కరోనా మహమ్మారితో భారత్ పోరాడుతూ ఉంది. ముఖ్యంగా కరోనా కేసుల కట్టడికి వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమని భారత ప్రభుత్వం భావించి వ్యాక్సిన్లను వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలని భావిస్తూ ఉంది. వ్యాక్సిన్లు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఇప్పటికే ఎంతో మంది నిపుణులు వెల్లడించారు. ప్రాణాపాయ పరిస్థితి నుండి కాపాడుతాయని.. భారీగా వ్యాక్సినేషన్ అన్నది జరిగితే కరోనా మహమ్మారిని అంతం చేయొచ్చని చెబుతున్నారు.
ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అధ్యయనంలో కూడా ఇదే విషయం బయటకు వచ్చింది. వ్యాక్సిన్ల సామర్థ్యంపై ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనంలో సంతృప్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వాళ్లలో ఎలాంటి మరణాలు సంభవించలేదని.. వ్యాక్సిన్ తో కరోనా మరణాలన్నవి దూరమయ్యాయని ఎయిమ్స్ చెబుతోంది. టీకా వేయించుకున్నా.. కరోనా పాజిటివ్ గా వచ్చిన వారిలో ఏమంత తీవ్ర లక్షణాలు ఉండడంలేదని చెప్పారు. విషమ పరిస్థితిగా భావించాల్సిన అవసరం కనిపించడంలేదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ పొందిన 63 మంది కరోనా రోగులపై ఈ అధ్యయనం చేపట్టారు. వారిలో 36 మంది రెండు డోసులు పొందగా, 27 మంది సింగిల్ డోస్ తీసుకున్నారు. వారిలో 53 మంది కొవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ వేయించుకున్నారు. వారికి కరోనా సోకినప్పుడు పరీక్ష చేయగా, వారి శాంపిళ్లలో వైరల్ లోడ్ అధికస్థాయిలోనే కనిపించింది. వీరిలో వ్యాక్సిన్ తీసుకోని కరోనా రోగుల మాదిరే జ్వరం కూడా 5 నుంచి 7 రోజుల పాటు కనిపించినా, అదేమంత ఇబ్బంది పెట్టేంత స్థాయిలో లేదని గుర్తించారు.
భారత్‌లో వెలుగుచూసిన డెల్టా వేరియంట్(బి.1.617.2)పై ఫైజర్ టీకా సామర్థ్యం తక్కువేనని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది. ఒరిజినల్ వేరియంట్‌పై టీకా చూపుతున్న ప్రభావంతో పోలిస్తే డెల్టా రకాన్ని ఎదుర్కొనడంలో చూపుతున్న ప్రభావం తక్కువని.. డెల్టా వేరియంట్‌పై పోరాడే యాంటీబాడీలు చాలా తక్కువ స్థాయిలో విడుదలవుతున్నట్లు వెల్లడించింది. ఓకే డోసు తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే సామర్థ్యం మరింత తక్కువని తేలింది. ఫైజర్ తొలి డోసు తీసుకున్న వారిలో 79 శాతం మందిలో ఒరిజినల్ స్ట్రెయిన్‌ను నిర్వీర్యం చేయగలిగే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. యూకేలో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్(బి.1.1.7)ను ఎదుర్కొనే యాంటీబాడీలు 50 శాతం మందిలో, డెల్టా వేరియంట్‌తో పోరాడే యాంటీబాడీలు 32 శాతం మందిలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.351 వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు 25 శాతం మందిలో ఉత్పత్తి అయినట్లు తెలిపింది. వీటితో పోరాడాలి అంటే వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా ప్రజలకు అందజేయాలని అధ్యయనం సూచించింది. రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించి వీలైనంత త్వరగా రెండో డోసు అందించాలని.. బూస్టర్ డోసులు కూడా ఇవ్వాలని సూచించింది.