More

    మదర్సాల్లో అందరికీ అడ్మిషన్.. ఎక్కడో తెలుసా..?

    ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు మదర్సాలలో పిల్లలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది మదర్సాలలో డ్రెస్ కోడ్, NCERT సిలబస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మదర్సాల విద్యావ్యవస్థను ఆధునీకరించే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మతపరమైన విద్య సమయాన్ని తగ్గించాలని కూడా యోచిస్తోంది. మతపరమైన విద్య వ్యవధి ఒక గంటకు మాత్రమే పరిమితం చేయనున్నారు.. ఉదయం 6:30 నుండి 7:30 వరకు మాత్రమే మత పరమైన విషయాలను బోధించనున్నారు. ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, విద్యార్థులు అకడమిక్ సబ్జెక్టులను మాత్రమే చెప్పనున్నారు.

    ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు రాష్ట్రంలోని మదర్సాలకు NCERT సిలబస్, డ్రెస్ కోడ్‌ను వచ్చే ఏడాది నుండి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. మదర్సాలలో విద్యపై మార్పులు తీసుకుని రావడమే కాకుండా.. ఆధునీకరించడానికి వక్ఫ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌, డ్రెస్‌ కోడ్‌ అమల్లోకి రావడంతో మదర్సాలలో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలకు అనుగుణంగా విద్యాబోధన జరుగుతుందని ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షాదాబ్ షామ్స్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా మదర్సాలలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలల తరహాలో ఎన్‌సిఇఆర్‌టి సిలబస్, డ్రెస్ కోడ్‌ లను ప్రవేశపెడతామని, విద్యార్థులు ఇతర పాఠశాలల విద్యార్థులతో సమానంగా ఉంటారు.” అని చెప్పుకొచ్చారు. అన్ని మతాల వారికీ వాటిలో అడ్మిషన్లు ఇస్తామని అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో 103 మదర్సాలు నడుస్తున్నాయి.

    “ఒక చేతిలో పవిత్ర ఖురాన్.. మరో చేతిలో ల్యాప్‌టాప్ పట్టుకుని మదర్సాకు వెళ్లే పిల్లలను చూడాలని అనుకుంటున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నాము. మదర్సాలు ఆధునిక విద్యా కేంద్రాలుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాము” అని షామ్స్ తెలిపారు. ఇక హఫీజ్-ఎ-ఖురాన్ వ్యవధిని కూడా పెంచాలని వక్ఫ్ బోర్డు నిర్ణయించింది. దీన్ని నాలుగేళ్ల నుంచి పదేళ్లకు పొడిగిస్తారు. ఈ కోర్సు ముగిసే సమయానికి పిల్లలు 10 లేదా 12 ఉత్తీర్ణులై ఉంటారని షామ్స్ చెప్పారు. వారు కేవలం మతపరమైన విద్యను అభ్యసించాలనుకుంటున్నారా లేదా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నారా అని నిర్ణయించుకోవడానికి పిల్లలకంటూ ఓ ఐడియా ఉంటుందని తెలిపారు.

    ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, సాంఘిక సంక్షేమం, మైనారిటీ వ్యవహారాల మంత్రి చందన్ రామ్ దాస్ ఈ విషయంపై అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మదర్సా విద్యార్థులకు NCERT పుస్తకాలను ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని వక్ఫ్ బోర్డు కోరింది. డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్‌సింగ్ నగర్‌లలో రెండేసి చొప్పున, నైనిటాల్‌లో ఒక మోడల్ మదర్సాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వాటిలో స్మార్ట్ క్లాసులు ఉంటాయన్నారు. మదర్సాలలో చదివే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాకుండా.. ఇతర స్కూల్స్ విద్యార్థులతో పోటీ పడడానికి సిద్ధం చేయాలని అనుకుంటూ ఉన్నారు. విద్యార్థుల కోసం వక్ఫ్ బోర్డు రాబోయే సంవత్సరాల్లో భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది.

    Trending Stories

    Related Stories