More

    పిల్లలకూ టీకాలు వచ్చేస్తున్నాయి

    కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే టీకాలు తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే పెద్దలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను వేస్తూ ఉండగా.. ఇక చిన్న పిల్లలకు వ్యాక్సిన్లను వేసే విషయమై అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కోవిడ్ -19 వ్యాక్సిన్ కోర్బెవాక్స్ యొక్క రెండు క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్-ఇ ఫార్మా సంస్థ కోర్బెవాక్స్ పేరుతో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. కోర్బెవాక్స్ పూర్తిగా దేశీయ వ్యాక్సిన్. దీన్ని 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వేసేలా రూపొందించారు. దీనికి తదుపరి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ తాజాగా అనుమతులు మంజూరు చేసింది. స్వదేశీ డ్రగ్ మేకర్ అధికారిక ప్రకటన ప్రకారం, పిల్లలు మరియు కౌమారదశలో ఉన్న వారిపై కోవిడ్ -19 టీకా అధ్యయనాలను ప్రారంభించవచ్చు. దేశవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఈ క్లినికల్‌ పరీక్షలు చేపట్టనున్నారు.

    గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా కంపెనీ తయారు చేసిన జైకోవ్‌–డీ కరోనా వ్యాక్సిన్‌ ఈ నెల 15వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 12 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ టీకా ఇవ్వొచ్చని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లుగానే ఈ కొత్త టీకాను కూడా ఇచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. పిల్లలకు టీకాలు వస్తుండడం చిన్న పిల్లలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది. పిల్లలను స్కూళ్లకు, కాలేజీలకు పంపడానికి చాలామంది తల్లిదండ్రులు జంకుతుండగా.. కీలకమైన సమయంలో కొత్త టీకా అందుబాటులోకి వస్తోంది. జైకోవ్‌–డీ టీకా మూడు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు వేసుకున్న 28 రోజులకు రెండో డోసు వేస్తారు. ఆ తర్వాత మరో 28 రోజులకు మూడో డోసు వేస్తారు. మొత్తంగా మూడు డోసులను 56 రోజుల్లోగా పూర్తి చేస్తారు. జైకోవ్‌–డీ టీకాను ఈ నెల 15వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో వేసేలా ప్రణాళిక రచించినట్లు చెబుతున్నారు. మార్కెట్లోకి వచ్చాక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొత్త టీకా వేయనున్నారు. జైకోవ్‌–డీ ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ టీకా. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ సురక్షితం అని కంపెనీ చెబుతోంది. ఇది ఇంట్రాడెర్మల్‌ వ్యాక్సిన్‌. ఫార్మాజెట్‌ అనే పరికరంతో దీన్ని చేతిపై ప్రెస్‌ చేస్తారు. దీంతో చర్మం లోపలి పొరల్లోకి వ్యాక్సిన్‌ వెళుతుంది. సూది రహిత టీకా కావడం వల్ల చేతి దగ్గర నొప్పి ఉండే అవకాశం లేదు. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేయవచ్చు.

    నవంబర్‌ నెలలో భారత్‌ బయోటెక్‌కు చెందిన మరో టీకా అందుబాటులోకి రానుంది. దాన్ని రెండేళ్లకు పైబడిన వారందరికీ వేయడానికి వీలుంటుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

    వ్యాక్సిన్ రేసులో రిలయన్స్:

    రిలయన్స్ లైఫ్ సైన్సెస్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. రిలయన్స్ అభివృద్ధి చేసిన ఈ టీకాకు అనుమతి కోరుతూ గత నెల 26న నిపుణుల కమిటీకి దరఖాస్తు చేయగా పరిశీలించిన కమిటీ, అనుమతుల కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సిఫార్సు చేసింది. డీసీజీఐ తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో క్లినికల్ పరీక్షలకు రిలయన్స్ సిద్ధమైంది. మహారాష్ట్రలోని 8 చోట్ల ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

    Trending Stories

    Related Stories