More

  వనమా రాఘవ అరెస్ట్.. బయటకు వస్తున్న ఎన్నో దారుణాలు

  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతలపూడి వద్ద గత రాత్రి పదిన్నర గంటల సమయంలో పట్టుకున్నారు. రాఘవను ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. రామకృష్ణ ఆత్మహత్య తర్వాత రాఘవకు సంబంధించిన మరిన్ని అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. పాల్వంచ ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో విచారించేందుకు ఏఎస్పీ ఎదుట శుక్రవారం హాజరు కావాలంటూ గురువారం అర్ధరాత్రి రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావు నివాసానికి నోటీసులు అంటించారు. పరారీలో ఉన్న రాఘవ హాజరు కాలేదు.

  కుమారుడి కుటుంబం ఆత్మహత్యపై రామకృష్ణ తల్లి సూర్యవతి స్పందించారు. వనమా కుటుంబానికి, తమకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, అప్పుల విషయంలో రాఘవ పంచాయితీ చేయడం నిజమేనని సూర్యవతి, రామకృష్ణ సోదరి మాధవి తెలిపారు. తన భార్యను రాఘవ పంపమన్నాడని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయం తమకు చెప్పలేదని, చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. రామకృష్ణ ఆత్మహత్య చేసుకుంటూ తమ మీద లేనిపోని నిందలు మోపాడని చెప్పారు.

  నాగ రామకృష్ణ. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోల్లో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాఘవతోపాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో తీవ్ర మానసిక క్షోభ అనుభవించానని తెలిపారు. తన సోదరితో రాఘవకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉందన్నారు. వాటాలు పంచకుండా చివరికి చావు వరకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ద్వారా తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని రాకుండా అడ్డుకున్నారని వాపోయారు. అందుకే తాను అప్పుల ఊబిలోకి కూరుకుపోయానని అన్నారు. తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయొద్దని రామకృష్ణ ఆ వీడియోలో వేడుకున్నారు.

  టీడీపీ కార్యకర్త హత్య, మరో వ్యక్తి ఆత్మహత్య కేసులోనూ రాఘవ ప్రమేయం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. పాత పాల్వంచకు చెందిన చెర్ల చిట్టెయ్య పట్టణంలోని స్పాంజ్ ఐరన్ కంపెనీలో పనిచేసేవాడు. అప్పట్లో అతడు టీడీపీలో క్రీయాశీలకంగా ఉండేవాడు. ఈ క్రమంలో 1993లో పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎన్‌టీయూసీని బలపరిచాడు. ఐఎన్‌టీయూసీకి మద్దతివ్వాలంటూ రాఘవ ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి ఆయన నిరాకరించాడు. ఆ తర్వాత ఒక రోజు విధులకు వెళ్లిన చిట్టెయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. కొన్ని రోజులకు గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి శరీర భాగాలు లభ్యమయ్యాయి. అవి చిట్టెయ్యవేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. చిట్టెయ్య హత్యలో రాఘవనే నిందితుడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐదేళ్లపాటు జరిగిన ఈ విచారణలో సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు ఈ కేసును కొట్టేసింది.

  పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు బొల్లోరిగూడెంలోని ఓ వ్యక్తి వద్ద రూ. 25 లక్షల చిట్టీలు రెండు వేశాడు. గడువు ముగిసినప్పటికీ నిర్వాహకుడు చిట్టీ డబ్బులు రూ. 50 లక్షలు చెల్లించలేదు. ఒత్తిడి తీసుకురావడంతో ఓ ప్లాటు రాసిచ్చాడు. అదే ప్లాటును సత్తుపల్లికి చెందిన ఓ కానిస్టేబుల్‌కి కూడా విక్రయించాడు. విషయం తెలిసిన వెంకటేశ్వరరావు.. రాఘవను ఆశ్రయించాడు. న్యాయం చేస్తానని చెప్పిన రాఘవ రూ. 10 లక్షలు వసూలు చేశాడు. చిట్టీ నిర్వాహకుడు అంతకు రెట్టింపు ఇస్తానని చెప్పడంతో రాఘవ ఆ వ్యక్తికి అనుకూలంగా మాట్లాడాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తిరిగి వెంకటేశ్వరరావు పైనే కేసు పెట్టి 14 రోజులు రిమాండ్‌కు పంపారు. ఆ తర్వాత బెయిలుపై వచ్చిన బాధితుడు తన ఆత్మహత్యకు 42 మంది కారకులంటూ వారి పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చిట్టీ నిర్వాహకుడిని ఏ1గా, రాఘవను ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ విచారణ మాత్రం జరగలేదు.

  రామకృష్ణ సూసైడ్‌ లెటర్‌, సెల్ఫీ వీడియో ఆధారంగా.. వనమా రాఘవపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దమ్మపేట వద్ద.. రాఘవను అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్‌ దత్‌ ధ్రువీకరించారు. రామకృష్ణ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రపై టీఆర్ఎస్‌ అధిష్టానం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది. వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

  Trending Stories

  Related Stories