తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వార్షిక వసంతోత్సవాలు

0
754

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో మే 15 నుండి 17వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. వసంతోత్సవాలు సందర్భంగా మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపిసహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహించారు.

అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

వసతోత్సవం కోసం మే 14వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ. 150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ ఉత్స‌వాల్లో భాగంగా మే 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2. 30 నుండి 4. 30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7 నుండి 8. 30 గంటల వరకు అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 15 నుండి 17వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 16న అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ దామోదరం పాల్గొన్నారు.