More

  లీలామయుడు కొలువైన వాడపల్లి విశిష్టాలెన్నో..!

  అదొక మహిమాన్విత అద్బుత శివలింగం. నిత్యం స్వామి వారి తల భాగం నుంచి గంగమ్మ ఉబికి వస్తుంది. తన వద్దకు వచ్చే భక్తుల పాపాలను హరిస్తూ .. కోరిన కోర్కెలను ఆ శివుడు తీరుస్తున్నాడు. ఆ లీలామయుడు కొలువున్న వాడపల్లి శివాలయ విశేషాలు తెలుసుకుందాం.

  నల్గొండ జిల్లాలో ప్రసిద్ధి చెందిన శివాలయక్షేత్రాల్లో వాడపల్లిది ప్రత్యేక స్థానం. దక్షిణ కాశీగా పిలవ బడుతోంది. శ్రీమీనాక్షి అగస్త్వేశ్వర స్వామిగా భక్త కోటి నీరాజనాలు అందుకుంటున్నాడు పరమశివుడు. శివాలయంలో ఉన్న అద్భుత శివలింగం కృతయుగం నాటిదని.. 6 వేల ఏళ్ల చరిత్ర ఉందని అంటారు. ఈ శివలింగాన్ని అగస్త్వేశ్వర స్వామి వారు ప్రతిష్టించారని ప్రతీతి. పరమేశ్వరుడి ఆలయానికి అభిముఖంగా కృష్ణా, ముచికుంద నదుల పవిత్ర సంగమం జరుగుతోంది. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతనే స్వామివారిని దర్శించుకుంటారు. గర్బాలయంలో పానువట్టం మీద లింగ రూపంలో రెండు అడుగుల ఎత్తులో ఉండి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ శివలింగం మీద ఒక చిన్న గుంట ఉండి అందులో నుంచి నీరు ఎప్పుడూ ఉబికి వస్తూ ఉంటుంది. అయితే ఆ నీరు శివలింగం పైనుంచి కిందకు పొర్లదు. అంతే కాకుండా ఆ నీటి మట్టం ఎప్పుడూ ఒకే రకంగా వస్తూనే ఉంటుంది. అయితే ఆ గంగా జలం ఎక్కడి నుంచి వస్తుందో దైవ రహస్యం. పైకి వచ్చే ఆ గంగమ్మ.. స్వామి వారి తలభాగం నుంచి మాత్రం జాలువారకపోవడం విచిత్రం. అలా స్వామి వారి తలపై నుంచి ఉబికి వచ్చే పవిత్ర గంగా జలాన్ని భక్తుల శిరస్సులపై చల్లి, తీర్థంగా అందిస్తారు.

  శ్రీ మీనాక్షి అగస్త్వేశ్వర స్వామి దేవాలయ క్షేత్రానికి పురాణ కథనం ఉంది. ఒకరోజు.. పక్షిని తన విల్లుతో బోయవాడు కొట్టబోయాడట. ఆ పక్షి వచ్చి శివలింగం వెనుక దాక్కొంటుంది. అది చూసిన శివుడు జాలిపడి ఆ పక్షిని రక్షించాలని బోయవాడ్ని వారించాడు. అయితే ఆ బోయవాడు తన ఆకలి తీరేదెలా అని ప్రశ్నించగా.. తన తల నుంచి కొంత తీసుకోవాలని శివుడు సూచిస్తాడు. స్వామి వారి సూచనతో ..శిరస్సును కొంత మేర ఖండించి చేతి వేళ్లతో మాంసాన్ని బోయవాడు తీసుకొంటాడు. ఆ తర్వాత స్వామివారికైన గాయాన్ని.. కడిగేందుకు నేరుగా గంగమ్మే వచ్చిందని.. అందువల్లే శివలింగంపై గుంటలో నీరు ఉబికి వస్తోందంటారు.

  క్రీస్తుశకం 1524లో శ్రీ శంకరాచార్యలు ఈ ఆలయాన్ని సందర్శించారని చెబుతారు. ఆ బిలం లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ఉద్దరిణికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారు. ఎంతో లోపలికి వెళుతూనే ఉంది.. లాభం లేదనుకుని.. ఆ తాడును పైకి లాగారు. ఉద్దరిణికి రక్త మాంసాలు అంటుకున్నాయి కాని ఆ బిలం లోతు తెలియలేదు. దీంతో శంకరాచార్యలు తాను చేసిన దానికి తత్వం బోధపడి స్వామిని ప్రార్థించాడట. ఆతర్వాత శంకరాచార్యులు శాంతి పూజలు నిర్వహించి సంప్రోక్షణ చేసినట్లు తెలుపే రాతి శాసనం ఇక్కడ ఉంది.

  రెడ్డి రాజుల ఏలుబడిలో దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం పుట్ట నుంచి బయటపడిన స్వామి వారికి ఆలయం కట్టించారు. అప్పటి నుంచి నేటి వరకు పరమశివుడు.. వైభవోపేతంగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఈ శివాలయంలో ఎడమవైపున గణపతి, కుడివైపున శ్రీ అగస్త్య మహాముని, లోపాముద్రదేవి దర్శనమిస్తారు. గర్భాలయం ముందు భాగంలో… స్వామివారికి కుడి వైపున కుమార స్వామి, ఎడమవైపున శ్రీ మీనాక్షి అమ్మవారు ప్రసన్న వదనంతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటారు. సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు ఉన్నాడనేందుకు శివలింగం నుంచి ఉబికి వస్తున్న గంగమ్మే నిదర్శనం. శ్రీమీనాక్షి అగస్త్వేశ్వర దేవాలయాన్ని ఒక్కసారైనా.. దర్శిస్తే పుణ్యమని భక్తుల విశ్వాసం.

  spot_img

  Trending Stories

  Related Stories