నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పిన వల్లభనేని వంశీ

0
1174

కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాటల యుద్ధం సాగింది. అయితే అవి కాస్తా లిమిట్ దాటేశాయని ప్రతి ఒక్కరికీ తెలిసిందే..! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చారు. రాష్ట్రం లోని చాలా ప్రాంతాల్లో టీడీపీ నేతలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాము ఎలాంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో చేయలేదని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాను నారా భువనేశ్వరిపై పొరబాటున వ్యాఖ్యలు చేశానని, తీవ్ర భావోద్వేగాల నడుమ ఒక మాట తప్పుగా దొర్లిందని అంగీకరించారు. అందుకు తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, ఆత్మసాక్షిగా క్షమాపణలు తెలుపుకుంటున్నానని వంశీ వెల్లడించారు. తాను భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని వివరించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని, తన నుంచి మరోసారి ఇలాంటి పొరబాటు వ్యాఖ్యలు రావని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు.

“నా వ్యాఖ్యలకు నేను బాధపడుతున్నా.. టీడీపీలో నాకు అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి. భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా.. అని అన్నారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నా. చంద్రబాబు నాయుడును కూడా క్షమపణ కోరుతున్నా.. తప్పు జరిగినందుకు పశ్చాత్తాప పడుతున్నానని అన్నారు. ఈ వివాదంలో అందరూ సంయమనం పాటించాలని అన్నారు. నా నుంచి ఇంకోసారి ఇలాంటి తప్పు దొర్లదు. నా ఆత్మ సాక్షిగా క్షమాపణ చెబుతున్నాను” అని వంశీ అన్నారు.

కులానికి సంబంధించి చంద్రబాబు నాయుడుపై వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు చేశారు. కుట్రలు పన్నడం చంద్రబాబు నేచర్ అని.. చంద్రబాబే ఈ కులానికి పట్టిన అతిపెద్ద చీడపురుగు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉండగా, ఈ కులం బాగుపడదని అన్నారు. ఈ కులానికి చంద్రబాబో, తానో, కొడాలి నానినో మొదలు కాదు.. చివర కాదన్నారు. తాను సుమారు 15- 16 ఏళ్ల నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని.. 8 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నానని వల్లభనేని వంశీ గుర్తు చేశారు. తాము దేన్ని అయినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. తాను, కొడాలి నాని వీళ్ల తాటాకు చప్పుళ్లకు, ఉడత ఊపులకు, పిచ్చి వాగుళ్లకు భయపడే రకం కాదని స్పష్టం చేశారు.