్ బోండా ఉమా.. మాటల యుద్ధం

    మహిళా కమిషన్‌ వర్సెస్ టీడీపీ కొనసాగుతూనే ఉంది. విజయవాడలో మీడియా సమావేశంలో మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, సభ్యురాలు జి లక్ష్మి టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు. బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని, అతనికి మహిళలే బుద్ధి చెబుతారని విమర్శించారు. బోండా ఉమా నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు.. కాలకేయుడిలాంటి నీకు మహిళలే బుద్ధి చెబుతారని అన్నారు. మహిళల పట్ల మరోమారు అమర్యాదగా మాట్లాడితే చెప్పుదెబ్బలు తింటావని హెచ్చరించారు. తమకేమీ పబ్లిసిటీ పిచ్చి లేదని పద్మ అన్నారు. కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు అని, ఇప్పుడు బోండా ఉమ కారణంగా చంద్రబాబుకు చెడ్డపేరు వచ్చిందని టీడీపీ వాళ్లే బోండా ఉమను తిడుతున్నారని ఎద్దేవా చేశారు. తనను మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి నుంచి దించేవరకు పోరాడాలని బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపించాడని, బోండా ఉమ తన పేరును సార్థకం చేసుకుంటున్నాడని, టీడీపీ ఉత్తమ నారి బోండా ఉమ అని అన్నారు. బోండా ఉమను ఇప్పటివరకు ఓ ఆకు రౌడీ అనుకున్నానని, తాజా పరిణామాలతో మరీ చిల్లర రౌడీ అని అర్థమైందని అన్నారు.

    మహిళా కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని వాసిరెడ్డి పద్మ టీడీపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. బోండా ఉమ మహిళల పట్ల సోయిలేకుండా మాట్లాడుతున్నాడు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులకు విద్యార్ధి బలైపోతే ఒక్క టీడీపీ నేత వచ్చాడా.. వినోద్ జైన్ కేసులో మూడు నెలలైనా స్పందించని దిక్కుమాలిన పార్టీ మీదని విమర్శించారు.

    అంతకుముందు ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బొండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ పై వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటోందని.. దారుణం జరిగిన మూడు రోజుల తర్వాత పరామర్శకు వాసిరెడ్డి పద్మ వచ్చారని విమర్శించారు. ఆమె ఒక బజారు మనిషిలా మాట్లాడుతున్నారని.. ఆమె ఒరేయ్ అంటే.. తాము ఒసేయ్ అనలేమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ను వాసిరెడ్డి పద్మ రోడ్డున పడేశారని చెప్పారు. కేవలం రాజకీయ కక్షతోనే తమకు నోటీసులిచ్చారని అన్నారు. తాము బాధితురాలిని కలవడానికి వెళ్తున్నామని తెలిసే.. వాసిరెడ్డి పద్మ అక్కడికి చేరుకుని ఓవరాక్షన్ చేశారని అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని రోడ్డుకు లాగిందే వాసిరెడ్డి పద్మ అని తీవ్ర విమర్శలు చేశారు. ఈనెల 27లోగా బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

    Trending Stories

    Related Stories