కరోనా వైరస్ కట్టడికి భవిష్యత్తులో బూస్టర్ వ్యాక్సిన్ డోసులు కూడా వేసుకోవాల్సిన అవసరం రావచ్చని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు.భవిష్యత్తులో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి ఈ చర్య తీసుకోవాల్సి ఉంటుందని.. చాలా మందిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోందని అన్నారు. అందువల్ల కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించుకోవాలని తెలిపారు. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతూ కరోనా వేరియంట్లన్నింటినీ ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన రెండో తరం వ్యాక్సిన్లు రాబోతున్నాయని చెప్పారు. ఈ బూస్టర్ డోసులపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని.. డిసెంబరులోగా అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. చాలా మందిలో వ్యాధి నిరోధకత తగ్గిపోతున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. జైడస్ ట్రయల్స్ పూర్తయ్యాయని, అత్యవసర అనుమతి కోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ ట్రయల్ కూడా ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నదన్నారు. ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించిందని తెలిపారు.
సెప్టెంబరు చివరి నాటికి భారత్‌లో చిన్నారులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రణ్‌దీప్ గులేరియా తెలిపారు . చిన్నారులపై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయని.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా సంస్థకు చెందిన మరో వ్యాక్సిన్ ఈ ఏడాది చివరినాటికి చిన్నారులకు అందుబాటులోకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు కంపెనీల టీకాలకు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ పిల్లలను ఇన్‌ఫెక్షన్ ప్రమాదం నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం వైరస్ ట్రాన్స్‌మిషన్ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుందని అన్నారు.
దేశంలో ఇప్పటివరకు 42 కోట్లకు పైగా మందికి కొవిడ్ వ్యాక్సిన్లు అందించామని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా పెద్దలకు టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గులేరియా వెల్లడించారు.